నిజామాబాద్ : జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ స్కీం కింద ఆయా పాఠశాలల్లో ప్రవేశాల కోసం గురువారం లక్కీ డ్రా ప్రక్రియ నిర్వహించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో అదనపు కలెక్టర్ పీ.యాదిరెడ్డి పర్యవేక్షణలో, విద్యార్థులు వారి తల్లిదండ్రుల సమక్షంలో లక్కీ డ్రా కొనసాగింది. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ స్కీం కింద దరఖాస్తు చేసుకున్న వారిలో లక్కీ డ్రా ద్వారా ఎంపికైన వారికి ఒకటో తరగతిలో, 5వ తరగతిలో ప్రవేశాలు కల్పించారు. ఒకటో తరగతిలో ప్రవేశాలు కోరుతూ 433 మంది దరఖాస్తు చేసుకోగా, డ్రా పద్ధతి ద్వారా 102 మందికి ప్రవేశాలు కల్పించారు. అదేవిధంగా ఐదవ తరగతి లో ప్రవేశం కోరుతూ మొత్తం 511 మంది దరఖాస్తులు చేసుకోగా, డ్రా విధానం ద్వారా 101 మందికి ప్రవేశాలు కల్పించడం జరిగిందని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారిణి శశికళ తెలిపారు. లక్కీ డ్రా ప్రక్రియ నిబంధనలకు అనుగుణంగా పూర్తి పారదర్శకంగా జరిగిందని అన్నారు.