చిరుప్రాయంలోనే పేరెంట్స్ ను కోల్పోయి…
దిశ దశ, మానకొండూరు:
విధి ఆడిన నాటకంలో ఆ చిన్నారులిద్దరూ లేలేత ప్రాయంలోనే పేరెంట్స్ ను కోల్పోయారు. కానరాని లోకాలకు తండ్రి వెల్లి పోయిన అక్కున చేర్చుకునేందుకు అమ్మ ఉందన్న ఆశను కూడా దూరం చేసింది రోడ్డు ప్రమాదం. పదిహేనళ్ల ప్రాయంలో పెద్దోడు ప్రజ్ఞ, 12 ఏళ్ల వయసులో చిన్నోడు రిషిక్ లకు ఇక తాతయ్య కుటుంబ సభ్యులే తల్లిదండ్రులుగా మారి చేదోడుగా నిలవాల్సిన పరిస్థితి తయారైంది. శుక్రవారం ఉదయం కరీంనగర్ సిరిసిల్ల బైపాస్ రోడ్డు ప్రమాదం ఇద్దరు చిన్నారులను అనాథులుగా మార్చింది. తల్లిదండ్రులు మృత్యు ఒడిలోకి చేరిపోవడంతో పదో తరగతి చదువుతున్న ప్రజ్ఞ, ఆరో తరగతి చదువుతున్న రిషిక్ లు దిక్కులు పిక్కటిల్లేలా ఏడుస్తున్న తీరు అందరినీ కలిచివేస్తోంది.
ఎనిమిదేళ్ల క్రితం నాన్న…
ఎనిమిదేళ్ల క్రితం గుండెపోటు రూపంలో చిన్నారుల తండ్రి బైరెడ్డి తిరుపతి రెడ్డి హఠన్మారణం చెందడంతో ఒక్క సారిగా ఆ కుటుంబం విషాదంలో కూరుకపోయింది. చిరుప్రాయంలోనే ఉన్న చిన్నారులు తండ్రికి దూరం కావడం వారి కుటుంబ సభ్యులందరిని కలిచివేసింది. ఇటువంటి పరిస్థితుల్లో తల్లి రజిత గుండె ధిటువు చేసుకుని చిన్నారుల ఆలనాపాలనా చూసుకోవాలని, వారిని పెంచి పెద్ద చేయాలని ప్రతి ఒక్కరూ సూచించారు. కడదాక సహజీవనం చేయాల్సిన భర్తను అర్థాంతరంగా మృత్యువు తీసుకెళ్లడంతో మానసికంగా కుంగిపోయినప్పటికీ రజిత మాత్రం తన పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని గుండె నిబ్బరం చేసుకుని జీవనం సాగిస్తున్నారు. తన బిడ్డలిద్దరిని ఉన్నత శిఖరాలకు చేర్చాలన్న లక్ష్యంతో అటు విధులు నిర్వర్తిస్తూ ఇటు పిల్లల బాగోగులు చూసుకుంటున్నారు.
నేడు తల్లి…
శుక్రవారం ఉదయం సిరిసిల్ల బైపాస్ రోడ్డు క్రాసింగ్ వద్ద మిక్సింగ్ ట్యాంకర్ రజిత స్కూటీ మీదుగా దూసుకెళ్లడంతో ఆమె అక్కడికక్కడే విగతజీవిగా మారిపోయారు. పిల్లలను స్కూళ్లో దింపి మరో పది మీటర్ల దూరం వెల్తే ఆర్టీసీ బస్సు కోసం వెయిట్ చేయాల్సిన రజితను ట్యాంకర్ రూపంలో మృత్యువు కబళించింది. ఇల్లంతకుంట మండలం రహీంఖాన్ పేట మోడల్ స్కూల్ లో టీచర్ గా పనిచేస్తున్న రజిత ఇటీవల కాలం వరకూ స్కూటీపైనే డ్యూటీకి వెల్లొచ్చేవారు. స్కూటీపై జర్నీ అంత మంచిది కాదని భారీ వాహనాలు ఎక్కువగా తిరిగే సిరిసిల్ల రోడ్డు అయినందున బస్సులో ప్రయాణించాలని బంధువులు సూచించారు. దీంతో కొద్ది రోజులుగా మానేరు స్కూల్ బస్ స్టాప్ వరకు స్కూటీపై వెల్లి అక్కడి నుండి బస్సులో మోడల్ స్కూల్ కు వెల్తున్నారు రజిత. అనూహ్యంగా రోడ్డు ప్రమాదంలో ఆమె కూడా చనిపోవడంతో పిల్లలిద్దరూ పెద్ద దిక్కును కోల్పోయారు.
ఈ సమయంలోనూ…
మానకొండూరు మండలం గంగిపెల్లికి చెందిన రజిత తల్లిదండ్రులకు ఆమె రోడ్డు ప్రమాదంలో మరణించిందన్న విషయం తెలుసుకుని బైక్ పై హుటాహుటిన బయలు దేరారు. కూతురు కానరాని లోకాలకు వెల్లిపోయిందన్న సమాచారం అందుకున్న నర్సింహరెడ్డి దంపతులు ఆందోళనతో బైక్ పై వస్తుండగా అల్గునూరు వద్ద రోడ్డు ప్రమదం జరిగింది. ఈ ఘటనలో రజిత తల్లి చేయి విరగడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు.