జెడాంగ్ రికార్డ్ సమం…
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ప్రధాన కార్యదర్శిగా హ్యాట్రిక్ కొట్టారు. పార్టీ వ్యవస్థాపకుడు మావో జెడాంగ్ రికార్డును సమం చేసిన జిన్ పింగ్ సరికొత్త రికార్డు సృష్టించారు.
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ (69) చరిత్ర సృష్టించారు. అధికార కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా (సీపీసీ) ప్రధాన కార్యదర్శిగా మూడోసారి ఎన్నికయి పార్టీ వ్యవస్థాపకుడు మావో జెడాంగ్ తర్వాత ఈ ఘనత సాధించిన తొలి నాయకునిగా రికార్డుకెక్కారు. బీజింగ్‌లోని ఆర్నేట్ గ్రేట్ హాల్‌లో జిన్‌పింగ్ అధ్యక్షతన జరిగిన సీపీసీ 20వ సెంట్రల్ కమిటీ ప్లీనరీకి హాజరైన 203 మంది సెంట్రల్ కమిటీ, 168 మంది ప్రత్యామ్నాయ సభ్యులు జిన్‌పింగ్‌ను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. 24 మందితో ఏర్పాటయిన సీపీసీ పొలిట్‌బ్యూరోకు కూడా సెంట్రల్ కమిటీ ఆమోదముద్ర వేసింది.
ఈ సందర్భంగా షీ జిన్ పింగ్ మాట్లాడుతూ… ప్రపంచానికి చైనా అవసరం… చైనాకు ప్రపంచ అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ప్రపంచానికి దూరంగా ఒంటరిగా ఉంటూ చైనా అభివృద్ధి చెందలేదని వ్యాఖ్యానిస్తూనే ప్రగతి పథంలో ముందుకు సాగాలంటే ప్రపంచానికీ చైనా కావాల్సిందేనన్నారు. దేశ విదేశీ పెట్టుబడుల కోసం తలుపులు తెరిచి ఉంచామని ప్రకటించారరు. సంస్కరణల విషయంలో స్థిరంగా ముందుకు కదులుతూ సౌభాగ్యవంతమైన చైనా బాహ్య ప్రపంచం కోసం ఎన్నో అవకాశాలను సృష్టిస్తుందన్నారు. నూతన శకంలో సోషలిజం అభివృద్ధిలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.
వందేళ్ల చరిత్ర ఉన్న ప్రపంచంలో అతిపెద్ద పార్టీ అయిన కమ్యూనిస్ట్ పార్టీ స్వయం సంస్కరణ ద్వారా మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. సీపీసీ చైనా ప్రజలకు ఒక బలమైన వెన్నుముకగా మారాలన్నారు. ఎంతో ఘన కీర్తి కలిగిన చైనా అద్భుతమైన కలలతో సుదీర్ఘ ప్రయాణం సాగిస్తోందని, ఇందుకు అవసరమైన రోడ్‌మ్యాప్ తయారు చేసుకున్నామని వెల్లడించారు. దేశానికి మెరుగైన భవిష్యత్తును అందించడమే లక్ష్యంగా కలిసికట్టుగా పనిచేసేందుకు కలిసి నడవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కమ్యూనిస్ట్ పార్టీకి పక్షపాతానికి తావులేని వాస్తవిక ప్రచారం కల్పించాలని మీడియాకు విజ్ఞప్తి చేశారు.
మూడు అత్యున్నత పదవులు
అత్యంత శక్తిమంతమైన సెంట్రల్ మిలటరీ కమిషన్ (సీఎంసీ) చైర్మన్‌గా జిన్‌పింగ్‌ను కమ్యూనిస్ట్ పార్టీ పొలిట్‌బ్యూర్ మరోసారి నియమించింది. జిన్ పింగ్ దేశాధ్యక్షుడిగా, కమ్యూనిస్ట్ పార్టీ అధినేతగా, సీఎంసీ చైర్మన్‌గా మూడు అత్యున్నత పదవులకు ఆయనే బాధ్యతలు నిర్వర్తించనున్నారు. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్‌ఏ) జనరల్స్ ఝాంగ్ యుషియా, హీ వీడాంగ్‌ను సీఎంసీ వైస్ చైర్మన్లుగా నియమించారు. సైనిక ఉన్నతాధికారులకు సెంట్రల్ మిలటరీ కమిషన్‌లో సభ్యులుగా అవకాశం కల్పించారు. ఇప్పటికే సెంట్రల్ కమిషన్ ఫర్ డిసిప్లిన్ ఇన్‌స్పెక్షన్ (సీసీడీఐ) స్టాండింగ్ కమిటీ కార్యదర్శి, ఉప కార్యదర్శులు, సభ్యులను కూడా ఎన్నుకున్నారు. 24 మందితో కూడిన సీపీసీ పొలిట్‌బ్యూరోలో మహిళలకు స్థానం కల్పించకపోవడం చర్చనీయాంశంగా మారింది.
ఆయన ప్రస్థానం…
1953 జూన్ 15న శాన్‌షీ ప్రావిన్స్‌లో జన్మించిన చైనా అధినేత షీ జిన్‌పింగ్ తండ్రి షీ షీ ఝాంగ్‌షువాన్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా, చైనా ఉప ప్రధానమంత్రిగా పనిచేశారు. యావోడాంగ్ అనే పల్లెటూరిలో జిన్‌పింగ్ బాల్యం గడిపిన ఆయన తండ్రి ఆదేశాల మేరకు సాంస్కృతిక విప్లవ సమయంలో రైతులతో కలిసి సాధారణ జీవితం కొనసాగించి వ్యవసాయంపై మక్కువ పెంచుకున్నారు. ప్రాథమిక విద్య అనంతరం సింగువా యూనివర్సిటీలో కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి 1974లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా సభ్యుడిగా చేరారు. పార్టీ శాఖ కార్యదర్శిగా తొలి పదవి అందుకున్న జిన్ పింగ్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. 1985లో ఫుజియాన్ ప్రావిన్స్‌లోని షియామెన్ నగర డిప్యూటీ మేయర్‌గా బాద్యతలు చేపట్టారు. 1979లో కే లింగ్లింగ్‌ను వివాహం చేసుకున్నప్పటికీ వైవాహిక బంధంలో వచ్చిన మనస్పర్థల కారణంగా కొంత కాలానికే ఇరువురు వేరు పడ్డారు. 1987లో ప్రముఖ జానపద గాయని పెంగ్ లియువాన్‌ను వివాహం చేసుకోగా వీరికి జన్మించిన కుమార్తె షీ మింగ్‌జే అని నామకరణం చేశారు. ప్రస్తుతం మింగ్ జే అమెరికాలో విద్యాభ్యాస్ం చేస్తున్నారు. 1999 నుంచి 2002 దాకా ఫుజియాన్ గవర్నర్‌గా, 2002 నుండి 2007 వరకు ఝెజియాంగ్ గవర్నర్‌గా వ్యవహరించిన జిన్ పింగ్ 2007లో కమ్యూనిస్ట్ పార్టీ పొలిట్‌బ్యూరో స్టాండింగ్ కమిటీ(పీఎస్సీ)లో చేరారు. 2008 నుంచి 2013 దాకా చైనా ఉపాధ్యక్షుడిగా సేవలందించిన ఆయన 2012లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ప్రధాన కార్యదర్శిగా, 2013లో చైనా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
విమర్శలు… అభినందనలు
పార్టీలో ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టిన షీ క్రమశిక్షణకు, అంతర్గత ఐక్యతకు పెద్దపీట వేశారనే చెప్పాలి. అవినీతిపై ఉక్కుపాదం మోపడంలో సఫలం అయిన ఆయన సొంత పార్టీకి చెందిన మాజీ నేతలకూ శిక్షలు విధించడంలో వెనకాడకపోవడం చైనాలో వాసుల్ని ఆకట్టుకుంది. స్వదేశంలో సక్సెస్ బాటన నడుస్తున్న షీ జింగ్ పిన్ విదేశాంగ విధానంపై మాత్రం భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. పదేళ్ల జిన్‌పింగ్ పాలనలో అమెరికా చైనా సంబంధాలు గణనీయంగా క్షీణించగా, భారత్‌తో సరిహద్దు వివాదాలు తీవ్రం అయ్యాయి. తైవాన్ విషయంలో జిన్‌పింగ్ దూకుడు, హాంకాంగ్‌లో నేషనల్ సెక్యూరిటీ చట్టం విషయంలో ఆరోపణలు ఎదుర్కొన్నారు. కరోనా పుట్టుకకు చైనాయే కారణమన్న భావన ప్రపంచ ప్రజల్లో బలంగా నాటుకపోయింది. జీరో కోవిడ్ పాలసీతో చైనా ఆర్థిక వ్యవస్థ క్రమక్రమంగా దిగజారుతోందన్న చర్చలు కూడా జరుగుతున్నాయి. తయారీ రంగాన్ని ప్రోత్సహించడంతో చైనా గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా ఎదగింది. చైనాలో ఉన్నత స్థాయి పదవుల్ని చేపట్టేందుకు 68 ఏళ్లను గరిష్ఠ వయోపరిమితి ఉండగా 69 ఏళ్ల ఆయన విషయంలో పట్టించుకోకపోవడం గమనార్హం. చైనా నూతన ప్రధానమంత్రిగా లీ కియాంగ్ బాధ్యతలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీపీసీ షాంఘై విభాగానికి అధినేతగా ఉన్న ఆయన జిన్‌పింగ్‌కు చాలా సన్నిహితుడు. కొత్తగా ఏర్పడిన సీపీసీ స్టాండింగ్ కమిటీలో జిన్‌పింగ్ తర్వాత రెండో స్థానంలో కియాంగ్ ఉన్నారు. చైనా ప్రస్తుత ప్రధాని లి కెకియాంగ్ వచ్చే ఏడాది మార్చిలో పదవి కాలం మగియనుంది. ఆ తరువాత ఆ పీఠాన్ని కియాంగ్ కు అప్పగించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.