మొయినాబాద్ ఫాం హౌజ్ ఎమ్మెల్యేలల ప్రలోభాలకు గురి చేసే విషయంలో భారతీయ జనతా పార్టీ మరింత దూకుడు పెంచింది. బుధ వారం రాత్రి అజీజ్ నగర్ ఫాం హౌజ్ లో వెలుగులోకి వచ్చిన ఈ అంశంపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం టీఆరెఎస్ పై అటాక్ చేస్తూనే కోర్టులను ఆశ్రయించి మరీ తన వ్యూహానికి పదును పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో నిందితుల రిమాండ్ ను ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తిరస్కరించడంతో వారి ఆరోపణలకు మరింత పదును పెడుతున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో లంచం తాలుకూ డబ్బుల రికవరీ చూపించలేదని, కేసులో సరైన ఆధారాలు లేవని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ యాక్టు ఈ కేసులో అప్లికేబుల్ కాదని కూడా స్పష్టం చేశారు. సీఆర్పీసీ 41 ద్వారా నోటీసులు ఇచ్చి విచారించాలని కూడా న్యాయమూర్తి సూచించారు. దీంతో బీజేపీ ఈ వ్వవహారంలో దూకుడు పెంచనుందని తెలుస్తోంది. ఇప్పటికే హై ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఈ కేసును సీబీఐకి బదిలీ చేయాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఏసీబీ కోర్టు తిరస్కరించిన అంశాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. వంద కోట్లకు సంబందించిన లావాదేవీలు జరిగే అవకాశాలు ఉన్నాయని పోలీసులు ఎఫ్ఐఆర్ లో నమోదు చేయడంతో పాటు నిందితులు కూడా ఇతర రాష్ట్రాలకు చెందిన వారని వీరంతా ఎమ్మెల్యేలను బీజేపీలో చేర్పించేందుకు మంతనాలు జరిపించారని అంటున్నారని సమగ్ర దర్యాప్తు జరగాలంటే సీబీఐకి బదిలీ చేయాలన్న డిమాండ్ ను మరింత గట్టిగా వినిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లు కేసును సీబీఐకి బదిలీ చేయాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. దీనికి తోడు ఏసీబీ కోర్టు నిందితుల రిమాండ్ రిపోర్ట్ ను తిరస్కరించిన అంశాన్ని ఆసరాగా చేసుకుని కేసును సీబీఐకి పంపించేందుకు మరింత తీవ్రంగా ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయి. సీబీఐ చేతికి కేసు వెల్తే మాత్రం లోతుగా విచారణ చేపట్టే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి, స్వామీజీల నేపథ్యం, వారి కాల్ డాటా, వారి ఎవరెవరితో సాన్నిహిత్యంగా ఉన్నారోనన్న విషయాలపై ఆరా తీయనుంది సీబీఐ. అంతేకాకుండా ఈ కేసులో బాధితులుగా ఉన్న నలుగురు ఎమ్మెల్యేలు పైలెట్ రోహిత్ రెడ్డి, బీరం హర్ష వర్దన్ రెడ్డి, గువ్వల బాలరాజు, రేగ కాంతారావులను కూడా విచారించి వారి వాంగ్మూలాలు తీసుకుంటుంది. ఎమ్మెల్యేల స్టేట్ మెంట్ రికార్డు చేయడంతో పాటు వారిని అన్ని కోణాల్లో విచారించే అవకాశాలూ ఉన్నాయి. స్వామీజీలతో ఉన్న అనుభందం ఏంటీ.? వారికి వీరికి పరిచయాలు ఎలా అయ్యాయి..? ఫాం హౌజ్ మీటింగే మొదటి సారా అంతకు ముందు కూడా భేటీ జరిపారా..? బీజేపీ అగ్రనేతలు మీతో మాట్లాడారా.? ఎవరు మాట్లాడారు ఎంత ఆఫర్ ఇచ్చారు అన్న విషయాల గురించి కులంకశంగా సీబీఐ ప్రశ్నించనుంది. ముఖ్యంగా ఫాంహౌజ్ కు సెల్ఫ్ డ్రైవింగ్ లో రావడానికి కారణం ఏంటీ..? గన్ మెన్లు లేకుండా డ్రైవర్లు లేకుండా ఎందుకు వచ్చారు అన్న ప్రశ్నలు కూడా వేసి కూపీ లాగేందుకు సీబీఐ ప్రయత్నిస్తుంది. అలాగే టవర్ లోకేషన్ తో పాటు వీరీ కాల్ డాటా కూడా సేకరించి అటు నిందితులను ఇటు బాదితులను సమగ్రంగా విచారించిర తర్వాత ఈ వ్యవహారంలో జరిగిన కుట్ర కేసు ఎవరిని చుట్టుకుంటుందో స్పష్టం కానుంది.
