వైఎస్ షర్మిల బహిరంగ లేఖ…
ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు, భారత్ జోడో యాత్ర నిర్వహిస్తున్న రాహుల్ గాంధీకి వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలోకి ఎంటర్ అవుతున్న జోడో యాత్రలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిపై ప్రశ్నించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడుతూ… రాహుల్ గాంధీ ని స్వాగతిస్తున్నామని అయితే తెలంగాణ ప్రజల సమస్యలపై కూడా మాట్లాడాలన్నారు. దేశంలోనే అతి పెద్ద స్కాం కాళేశ్వరం ప్రాజెక్టని, రాహుల్ గాంధీ ఈ స్కామ్ గురించి మాట్లాడాలని కోరారు. సీఎం కేసీఅర్ కాళేశ్వరం ఒక అద్బుతం అని చెప్పడంతో పాటు 18 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని ప్రకటించి కేవలం 57 వేల ఎకరాలకు మాత్రమే ఇచ్చారని ఆరోపించారు. వైఎస్సార్ రూ. 38 వేల కోట్ల తో పూర్తి చేయాలనుకున్నారన్న విషయాన్ని గుర్తు చేస్తూ… ఒక ముఖ్యమంత్రి రూ. 38వేల కోట్లతో చేయాలనుకున్న ప్రాజెక్ట్ కు రూ. లక్షా 20 వేల కోట్లకు ఎలా పెంచారని ప్రశ్నించారు. ఈ ప్రాజెక్ట్ ఒక మెగా మోసం, మెగా అబద్ధం అంటూ షర్మిల దుయ్యబట్టారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ దేశంలోనే అతి పెద్ద కుంభకోణమని, 2జీ, కోల్ స్కాం కన్నా తక్కువేమి కాదన్నారు. ఇరిగేషన్ వ్యవహారాలను కూడా సీఎం కేసీఅర్ పర్యవేక్షిస్తున్నారన్న విషయాన్ని గమనించాలన్నారు. రాష్ట్రంలో యాత్ర చేయనున్న రాహుల్ గాంధీ కాళేశ్వరం అవినీతిపై మాట్లాడాలని పట్టుబట్టారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కుంభకోణం పై దక్కాల్సిన అటెన్షన్ దక్కడం లేదని, మీడియా హౌజ్ లను మెగా కృష్ణారెడ్డి, సీఎం కేసీఅర్ మేనేజ్ చేస్తున్నారని ఆరోపించారు. తమ పార్టీ మాత్రమే ఈ స్కాం గురించి మాట్లాడుతోందని, కాంగ్రెస్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మెగా కి జీతగాళ్ళుగా మారిపోయారంటూ షర్మిల ఘాటుగా విమర్శించారు. వారికి మెగా కృష్ణా రెడ్డి డబ్బులు పంపిస్తున్నారని, అందుకే ఎవరూ నోరు విప్పడం లేదన్నారు. మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎందుకు ఇక్కడ మాట్లాడటం లేదో రాహుల్ గాంధీ వెల్లడించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం హోదాలో ఉందని, ప్రధాన ప్రతి పక్షమై కూడా ఎందుకు మాట్లాడటం లేదో అర్థం కావడం లేదన్నారు. కొంతమంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సంతలో పశువుల్లా అమ్ముడు పోగా మిగిలిన వారు పార్టీలో ఉండి అమ్ముడు పోయారని, రెండింటికి పెద్ద తేడా ఏమీ లేదని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పాదయాత్ర చేస్తే సరిపోదని,
కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిపై మాట్లాడాలని, లక్ష కోట్లు సెంట్రల్ ఫైనాన్సియల్ కంపెనీల నుండి ఫండింగ్ జరిగినందున ఈ ప్రాజెక్ట్ కుంభకోణాన్ని నేషనల్ స్కాం అంటున్నామన్నారు. బీజేపీ నేతలు సైతం ఈ ప్రాజెక్ట్ లో భారీగా అవినీతి జరిగింది అంటున్నారని, జలశక్తి మంత్రి, ఆర్థిక మంత్రి పదే పదే అంటున్నారు కానీ విచారణకు ఎందుకు ఆదేశాలు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.
సీబీఐ, ఈడిలతో విచారణ జరిపించవచ్చు కదా అని షర్మిల అన్నారు.