సీఎం బాటలోనే మేము…

సిరొంచ రైతుల పోరుబాట…

కాళేశ్వరం ప్రాజెక్టు ముంపు గ్రామాల రైతులు సరికొత్త పంథాలో ఆందోళనలు చేపట్టారు. ఇప్పటి వరకు మహారాష్ట్ర ప్రభుత్వంపైనే ఒత్తిడి చేసిన అక్కడి రైతులు ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యంగా ఆందోళనలు చేపట్టారు. మహారాష్ట్రలోని ముంపు గ్రామాల రైతులు ఉద్యమాన్ని ఉధృతం చేయడం ఆరంభించారు. తమకు తీరని నష్టం వాటిల్లుతున్నా పట్టించుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సరిహద్దు గ్రామాల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గడ్చిరోలి జిల్లా సిరొంచ తాలుకాలోని 12 గ్రామాల రైతులు గురువారం సిరొంచ తహసీల్దార్ కు వినతి పత్రం ఇచ్చారు. అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు పోస్టు కార్డులు రాసి పంపించారు. మేడిగడ్డ బ్యారేజీ వల్ల తీవ్రంగా నష్టపోతున్న తమను ఆదుకునే విషయంలో తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తమకు చెల్లించాల్సిన పరిహారం వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రగతి భవన్ కు పోస్టు కార్డులను పంపించే కార్యక్రామాన్ని చేపట్టిన సందర్భంగా రైతులు మాట్లాడుతూ… నవంబర్ 7వ తేది వరకు తమకు పరిహారం చెల్లించనట్టయితే బ్యారేజీ కూల్చివేస్తామని హెచ్చరించారు. వారం రోజుల్లో తమకు న్యాయం చేయకపోతే ఆందోళణలను తీవ్రతరం చేస్తామని, ఆమరణ దీక్షలు కూడా చేపడతామని సరిహద్దు రైతులు హెచ్చరించారు. చేనేత జీఎస్టీ తగ్గించాలని మీరు ప్రధానికి ఏ విధంగా లేఖలు రాస్తున్నారో అదే స్పూర్తితో తాము రాస్తున్నామని, తమ సమస్యను పరిష్కారించాలని డిమాండ్ చేశారు. మంపునకు గురవుతున్న భూములకు రూ. 3 లక్షలు ఇస్తామంటే ఒప్పుకునేది లేదని మార్కెట్ ధర చెల్లించాల్సిందేనన్నారు. లేనట్టయితే తమ ఉద్యమ తీవ్రత ఎలా ఉంటుందో చేతల్లోనే చూపిస్తామని సిరొంచ రైతులు స్పష్టం చేశారు.

నోటిఫై భూములు…

మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ సమయంలో ఇరు రాష్ట్రాల అధికారులు సర్వే చేసి నోటిఫై చేసిన భూముల్లో అవసరమున్నంత వరకే పరిహారం చెల్లించి మిగతా వాటిని విస్మరించారని సరిహద్దు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే బ్యారేజ్ నిర్మాణం తరువాత అప్పుడు నోటిఫై చేసిన భూములకన్నా ఎక్కువ మునకకు గురవుతున్నాయన్నారు. ఇప్పుడు మాత్రం అప్పుడు పరిహారం చెల్లించని, ఇఫ్పుడు సేకరించే భూములకు ఎకరాకు 3 లక్షల చొప్పున మాత్రమే పరిహారం ఇస్తామనడం బాదాకరమని రైతులు అంటున్నారు. మొదట ఇచ్చిన పరిహారంలో మూడో వంతు కూడా ఇవ్వమని ప్రభుత్వం చెప్తుండడం తమను విస్మయం కల్గిస్తోందని మహారైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏండ్లు గడిచిన తరువాత భూముల దరలు పెంచాల్సిందిపోయి తగ్గించి ఇస్తామనడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. తమ న్యాయమైన కోర్కెలు తీర్చేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి చొరవ తీసుకోవాలని, ఇప్పటికే మహా సర్కార్ లేఖ రాసినందున త్వరగా పరిహారం చెల్లించాలని సిరొంచ రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఎకరాకు రూ. 20 లక్షలు చెల్లించాల్సిందేనని లేనట్టయితే ఊరుకునేది లేదని వారు స్పష్టం చేస్తున్నారు.

You cannot copy content of this page