ఓ వైపున మునుగోడు ఎన్నికల కారణంగా కట్టుదిట్టమైన బందోబస్తు కొనసాగుతోంది. కేవలం మునుగోడు నియోజకవర్గానికే పరిమితం కాకుండా హైదరాబాద్ లోనూ పోలీసులు డేగ కళ్లతో వాచ్ చేస్తున్నారు. ఇటీవల కాలంలో హవాలా ద్వారా వెల్తున్న రూ. కోట్లు వేర్వేరు సంఘటనల్లో హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. అటువంటిది ఎమ్మెల్యేలను కొనుగోలు డీలో కోసం రూ. 15 కోట్ల వరకు ఫాంహౌజ్ కు ఎలా తీసుకెళ్లారన్నదే జవాబు లేని ప్రశ్నగా మిగులుతోంది. అడగడుగునా తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో స్వామీజీలు అంత పెద్దమొత్తంలో డబ్బులు ఫాం హౌజ్ కు తీసుకెళ్లే ధైర్యం చేస్తారా..? లేదా అన్న విషయంపై తర్జన భర్జనలు సాగుతున్నాయి. మరో వైపున మునుగోడు ఉప ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేల కొనుగోలుకు కోసం ఏ పార్టీ అయినా సాహసిస్తుందా అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా మెయినాబాద్ అజీజ్ నగర్ ఫాంహౌజ్ కు వచ్చిన కరెన్సీ నెంబర్ల ఆధారంగా ఆరా తీస్తే డబ్బు ఎక్కడి నుండి వచ్చింది అన్న విషఁయం తేట తెల్లం అయ్యే అవకాశాలు లేకపోలేదు.
డీల్ గురించి ముందు తెలియాదా..?
ఫాం హౌజ్ లో తమను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ముగ్గురు ఎమ్మెల్యేలు సమాచారం ఇవ్వడంతో తాము దాడులు చేశామని సీపీ రవీంద్ర ప్రకటించారు. అయితే వీరికి డీల్ గురించి ముందు తెలియకుండానే ఫాం హౌజ్ కు వెల్లారా..? అక్కడికెల్లాకే డీల్ మాట్లాడారా అనే విషయంపై స్పష్టత లేకుండా పోయింది. ఒక వేళ ముందుగానే డీల్ గురించి తెలిసినట్టయితే స్టింగ్ ఆపరేషన్ చేసే అవకాశం ఉంటుంది కదా అన్న పాయింట్ లేకపోలేదు. ఫాం హౌజ్ కు చేరుకున్న తరువాత డీల్ జరిగినట్టయితే ఆ విషయాన్ని ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎమ్మెల్యే తన ఫ్రెండ్ ఫాం హౌజ్ కు వచ్చామని చెప్పిన విషయాన్ని విస్మరించవద్దు.
కేసీఆర్ స్కెచ్ ను అంచనా వేయలేదా..?
ఉద్యమ సమయంలో పార్టీ ఎమ్మెల్యేలు ఇతర పార్టీల్లో చేరిపోయిన విషయాన్ని మర్చిపోని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తరువాత ఇలాంటి ఆపరేషన్ల విషయంలో జాగ్రత్తగా ఉంటారన్నది జగమెరిగిన సత్యం. గతంలో ఓటుకు నోటు వ్యవహారంలో రేవంత్ రెడ్డిని రెడ్ హైండడ్ గా పట్టుకున్న విషయాన్ని ప్రత్యర్థి పార్టీలు విస్మరించే అవకాశం లేదు. ఫోన్ ట్యాపింగ్ లు, కాల్ రికార్డులు చేస్తున్నారన్న ఆరోపణలు కూడా చేస్తున్న క్రమంలో ఇతర పార్టీల నాయకులు టీఆరెఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు సాహసించే పరిస్థితి అయితే ఉండే అవకాశం లేదు.
స్వామీజీలు ఎవరు..?
ఫరీదాబాద్ లోని ఆలయంలో ఉండే స్వామిజీ రామచంద్ర భారతి స్వామి, తిరుపతికి చెందిన సింహయాజులు కూడా ఈ ఫాం హౌజ్ లో పోలీసులకు పట్టుబడ్డారు. వీరే ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు డీల్ మాట్లాడారని చెప్తున్నారు పోలీసులు. అయితే అధికార పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసుకుని వీరేం చేస్తారు, జాతీయ పార్టీతో ఒప్పందం చేసుకునే చేశారా లేదా అన్నది తేలాల్సి ఉంది. వీరికి ఆశ్రయం కల్పించిన నందకుమార్ హైదరాబాద్ వాసే అయినప్పటికీ ఆయన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సన్నిహితుడు అంటూ ప్రచారం మొదలు పెట్టారు. అయితే ఇందుకు కౌంటర్లు బుధవారం రాత్రి నుండే స్టార్ట్ అయ్యాయి. నంద టీఆరెఎస్ నాయకులతో కలిసి దిగిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో నంద కుమార్ ఇరు పార్టీల నాయకులతో టచ్ లో ఉన్నాడని తేటతెల్లం అవుతున్నది. మరోవైపున డబ్బు బ్యాగులు ఉన్నాయని చెప్తున్న కారు కూడా టీఆరెఎస్ ఎమ్మెల్యే సన్నిహితుడుదని, ఫాం హౌజ్ కూడా గులాభి పార్టీకి చెందిన వారిదేనని ప్రచారం జరుగుతోంది. దీంతో అసలు విషయం ఏం జరిగిందోనన్నదే పజిల్ గా మారింది.