పదోతరగతి విద్యార్థులకు విషమ పరీక్ష

ఊట్నూరులో జవాబు పత్రాల బెండిల్ గల్లంతు

దిశ దశ, ఆదిలాబాద్:

రాష్ట్రంలో పదో తరగతి విద్యార్థులకు విషమ పరీక్ష ఎదురవుతోంది. అధికారులు కావాలని చేస్తున్న తప్పిదాలో లేక నిర్లక్ష్యమో తెలియదు కానీ టెన్త్ స్టూడెంట్స్ పరిస్థితి ఆగమ్య గోచరంగా తయారైంది. సోమవారం ఉదయం వికారాబాద్ లో పదో తరగతి పేపర్ వాట్సప్ గ్రూపుల్లో షేర్ కావడంతో రాష్ట్రంలోని విద్యార్థులంతా అయోమయానికి గురయ్యారు. మంగళవారం నాడు పరీక్ష యథావిధిగా కొనసాగుతుందా లేదా అన్న మీమాంస కొనసాగింది రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం సాయంత్రం మరో ఘటన చోటు చేసుకోవడం సంచలనంగా మారింది. ఆదిలాబాద్ జిల్లా ఊట్నూరులో ఏకంగా జవాబు పత్రాలు గల్లంతు కావడం సంచలనంగా మారింది. మొత్తం 1011 మంది విద్యార్థులు ఐధు సెంటర్లలో పరీక్షలు రాశారు. ఇందుకు సంబంధించిన జవాబు పత్రాలు ఎగ్జామినేషన్ ఇంఛార్జీలు పోస్టాఫీసుకు తరలించారు. ఈ జవాబు పత్రాలను బోర్డుకు పంపించేందుకు ఆటోలో బస్ స్టాండ్ కు తరలించారు. అక్కడకు చేరుకున్న తరువాత లెక్కిస్తే 11 బెండిల్స్ కు బదులు 10 మాత్రమే ఉండడంతో పోస్టల్ అధికారులు మిస్సయిన బెండిల్ కోసం ఆరా తీసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో పోస్టల్ అధికారులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పోలీసులు రంగంలోకి దిగి ఆటో వెల్లిన మార్గాల్లో గాలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఐట్నూరు ఎస్సై భరత్ సుమన్ కేసు దర్యాప్తు చేపట్టారు. బెండిల్ మిస్సయిన వ్యవహారం వెలుగులోకి రావడంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము ఏడాదంతా కష్టపడి చదివి ఉన్నత విద్యకు వెళ్లాలని కలలు కంటున్న క్రమంలో తాము రాసిన పరీక్ష పేపర్ బెండిల్ మిస్ కావడం ఏంటన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దొరికిన బెండిల్…?

అయితే మంగళవారం రాత్రి మిస్సయిన 10వ తరగతి జవాబు పత్రాలకు సంబంధించిన బెండిల్ దొరికినట్టుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. విద్యాశాఖ, పోస్టల్ డిపార్ట్ మెంట్, పోలీసు విభాగాలకు సంబంధించిన ఫార్మాలిటీస్ పూర్తయిన తరువాత బెండిల్ ను ఎగ్జామ్స్ రీ వాల్యూయేషన్ చేసే సెంటర్ కు తరలిస్తారు. ఈ జవాబు పత్రాల బెండిల్ తో పాటు ఎఫ్ఐఆర్ కాపీతో పాటు పంచనామా పత్రాలకు సంబంధించిన వివరాలను అటాచ్డ్ చేసే పంపించాల్సి ఉంటుందని తెలుస్తోంది. వాస్తవంగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఇద్దరు, ఒక ఆటో డ్రైవర్ లేదా ఆన్సర్ షీట్స్ రవాణా చేసే వాహన డ్రైవర్లు బస్ స్టాండ్ వరకు వెల్లి అవి ఆర్టీసీ బస్సులో ఎక్కించిన తరువాత పోస్టాఫీసులో రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఈ లెక్కన ఆటోలో జవాబు పత్రాలు తరలిస్తున్నప్పుడు వెంట ఎంతమంది సిబ్బంది ఉన్నారు..? వారు ఎందుకు గుర్తించలేకపోయారు అన్నది తేలాల్సి ఉంది.

పదో తరగతి జవాబు పత్రాల బెండిల్ ఇలా ప్యాక్ చేస్తారు….

నిర్లక్ష్యమా..?

విద్యార్ధుల భవితవ్యానికి సంబంధించిన వ్యవహారంలో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏంటోనన్నదే అంతుచిక్కకుండా తయారైంది. ఆధునిక యుగానికి చేరుకున్నామన్న భ్రమల్లో రక్షణ చర్యలు తీసుకోవడంలో విఫలం అవుతున్నట్టుగా స్పష్టమవుతోంది. విద్యార్థి దశలో అత్యంత కీలకమైన పదో తరగతి జవాబు పత్రాలను తరలించేందుకు పోస్టల్ అధికారులు ఆటోలో తరలించడం ఏంటీ..? బెండిల్స్ వేర్వేరుగా రవాణా చేయడం వెనకున్న ఆంతర్యం ఏంటోనన్నది కూడా అంతుచిక్కకుండా పోతోంది. గతంలో అయితే బెండిల్స్ బోర్డుకు చేరే వరకూ బాధ్యతతో వ్యవహరించే వారని ఇప్పుడు ఎందుకంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నదే మిస్టరీగా మారింది.

కేసు నమోదు చేసిన ఊట్నూరు పోలీస్ స్టేషన్

You cannot copy content of this page