హైదరాబాద్ : వేరే పార్టీనుంచి బీజేపీలో చేరినవారికి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి షాక్ ఇచ్చారు. వేరే పార్టీలోనుంచి వచ్చినవాళ్లకు బీజేపీలో ప్రాధాన్యం ఉండబోదని విూడియా సాక్షిగా చెప్పకనే చెప్పారు. కిషన్‌రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ విూడియాలోనూ దుమారం రేపుతున్నాయి. అంతే కాదు ‘మా రాజకీయ జీవితమే పోరాటాలతో ప్రారంభమైంది. మేం పార్టీలు మారిన వ్యక్తులం కాదు’ అని వ్యాఖ్యానించారు. దీంతో పక్కనే ఉన్న రఘునందన్‌రావు ముఖంలో ఒక్కసారిగా హావభావాలు మారిపోయాయి. మరోవైపు బీఆర్‌ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చిన ఈటల రాజేందర్, కాంగ్రెస్ నుంచి వచ్చిన డీకే అరుణ తదితర నాయకులపై కూడా ‘పార్టీలు మారినోళ్లేననే’ వివక్ష ఉందనడానికి కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. తామంతా ఒక్కటేనని చెప్పుకుంటున్నా.. కిషన్‌రెడ్డి వ్యవహారంతో మరోసారి బీజేపీలో లుకలుకలు బయటపడ్డాయని ప్రజలు చర్చించుకొంటున్నారు. అనుమతి లేకుండానే బాటసింగారం డబుల్ బెడ్ రూం ఇండ్ల పరిశీలనకు బయలుదేరిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. అనంతరం ఎమ్మెల్యే రఘునందన్‌రావు, చింతల రాంచంద్రారెడ్డితో కలిసి కిషన్‌రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి ఊకదంపుడు ఉపన్యాసం ఇస్తూ తన మనసులో మాట బయటపెట్టారు.