గులాభి గుబాళిస్తుందా..? కాషాయం వికసిస్తుందా..? కాంగ్రెస్ పరిస్థితి ఏంటీ..
ఉప ఎన్నికల్లో సెంటిమెంట్ కలిసొస్తుందా..? ఆ పార్టీల నినాదం సక్సెస్ అవుతుందా..? మునుగోడు ఓటరు తీర్పుతో ఎవరి అంచనాలు కరెక్టో తేటతెల్లం కానుంది. ఇంతకీ ఏమా సెంటీమెంట్..? ఏంటా కథా తెలుసుకుందాం…
హ్యాట్రిక్ కోసం…
అధికార టీఆరెఎస్ పార్టీ హ్యాట్రిక్ కొట్టాలని ఉవ్విళ్లూరుతోంది. 2018 ఎన్నికల తరువాత ఉమ్మడి నల్గొండ జిల్లాలో జరుగుతున్న మూడో ఉప ఎన్నిక ఇది. నాగార్జున సాగర్ సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అనారోగ్యంతో మృత్యువాత పడడంతో అక్కడ ఉప ఎన్నికలు అనివార్యం అయ్యాయి. దీంతో ఆయన తనయుడు నోముల భగత్ ను బరిలో నిలిపి, రాజకీయ కురువృద్దుడు జానారెడ్డిపై విజయం సాధించింది టీఆరెఎస్. ఈ ఎన్నికల్లో పిచ్చుకపై బ్రహ్మాస్త్రాన్ని కాంగ్రెస్ ప్రయోగిస్తే… బ్రహ్మాస్త్రంపై పిచ్చుకను ప్రయోగించి టీఆరెఎస్ సక్సెస్ అయిందని చెప్పవచ్చు. హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా, నల్గొండ ఎంపీగా టీపీసీసీ నేత ఉత్తంకుమార్ రెడ్డి గెలవడంతో హుజుర్ నగర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో ఇక్కడ జరిగిన ఎన్నికల్లో టీఆరెఎస్ అభ్యర్థి సానంపుడి సైదిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ తరుపున ఉత్తం భార్య పద్మావతి పోటీ చేశారు. చివరకు టీఆరెఎస్ తన అధిక్యాన్ని ప్రదర్శించి హుజూర్ నగర్ స్థానాన్ని కూడా తన ఖాతాలో వేసుకుంది. అయితే తాజాగా జరుగుతున్న మునుగోడు ఎన్నికల్లోనూ గెలిచి ఉమ్మడి నల్గొండ జిల్లాలో హ్యట్రిక్ సాధించాలని భావిస్తోంది. ఇందుకోసం అన్ని విధాలుగా కష్టపడి పనిచేస్తున్న టీఆరెఎస్ సక్సెస్ అయితే కమ్యూనిస్టుల జిల్లాలో గులాభి రెపరెపలాడించి చరిత్ర సృష్టించాలని ఉవ్విళ్లూరుతోంది. మునుగోడులో పట్టున్న కమ్యూనిస్టు పార్టీల మద్దతు కూడా టీఆరెఎస్ పార్టీ తీసుకుంటోంది. ఓ రకంగా చెప్పాలంటే మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆరెఎస్, కమ్యూనిస్టు పార్టీల ఉమ్మడి అభ్యర్థి కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నరీతిలో ప్రచారం జరుగుతోంది. ఈ ఎన్నికల్లో గులాభి జెండా ఎగురవేస్తే డబుల్ బొనాంజా కూడా కొట్టినట్టుగా భావిస్తున్నట్టు సమాచారం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో బలమైన నాయకులుగా ఎదిగిన జానారెడ్డి, ఉత్తంకుమార్ రెడ్డిలపై పైచేయి సాధించామని, మునుగోడు విజయంతో కోమటిరెడ్డి బ్రదర్స్ ను కూడా పొలిటికల్ దెబ్బతీసినట్టు అవుతుందని టీఆర్ఎస్ అధిష్టానం యోచిస్తోంది. ఒక వేళ ఇదే నిజమైతే మాత్రం నల్గొండ జిల్లాలో గులాభి గుభాలించి చరిత్ర సృష్టించనుంది.