ఆ క్లూలే ఆధారం కానున్నాయా..?
ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూ ఆధారంగా కూడా బీజేపీ ఫిర్యాదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాము ఫ్రెండ్ ఫాం హౌజ్ కోసం వచ్చామని గువ్వల బాల రాజు చెప్పగా, ట్రాప్ జరిగింది అందుకోసమే మీరు వచ్చారని చెప్తున్నారు కదా అని రిపోర్టర్ అడగగా దానికి మాకు సంబంధం లేదని స్పష్టం చేశారు. మళీ అదే ప్రశ్నను రిపిట్ చేసినప్పుడు కూడా ఏం సంబంధం లేదు, మాకేం తెలియదు ఇది మా ఫ్రెండ్ ఫాం హౌజ్ రావడం జరిగిందంతే అనగానే ఎప్పుడొచ్చారు అని రిపోర్టర్ ప్రశ్నించగా రెండు మూడు గంటలవుతోందని చెప్పారు. ఎందుకొచ్చారు అని మళ్లీ అడిగినప్పుడు కూడా మా ఫ్రెండ్ ఫాం హౌజ్ ఇది అందుకే వచ్చాం అని సమాధానం ఇచ్చారు. అంతా మునుగోడులో ఉన్నారు ఈ సమయంలో మీరిక్కడకు రావడానికి ప్రధాన కారణం ఏమి అనుకోవచ్చు అని రిపోర్టర్ ప్రశ్నిస్తే తరువాత మాట్లాదాం అని వ్యాఖ్యానించారు. ఫాం హౌజ్ లో డబ్బులు దొరికాయని, అధికార పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నించిందని పోలీసులు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్న అంశాలకు కౌంటర్ గా ఎమ్మెల్యే వ్యాఖ్యలకు పొంతన లేదన్న వాదన కూడా తెరపైకి తీసుకొచ్చేందుకు కూడా బీజేపీ సమామత్తం కానుంది.
మాజీ ఎమ్మల్సీ ఫైర్…
మరో వైపున బీజేపీ మాజీ ఎమ్మెల్సీ, హై కోర్టు అడ్వకేట్ రాంచందర్ రావు గురువారం రాత్రి మీడియాకు విడుదల చేసిన వీడియోలో ముగ్గురు నిందితులు కూడా టీఆరెఎస్ పార్టీ డ్రామా ప్లేయర్స్ అని వ్యాఖ్యానించారు. కావాలనే రిమాండ్ రిపోర్ట్ ను వీక్ చేసి నిందితులు బయటకు రావాలన్న ఉద్దేశ్యంతో వ్యవహరించారని ఆరోపించారు. 41 సీఆర్పీసీ నోటీసు ఇవ్వలేదని, సెక్షన్ 8 కింద డాక్యూమెంట్లు, రికవరీ చేసినవేమీ లేవని, డబ్బులు ఎక్కడ ఉన్నవి, అవి ఎక్కడ రివకరీ చేశారు..? ఏ డాక్యూమెంట్ ఏ ఆధారం కింద వస్తుంది..? కరప్షన్ యాక్టు ఎలా వస్తుందని ఏసీబీ కోర్టు ప్రశ్నించినట్టు రాంచందర్ రావు వివరించారు. ఇదంతా గమనిస్తే నిందితులు, బాధితులు అంతా కూడా ఒకే డ్రామా కంపెనీకి చెందిన యాక్టర్లని ఆరోపించారు. అయితే బీజేపీ మాత్రం ఈ విషయాన్ని వదిలిపెట్టదని ఈ ఎపిసోడ్ పై సీబీఐ దర్యాప్తు చేయాల్సిందేనని, హై కోర్టు కానీ సుప్రీం కోర్టు జడ్జి కానీ ఈ కేసును మానిటరింగ్ చేయాల్సిందేనని అప్పుడే తప్పు చేసిన టీఆరెఎస్ నాయకుల బండారం బయట పెట్టి తీరుతామని రాంచందర్ రావు స్పష్టం చేశారు.