దాడులు చేిసి పోలీసులు
దేశ వ్యాప్తంగా మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ సమీపంలో అధికార పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అంతా మునుగోడు ఎన్నికల వైపు దృష్టి సారించిన సమయంలో టీఆరెఎస్ పార్టీకి చెందిన శాసన సభ్యులను కొనుగోలు చేసేందుకు ఓ జాతీయ పార్టీ నేత వేసిన స్కెచ్ ను తెలంగాణ పోలీసులు ఛేదించారు. మెయినాబాద్ ఫాంహౌజ్ కేంద్రంగా జరిగిన బేరసారాల వ్యవహారం గురించి జాతీయ స్థాయిలో సంచలనం కల్గించింది. రాష్ట్రానికి చెందిన రేగ కాంతారావు, పైలెట్ రోహిత్ రెడ్డి, బీరం హర్ష వర్దన్ రెడ్డి, గువ్వల బాలరాజులను మెయినాబాద్ అజీజ్ నగర్ లోని ఓ ఫాం హౌజ్ లో ప్రలోభపెడుతున్న క్రమంలో పోలీసులు దాడులు చేసి పట్టుకున్నారు. ఘటనా స్థలం నుండి రూ. 100 కోట్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు బేరసారాలు చేసేందుకు వచ్చిన వారిని అదుపులోకి తీసుకున్నారు.
ఎమ్మెల్యేలే సమాచారం ఇచ్చారు: సీపీ స్టీఫెన్ రవింద్ర
ఫాం హౌజ్ లో తమను ప్రలోభ పెడ్తున్నారన్న సమాచారం ఎమ్మెల్యేలు ఇవ్వడంతో తాము రంగంలోకి దిగి దాడులు చేశామని సైబారాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర మీడియాకు తెలిపారు. ఫాం హౌజ్ లో దొరికిన వారిలో ఢిల్లీ సమీపంలోని ఫరీదాబాద్ ఆలయంలో ఉండే రామచంద్ర భారతి స్వామి, తిరుపతి నుండి వచ్చిన సింహయాజి అనే మరో స్వామిజీ, హైదరాబాద్ కు చెందిన నందకుమార్ లు ఉన్నారన్నారు. రామచంద్ర భారతీ స్వామి అధికార పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించారని సీపీ వివరించారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు.