ఈ… ‘ఢీ’…

స్పెషల్ కరస్పాండెంట్:

ఢిల్లీ లిక్కర్ స్కాం దర్యాప్తులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరింత దూకుడు కొనసాగిస్తోంది. దేశ వ్యాప్తంగా ఈ కేసులో ఇప్పటికే మూడు సార్లు సోదాలు నిర్వహించిన ఈడీ బృందాలు శుక్రవారం ఢిల్లీలో మరో 25 ప్రాంతాల్లో సోదాలు చేపట్టాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో దాడులు చేసి కీలక సమాచారం అందుకున్న ఈడీ అధికారులు ఈ సారి సీబీఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా దేశ రాజధానిలో మద్యం వ్యాపారుల నివాసాలతో పాటు వారికి సంబంధించిన వివిధ ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తోంది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అనుచరుడు అమిత్ అరోరా లక్ష్యంగా ఈ సోదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. సమీర్ మహేంద్రు ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా కీలక విషయాలు రాబట్టే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. విజయ నాయర్, అభిషేక్ రావులను ఇప్పటికే అరెస్ట్ చేసిన సీబీఐ వారి నుండి పలు కీలక అంశాలను రాబట్టగలిగింది. ముఖ్యంగా అరుణ్ పిళ్లైతో అభిషేక్ రావుకు సంబంధాలు ఉన్నాయని వీరిద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగాయని సీబీఐ గుర్తించింది. ఈ నేపథ్యంలో అభిషేక్ రావు కస్టడీని మరో రెండు రోజులు కోర్టు పొడిగించింది. ఈ కేసులో సీబీఐ, ఈడీ దర్యాప్తు విషయంలో దూకుడుగా విచారణ కొనసాగిస్తున్నాయి. శుక్రవారం ఉదయం నుండి ఈడీ మరోసారి సోదాలు నిర్వహించడం దేశ వ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది.

ఢీల్లీ… హైదరాబాద్…

లిక్కర్ స్కాంలో వాస్తవాలు ఏంటి? ఈ వ్యవహారంలో ఎవరి ప్రమేయం ఎంత మేర ఉందనే కూపీని లాగేందుకు దర్యాప్తు సంస్థలు అన్ని కోణాల్లో ఆరా తీయరం ఆరంభిచాయి. అయితే దేశ రాజధాని ఢిల్లీ లిక్కర్ స్కాంతో అనుభందాలు ఎక్కువగా హైదరాబాద్ కు చెందిన వారితోనే ఉండడం జాతీయ స్థాయిలో చర్చకు దారి తీస్తోంది. రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులకు బంధువులు, అదే సామాజిక వర్గానికి చెందిన వారి పేర్లు వినిపిస్తుండడం గమనార్హం. హైదరాబాద్ కేంద్రంగా ఈడీ ఇప్పటి వరకూ చేపట్టిన సోదాలు ఓ లెక్కన రికార్డేనని కూడా అంటున్న వారూ లేకపోలేదు. ఏది ఏమైనా జాతీయ దర్యాప్తు సంస్థలు లిక్కర్ స్కాంలో లోతుగా ఆరా తీస్తుండడంతో చివరకు ఎంతమంది ప్రముఖులకు చుట్టుకపోతుందోనన్న చర్చ సాగుతోంది.

You cannot copy content of this page