బీజేపీ అంచనాలివి…
2018 అసెంబ్లీలో ఒక్క ఆర్ తో మొదలైన ప్రస్థానం ట్రిపుల్ ఆర్ వరకూ చేరిన బీజేపీ మరో ఆర్ ను కూడా అసెంబ్లీలో అడుగుపెట్టించాలని భావిస్తోంది. కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నకోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి బీజేపీలో చేరి ప్రజా క్షేత్రంలో తన సచ్ఛీలతను నిరూపించుకునేందుకు బరిలో నిలిచారు. మునుగోడులో రాజగోపాల్ రెడ్డిని గెలిపించినట్టయితే అసెంబ్లీలో రాజాసింగ్, రఘునందన్ రావు, రాజేందర్, రాజగోపాల్ రెడ్డిలు కాషాయం కండువా ప్రతినిధులుగా హాజరవుతారని బీజేపీ అధిష్టానం అంచనా వేస్తోంది. దుబ్బాక సిట్టింగ్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి మరణానంతరం జరిగిన ఉప ఎన్నికల్లో టీఆరెఎస్ అభ్యర్థి సుజాతపై బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు, హుజురాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆత్మగౌరవ నినాదంతో గులాభి పార్టీకి బైబై చెప్పి కాషాయం కండువా కప్పుకుని మరీ బై పోల్స్ లో విజయం సాధించారు. ఇదే పంథాలో మునుగోడులోనూ సక్సెస్ కావాలని బీజేపీ నాయకత్వం భారీ స్కెచ్ వేస్తోంది. ఈ ఉప ఎన్నికల్లో గెలిచినట్టయితే బై పోల్స్ లో ‘మూడు మావి… రెండే మీవి’ అన్న నినాదంతో బీజేపీ ముందుకు సాగనుంది. ప్రజాభిప్రాయం గులాభి పార్టీకి వ్యతిరేకంగా ఉన్నదన్న విషయాన్ని ఎత్తి చూపనుంది. ఇప్పటికే రాష్ట్రంలో పాగా వేసేందుకు తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్న కాషాయ దళం మునుగోడు ఉప ఎన్నికతో మరింత దూకుడు ప్రదర్శించే అవకాశాలు లేకపోలేదు.
అస్థిత్వం కోసమేనా…?
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి గెలుపు మాట అటుంచితే పార్టీ అస్థిత్వం ఉంటుందా లేదా అన్నదే ప్రశ్నార్థకంగా మారింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వర్గపోరు స్రవంతి ఎన్నికలపై తీవ్రంగా పడుతోందన్నది వాస్తవం. కాంగ్రెస్ పార్టీని అంతం చేయాలన్న లక్ష్యంతో బీజేపీ, టీఆరెఎస్ పార్టీలు ఒక్కటయ్యాయని ఆరోపిస్తున్న టీపీసీసీ నాయకులు క్షేత్ర స్థాయిలో మాత్రం పూర్తి స్థాయిలో పనిచేయలేకపోతున్నారన్న విమర్శలు ఉన్నాయి. సీనియర్ కాంగ్రెస్ నేత పాల్వాయి గోవర్దన్ రెడ్డి కూతురిగా బరిలో నిలిచిన స్రవంతికి బాసటగా నిలిచేందుకు రాష్ట్ర నాయకత్వం అంతగా పని చేయడం లేదన్న విమర్శలయితే ఉన్నాయి. మరో వైపున రాహుల్ జోడో యాత్ర కూడా ఇదే సమయంలో రాష్ట్రంలోకి ఎంటర్ కావడం కూడా స్రవంతి ఎన్నికల ప్రచారానికి విఘాతం ఏర్పడిందని చెప్పకతప్పదు. ముఖ్య నాయకులంతా కూడా జోడ్ యాత్రపైనే దృష్టి సారించాల్సి వస్తుండడంతో కాంగ్రెస్ ప్రచారం అంతగా మెరుపులు మెరిపించడం లేదు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మునుగోడుకు వెల్లివస్తున్నప్పటికీ ఇక్కడ ఆయన వర్గం మాత్రమే సీరియస్ గా పనిచేస్తోంది. మిగతా నాయకులు వెల్లామా… వచ్చామా అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని పార్టీ వర్గాలే చర్చించుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితిలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.