ఒళ్లుగగుర్పొడిచే ఘటన.. ఖననం చేసిన బాలిక మృతదేహం తలను ఎత్తుకెళ్లిన మాంత్రికుడు!

దసరా సెలవులకు నాయినమ్మ ఇంటికి వెళ్లి చిన్నారి ప్రమాదవశాత్తూ గాయపడి ఆస్పత్రిలో 10 రోజుల పాటు చికిత్స పొందుతూ చనిపోయంది. బాలిక శవాన్ని శ్మశానంలో తల్లిదండ్రులు ఖననం చేశారు. అయితే, కొద్ది రోజుల తర్వాత ఆ సమాధిని తవ్వి ఎవరో తలను వేరుచేసి ఎత్తుకెళ్లిపోవడం కలకలం రేగింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. అమావాస్య, గ్రహణం రెండూ కలిసి రావడంతో క్షుద్ర పూజల కోసం ఇలా చేసినట్టు అనుమానిస్తున్నారు.

ప్రమాదవశాత్తూ మృతిచెందిన 12 ఏళ్ల బాలిక మృతదేహాన్ని కుటుంబసభ్యులు శ్మశానంలో ఖననం చేశారు. అయితే, ఖననం చేసిన తర్వాత మృతదేహం తలను గుర్తుతెలియని వ్యక్తులు వేరుచేసి ఎత్తుకెళ్లారు. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. చెంగల్పట్టు జిల్లా మధురాంతకం తాలూకా చిత్తిరవాడి గ్రామానికి చెందిన పాండియన్‌ కుమార్తె కృత్తిక (12) ఆరో తరగతి చదువుతోంది. దసరా సెలవుల కావడంతో అక్టోబరు 5న అవురిమేడు గ్రామంలో తన నాయినమ్మ ఇంటికి వెళ్లింది.

ఈ క్రమంలో అక్కడ పిల్లలతో కలిసి కృత్తిక ఆడుకుంటుండగా విద్యుత్తు స్తంభం విరిగి బాలికపై పడింది. అప్పటికే స్తంభం తుప్పుపట్టి బలహీనంగా ఉండగా.. రిపెయిర్ కోసం లైన్‌మెన్ దానిపైకి ఎక్కడంతో అది విరిగిపోయింది. తీవ్రంగా గాయపడిన ఆ చిన్నారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. పది రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృత్యువుతో పోరాడి ఓడిపోయింది. అక్టోబరు 15న పరిస్థితి విషమించడంతో బాలిక మృతి చెందింది. దీంతో తల్లిదండ్రులు ఆమె మృతదేహాన్ని సొంతూరుకు తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. స్థానిక శ్మశానంలో ఖననం చేశారు.

అయితే, అక్టోబరు 25న అమావాస్య నాడు రాత్రి.. ఖననం చేసిన చోట క్షుద్రపూజలు నిర్వహించిన ఆనవాళ్లు కనిపించాయి. సమాధిని తవ్వి బాలిక మృతదేహం తలను ఖండించి దుండగులు తీసుకెళ్లడంతో అటుగా వెళ్లిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అనంతరం బాలిక తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరకున్న పోలీసులు, ఆస్పత్రి సిబ్బంది ఖననం చేసిన చోట పూర్తిగా తవ్వి మృతదేహం బయటకు తీశారు. తలను వేరుచేసి ఎత్తుకెళ్లినట్టు గుర్తించారు. క్షుద్రపూజల కోసం తలను ఎవరైనా ఎత్తుకెళ్లారా? మరేదైనా కారణం ఉందా? అనే కోణాలలో దర్యాప్తు చేపట్టారు.

You cannot copy content of this page