బెల్లంపల్లిలో పులి హంతకుల అరెస్ట్
ఐదేళ్ల క్రితం చనిపోయిన పులి గుట్టును అటవీ అధికారులు రట్టు చేశారు. అటవీ ప్రాంతంలో తిరుగాడుతున్న ఓ పులి ఉనికి దొరకకుండా పోతే ఇంతకాలం పొరుగు రాష్ట్ర అడవుల్లోకి వెల్లిందని అనుకున్నారేమే. కానీ అనూహ్యం అటవీ అధికారులకు చిక్కిన ఓ నిందితుని ద్వారా అసలు విషయం గుర్తించారు. శనివారం పులి గోర్లు, అవశేషాలు అక్రమంగా రవాణా అవుతున్నాయని అందుకున్న సమాచారం మేరకు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో నాకాబందీ నిర్వహించింది. అటవీ శాఖ టాస్క్ ఫోర్స్ టీం. ఈ క్రమంలో బెల్లంపల్లి మండలం రంగపేటకు చెందిన బాలచందర్ అనే వ్యక్తి అనుమానస్పదంగా చిక్కడంతో అతన్ని సోదా చేశారు. అతని వద్ద పులి గోరు లభించడంతో పూర్తి వివరాలు సేకరించే ప్రయత్నం చేశారు అటవీ అధికారులు. బాలచందర్ ఇచ్చిన సమాచారం తెలుసుకున్న అటవీ అధికారులు షాకింగ్ విషయాలు తెలిశాయి. 2018లో దుగ్నేపల్లి ఫారెస్ట్ ఏరియాలో బాలచందర్, అంజి, లక్ష్మయ్యలు వన్య ప్రాణులను వేటాడేందుకు విద్యుత్ వైర్లు అమర్చారు. ఈ సమయంలో అటుగా వచ్చిన పులి కరెంట్ షాకుకు గురై అక్కడికక్కడే చనిపోయింది. వేటగాళ్లు చనిపోయిన పులి కళేబరాన్ని సమీపంలోని అటవీ ప్రాంతంలోనే పాతిపెట్టి సేఫ్ అయ్యామని ఊపిరి పీల్చుకున్నారు. నిందితుడు బాలచందర్ నుండి పులి గోరు స్వాధీనం చేసుకున్న తరువాత విభిన్న కోణాల్లో ఆరా తీయగా అసలు విషయం తెలిసింది. నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు పులి పాతిపెట్టిన ప్రాంతానికి వెల్లిన అటవీ అధికారుల బృందం పులి అవశేషాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్ సక్సెస్ లో బెల్లంపల్లి, కుశ్నపల్లి రేంజ్ ఆఫీసర్లు సుభాష్, గోవింద్ సర్దార్, సెక్షన్ ఆఫీసర్ రాజేష్, బీట్ ఆఫీసర్లు యుగంధర్, అనీల్ లు ప్రతిభ కనబర్చారని అటవీ అధికారులు తెలిపారు. నిందితులను వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పర్చనున్నామని వెల్లడించారు.