మునుగోడుకు అనుకోని అతిథులు

రారండయ్… రారండి…

మునుగోడు ఉప ఎన్నికలు రాజకీయ పార్టీల ప్రచారానికి అడ్డాగా మారితే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని సగటు పౌరులు ఆలోచిస్తున్నారు. ఉనికి చాటుకునేందుకు పొలిటికల్ పార్టీల మెయిన్ లీడర్స్ ప్రయత్నిస్తుంటే.. అధిష్టానం భేష్ అనాలని నాయకులు భావిస్తున్నారు. అయితే ఈ ఎన్నికల్లో మరో కోణం కూడా వెలుగులోకి రావడం చర్చనీయాంశంగా మారింది. అనుకోని అతిథులను ఆహ్వానిస్తూ మునుగోడు పేదలు సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఇతర ప్రాంతాల్లో ఉన్న తమ చుట్టాలకు ఫోన్ చేసి మరీ నాలుగు రోజులు ఉండి వెల్లండని అభ్యర్థిస్తున్నారట. ఎన్నికల బిజీలో బంధువులను పిల్చుకోవడం ఏంటీ..? వారు అక్కడి ఓటర్లని భావిస్తున్నారా… అస్సలు కాదండి వారు కేవలం బంధువులగానే వచ్చి వెల్తారంతే. మరో మూడు రెండు రోజుల్లో ముగియనున్న ఎన్నికల ప్రచారం నేపథ్యంలో ఆయా పార్టీలు తమకున్న జన ప్రవహాన్ని చూపించి ఓటర్లను అనుకూలంగా మల్చుకోవాలన్న ప్రయత్నంలో నిమగ్నం అయ్యాయి. ఈ సమయంలో మునుగోడుకు వస్తే అన్ని విధాల శ్రేయస్కరంగా ఉంటుందని ఇతర ప్రాంతాల్లో ఉన్న తమ బంధువులకు పిలుపులు వెల్తున్నాయి.

ఆ రెండింటా…

ఉప ఎన్నికలు ప్రధానంగా సామన్య ఓటర్లకు ఉపాధినిస్తున్నాయని చెప్పక తప్పదు. ఉప ఎన్నికల ప్రచారంలో నాయకులతో పాటు కలిసి వెల్తే ఎంతో కొంతముట్టజెప్పి భోజనాలు కూడా పెడ్తున్నారు. ఇతర ప్రాంతాల్లో ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న తమ బంధువులు కూడా వస్తే వారికి ఉపాధి కల్పించినట్టూ అవుతుంది, మరో వైపున తమ వ్యక్తిగతంగా కల్సుకుని నాలుగు రోజులు ఉండిపోయినట్టూ ఉంటుందని భావించి వారిని రమ్మని కోరుతున్నారట. ప్రచారానికి వెళ్తే రెండు పూటలా భోజనం పెట్టి రూ.300 నుంచి రూ.500 వరకు కూలీ ఇస్తున్నారని, రాజకీయ నాయకులకు ఎంత ఎక్కువ జనం ఉంటే అంతమందిని ప్రచారంలో తిప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తమ చుట్టాలకూ ఆదాయం దొరుకుతుందన్న భావనతో పిలుస్తున్నారని తెలుస్తోంది. టోపీ, జెండా పట్టుకుని తిరిగితే ఒక కూలీ, బోనాలు వంటి స్పెషల్ ఎఫెక్ట్ తో హాజరైతే మరో రకం కూలీ గిట్టుబాటు అవుతుండడంతో ఇదే సమయంలో నాలుగు రాళ్లూ వెనకోవచ్చని కూడా సలహాలు ఇస్తున్నారట. దీంతో మునుగోడు నియోజకవర్గంలో మరో రెండు రోజుల పాటు అనుకోని అతిథుల రాకపోకలు కూడా తీవ్రంగానే ఉంటాయని అంచనా వేస్తున్నారు. వీఐపీలు వచ్చినట్టయితే బహిరంగ సభలు కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉండడం, రోడ్ షోలు నిర్వహించేందుకు పార్టీల లీడర్లు సమాయత్తం అవుతుండడం వల్ల మరింత ఎక్కువ కూలీ గిట్టుబాటు అవుతుందని అంచనా వేసుకుంటున్నారు. ఏది ఏమైనా పేదలకు మాత్రం ఇదో రకమైన ఉపాధి కల్గుతోందన్నది నిజం.

You cannot copy content of this page