పచ్చ జెండాల ర్యాలీలో గులాభి నేత

ఎత్తుగడల్లో వ్యూహాలకు పదును పెడుతూ పరోక్షంగా సంకేతాలు పంపడంలో ఆ నేత స్టైల్ వేరే. గులాభితోటలో గుభాళిస్తున్న ఆయన సడన్ గా పచ్చ జెండా ర్యాలీలో కనిపించి అందరినీ ఆశ్యర్య పరిచారు. పూర్వ ఖమ్మం జిల్లాకు చెందిన ఈ నాయకుని గురించి తెలుగు రాష్ట్రాల్లో వినని వారు ఉండరు కావచ్చు. ఆయన అనూహ్యంగా కనిపించి మెరిపించిన తీరు మాత్రం ఆ జిల్లాలో హాట్ టాపిక్ గా మారిందనే చెప్పాలి. ఫాం హౌజ్ లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం గురించి రాష్ట్రం అంతా చర్చనీయాంశం అయిన సమయంలో ఆ నేత చర్యలపై అంతగా డిస్కషన్ జరగలేదు కానీ లేనట్టయితే ఈ అంశం రాష్ట్ర టీఆరెఎస్ అధిష్టానాన్ని ఆలోచనలో పడేసేదేనన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మాజీ మంత్రి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా చట్ట సభలకు ప్రాతినిథ్యం వహించిన తుమ్మల నాగేశ్వర్ రావు సత్తుపల్లిలో జరిగిన ర్యాలీకి హాజరయ్యారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకల నేపథ్యంలో సత్తుపల్లిలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి తుమ్మల హాజరు కావడం గమనార్హం. ఈ ర్యాలీలో తుమ్మల అనచరులు టీఆరెఎస్ పార్టీలో ఉన్నప్పటికీ టీడీపీ జెండాలు పట్టుకుని హాజరు కావడం గమనార్హం. ఎన్టీఆర్ శత జయంతోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కార్యక్రమమే అయినప్పటికీ టీఆరెఎస్ జెండాలకు మాత్రం అంతగా ప్రాదాన్యత కల్పించలేదు.

ఇద్దరు చంద్రులకు సంకేతాలా..?

అయితే తుమ్మల పట్ల గత కొంత కాలంగా అధిష్టానం అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తోందని, మంత్రిగా జిల్లాకు చెందిన పువ్వాడ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయనకు ఇచ్చే ప్రయారిటీ గణనీయంగా తగ్గిపోయిందన్న ప్రచారం కూడా ఉంది. ఈ నేపథ్యంలో గతంలో జిల్లాకు పలువురు మంత్రులు ప్రత్యేకంగా తుమ్మల ఇంటికి పువ్వాడను తొడ్కొని వెల్లారు. దీంతో జిల్లాలో పరిస్థితులు సద్దుమణిగినట్టేనని అనుకున్నప్పటికీ ఒకే సామాజిక వర్గానికి చెందిన ఈ ఇద్దరు నేతల మధ్య గ్యాప్ మాత్రం అలాగే ఉండిపోయిందని చెప్పక తప్పుదు. తుమ్మల వర్గానికి చెందిన వారిపై కేసులు నమోదు కావడం వంటి చర్యలు కూడా ఆయనను ఇబ్బందుల్లో పడేసినట్టయింది. దీంతో రాజకీయాల్లో అత్యంత సీనియర్ అయిన తుమ్మల కొద్ది నెలలుగా వ్యక్తిగత కార్యకలాపాలకే పరిమితం కావల్సిన పరిస్థితి నెలకొంది తప్ప పొలిటికల్ సినారియోలో మాత్రం కీ రోల్ పోషించలేకపోతున్నారు. జిల్లాలో నెలకొన్న వర్గ పోరే కావచ్చు ఇతరాత్ర కారణాలు ఏమైనా కావచ్చు కాని ఏక ఛత్రధిపత్యం వహించిన తుమ్మల ఇప్పుడు అంటీముట్టనట్టుగా ఉండాల్సి వస్తోంది. ఈ పరిణామం అటు తుమ్మలను ఇటు ఆయన అనుచర గణాన్ని కొంత డీలా పడేసినట్టే అయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన బీజేపీ వైపు వెల్తున్నారన్న ప్రచారం కూడా జరిగినప్పటికీ ఆయన మాత్రం నేటీకి టీఆరెఎస్ లోనే కొనసాగుతున్నారు. అయితే సత్తుపల్లిలో జరిగిన ఎన్టీఆర్ వందో జయంతి ఉత్సవాలలో పాల్గొనడం సరికొత్త చర్చకు దారి తీస్తోంది. తెలంగాణాలో టీడీపీకి పునరుజ్జీవం నింపే యోచనలో అధినేత చంద్రబాబు ఉన్నట్టుగా ఇటీవల వార్తలు కూడా వెలువడ్డాయి. మొదటి నుండి టీడీపీలోనే ఉన్న తుమ్మల తెలంగాణలో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్న క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తుమ్మలను టీఆరెఎస్ లో జాయిన్ చేయించుకుని ఎమ్మెల్సీ మంత్రిగా బాద్యతలు అప్పగించారు. అయితే ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో పువ్వాడ అజయ్ కుమార్ ఎంట్రీ… ఆయన కేబినెట్ మంత్రిగా బాద్యతలు నిర్వర్తిస్తున్న క్రమంలో తుమ్మలపై వివక్ష చూపుతున్నారన్న అభిప్రాయాలు బాహాటంగానే వినిపిస్తున్నాయి. దీంతో టీడీపీ బలోపేతం అయ్యే అవకాశాలున్న నేపథ్యంలో తాను తిరిగి పూర్వాశ్రమం వైపు అడుగులు వేసే యోచనలో ఉన్నానన్న సంకేతాలు అటు ఇద్దరు చంద్రులకు చెప్పకనే చెప్పారా అన్న చర్చ సాగుతోంది. ఎన్టీరామారావు శతజయంతి పురస్కరించుకుని తాను కార్యక్రమంలో పాల్గొన్నానను తప్ప మరో కారణం లేదని తుమ్మల చెప్పే అవకాశాలు ఉన్నప్పటికీ ఖమ్మం జిల్లాలో నెలకొన్న పరిణామాల కారణంగా టీడీపీలోకి రీఎంట్రీ ఇస్తానన్న ఇండికేషన్స్ పంపించారని అంటున్న వారూ లేకపోలేదు. తుమ్మల చర్య మాత్రం ఖమ్మం జిల్లాలో చర్చకు దారి తీసిందన్నది మాత్రం నిజం.

You cannot copy content of this page