పీకే సంచలన వ్యాఖ్యల వెనక….. ?
దేశంలో ఎన్నికల సమయంలో వ్యూహాలకు పదునుపెట్టి తనదైన స్టైల్లో కసరత్తులు చేసిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆత్మ విమర్శ చేసుకుంటున్నారా..? పదునైన స్కెచ్ లు వేస్తారని పేరున్న ఆయన 8 ఏళ్ల క్రితం చేసిన ఓ తప్పును ఒప్పుకుంటున్నారా..? లేక దీని వెనక మరేదైనా కారణం ఉందా..? బీహార్ పాదయాత్రలో పీకే చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. బీహార్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్న ప్రశాంత్ కిశోర్ 2014 ఎన్నికలప్పుడు రాజకీయ వ్యూహకర్తగా అందించిన సేవలపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి, బీహార్ సీఎం నితీశ్ కుమార్ లు అధికారంలోకి రావడానికి తన వ్యూహాలు ఎలా పనిచేశాయో వివరించారు. అయితే ఈ సందర్భంగా పీకే చేసిన వ్యాఖ్యలు ఆయన అంచనాలను చెప్పకనే చెప్తున్నాయి. దేశంలో కొంతమందికి సాయం చేయడం కాకుండా కాంగ్రెస్ పునరుజ్జీవానికి తాను కృషి చేసుంటే బాగుండేదన్నారు. ఈ విషయం తెలుసుకోవటానికి చాలా కాలం పట్టిందని, గాడ్సే సిద్ధాంతాన్ని ఎదుర్కునేందుకు కాంగ్రెస్ పుసరుజ్జీవం ఒక్కటే మార్గమని చెప్పుకొచ్చారు పీకే. ఆపార్టీని ఓడించాలంటే కాంగ్రెస్ పునరుజ్జీవం అవసరమని గుర్తించానని వ్యాఖ్యానించారు. బీజేపీ అసలు ఏంటనేది అర్దం చేసుకోకుండా, ఆ పార్టీని ఓడించలేరని ఈ విషయాన్ని పసిగట్టకపోతే సానుకూల ఫలితాలు సాధించే అవకాశమే లేదన్న రీతిలో పీకె వ్యాఖ్యలు చేశారు. కాఫీ పై ఉండే నురుగు బీజేపీ అయితే, అసలు కాఫీ ఆరెస్సెసేనని అది సమాజంలోకి చొచ్చుకెళ్లిందని పీకే వ్యాఖ్యానించారు. సామాజిక వ్యవస్థలో ఆరెస్సెస్ భాగమైపోయిందని కూడా వ్యాఖ్యానించారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోడీ ప్రచార నిర్వహణను విజయవంతంగా చేపట్టి పీకే తొలిసారి వెలుగులోకి వచ్చారు. అయితే మోడీ ప్రధాని అయిన తరువాత అక్కడ రాంరాం చెప్పేసి బీహార్ సీఎం జేడీయూ అధినేత నితీశ్‌కుమార్‌తో చేతులు కలిపారు. జేడీయూ, ఆర్‌జేడీ, కాంగ్రెస్ పార్టీలతో మహాకూటమి ఏర్పాటు చేయించి సక్సెస్ కావడంలో కీలక భూమిక పోషించారు. ఢిల్లీలో ఆప్, పంజాబ్ లో అమరీందర్ లు అధికారంలోకి రావడానికి తన వ్యూహాలను అమలు చేశారు. అయితే పీకే తాజాగా చేసిన వ్యాఖ్యలపై మాత్రం చర్చలు తీవ్రంగా సాగుతున్నాయి. రాజకీయ పార్టీలు అధికారంలోకి రావడానికి వ్యూహాలు పదునుపెట్టిన పీకే దేశంలో ఎలాంటి రాజకీయాలు అవసరం..? ఇందుకు అవసరమైన పొలిటికల్ పార్టీ ఏది అనే విషయంపై 8 ఏళ్ల వరకూ క్లారిటీ రాకపోవడం ఏంటన్నదే అంతుచిక్కకుండా పోయింది. భారత దేశంలోని అన్ని ప్రాంతాలపై సమగ్రమైన పట్టు సాధించి అక్కడి ఓటర్లను తాను వ్యూహాలు అందించే పార్టీకి అనుకూలంగా మార్చడంలో సక్సెస్ అయిన పీకే కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవానికి ప్రయత్నించాల్సి ఉండేనని ఇప్పుడు చెప్తుండడం గమనార్హం. బీజేపీని గాడ్సే సిద్దాంతాలు అమలు చేసే పార్టీగా వ్యాఖ్యానించిన పీకే మాటల మర్మం ఏంటన్నదే పజిల్ గా మారిపోయింది. భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు నింపే పనిలో రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్న క్రమంలో పీకే ఈ వ్యాఖ్యలు చేయడం వెనక ఆయన ఆ పార్టీతో జట్టు కట్టేందుకు సిద్దంగా ఉన్నానన్న సంకేతాలు పంపిస్తున్నారేమోనన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసేందుకు సుముఖత వ్యక్తం చేసి ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ బాగు పడదంటూ స్టేట్ మెంట్ ఇచ్చారు. దీంతో ఆయన గాంధీ పార్టీతో చేతులు కలిపే అవకాశం లేదని తెలిసి పోయింది. ఆ తరువాత తానే పొలిటికల్ పార్టీ పెడ్తున్నాని ప్రకటించి బీహార్ సర్కార్ పై విమర్శలు చేశారు. ఇప్పుడు అక్కడ పాదయాత్ర చేస్తున్న పీకే బీజేపీపై విమర్శలు చేస్తూ కాంగ్రెస్ పార్టీపై సానుకూలత వ్యక్తం చేస్తూ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా మారాయి.
హెచ్చరికనా…?
మరోవైపున పీకే చేసిన వ్యాఖ్యలపై మరో కోణం కూడా ఆవిష్కృతం అవుతోంది. బీజేపీ, ఆరెస్సెస్ దేశంలో వేళ్లూనుకపోయాయని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఆరెస్సెస్ సమాజంలో వేళ్లూనుకుని పోయిందని అన్నారంటే పరోక్షంగా ఇతర పార్టీలు బలహీనంగా ఉన్నాయని, ఆరెస్సెస్ లాగా గ్రౌండ్ లెవల్లో పాగా వేయలేకపోయాయని చెప్పకనే చెప్తున్నారా అన్న చర్చలు కూడా సాగుతున్నాయి. బీజేపీకి ఆరెస్సెస్ అత్యంత శక్తిని అందిస్తుంటే అలాంటి సంస్థలు ఇతర పార్టీల పంచన లేకపోవడం వల్ల వేరే పార్టీలు పైచేయి సాధించే అవకాశాలు లేవన్న నిగూఢతను వ్యక్తీకరించారా అన్న విషయాన్నీ విస్మరించకూడదు.