12 కిలోమీటర్లు…. 2 గంటలు…

మానకొండూరు ఇసుక లారీల తీరు

దిశ దశ, మానకొండూరు:

మానకొండూరు సమీపంలో స్థానికులు నిలువరించిన ఇసుక లారీల వ్యవహారంపై లోతుగా ఆరా తీయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు టీఎస్ఎండీసీ ఏ సమయం వరకు లోడింగ్ చేయాలని నిభందనలు విధించింది… రీచుల్లో ఏం జరుగుతోంది అన్న అంశంపై చర్చోపచర్చలు సాగుతున్నాయి. మానకొండూరు వద్ద శనివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో స్థానికులు ఇసుక లారీలు అడ్డుకున్నారు. దీంతో దాదాపు రెండు కిలోమీటర్ల మేర ఇసుక లారీలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అంతేకాకుండా మరిన్ని లారీలు గ్రామాలతో పాటు ప్రధాన రహదారిల పక్కన నిలిపివేశారు. అయితే ఇందులో ఇటీవలే ప్రారంభించిన వెల్ది క్వారీ నుండి ఇసుక రవాణా చేస్తున్నట్టుగా కొన్ని వే బిల్లులు ఉన్నాయి. ఈ ఒక్క రీచు విషయాన్నే పరిగణనలోకి తీసుకున్నట్టయితే అక్కడ పక్కాగా నిభందనలకు నీళ్లొదులుతున్నారన్న విషయం తేటతెల్లం అవుతోంది. వెల్ది రీచుకు మానకొండూరుకు మధ్య దాదాపు 12 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అయితే శనివారం స్థానికులు అడ్డుకున్న లారీలు 8 గంటల ప్రాంతంలో అంటే 12 కిలోమీటర్ల దూరం ప్రయాణించేందుకు 2 గంటల సయమయం పట్టిందా లేక సాయంత్రం 6 గంటల తరువాత కూడా లారీల్లో ఇసుకు నింపుతున్నారా అన్న విషయం తేలాల్సి ఉంది. ఒక వేళ ముందుగానే లోడ్ చేసినట్టయితే అంత ఆలస్యానికి కారణం ఏంటన్నది మిస్టరీగా మారింది. వాస్తవంగా టీఎస్ఎండీసీ నిబంధనల ప్రకారం రీచుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు వే బ్రిడ్జి కూడా ఉండాలి. కానీ ఈ నిభందనలేవి అమలు కాకపోవడం వల్ల ఇష్టారీతిన సమయపాలన లేకుండా ఇసుక లోడింగ్ కొనసాగిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. మానిటరింగ్ చేయాల్సిన టీఎస్ఎండీసీ మొక్కుబడిగా ప్రాజెక్టు ఆఫీసర్లను నియమించి ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ ద్వారా రీచులు నిర్వహిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. దీంతో పాటు అంతా ఆన్ లైన్ పేమెంట్ విధానం, ఆన్ లైన్ వే బిల్లు జారీ విధానం సాగుతున్నందున రీచుల వద్ద ఆర్థిక లావాదేవీలకు ఎలాంటి అవకాశం ఉండకూడదు కానీ అలాంటి పద్దతికి మంగళం పాడారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. శనివారం మానకొండురులో స్థానికులు అడ్డుకున్న లారీలను తూకం వేయిస్తే రీచుల్లో సాగుతున్న అక్రమాల తంతు వెలుగులోకి వస్తుందని అంటున్నారు స్థానికులు. అంతేకాకుండా రీచుల వద్ద ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు చేసి లారీలు ఎన్ని గంటలకు లోపలకు వెల్లింది, బయటకు ఎన్ని గంటలకు వచ్చింది అన్న వివరాలను పొందు పరిచేందుకు ప్రత్యేకంగా ఓ రిజిస్టర్ మెయింటెన్ చేయాల్సి ఉంటుంది. అలాగే రీచుల్లో పని చేసే సిబ్బంది ప్రత్యేకంగా యూనిఫాం వేసుకుని సేవలు అందించాల్సిన అవసరం ఉంటుంది కానీ ఇలాంటి పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. టీఎస్ఎండీసీ అధికారులు రీచుల నిర్వహణ కోసం ప్రత్యేకంగా సిబ్బందిని నియమించిన తరువాత కూడా రీచుల కాంట్రాక్టర్లు ప్రత్యేకంగా స్టాఫ్ ను ఏర్పాటు చేసుకోవడానికి కారణాలు ఏంటన్నది అంతుచిక్కడం లేదు. నది నుండి ఇసుకను స్టాక్ యార్డుకు తరలించేందుకు జేసీబీలతో పాటు ఇతర వాహానాలకు డ్రైవర్లను నియమించుకోవాల్సి ఉంటుంది. కానీ అడిషనల్ మేనేజ్ మెంట్ స్టాఫ్ ఎందుకన్నదే అంతుచిక్కడం లేదు. టీఎస్ఎండీసీ ఆదాయాన్ని ఎరగా చూపిస్తూ నిభందనలకు పాతరేయడం వల్లే రీచుల్లో కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యంగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

లారీ వాలాల తీరు…

అయితే ఇసుక రీచుల నుండి బయలుదేరుతున్న లారీల తీరుపై కూడా అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. లారీలన్ని కూడబలుక్కుని ఒకే సారి బయలుదేరడం వెనక ఆంతర్యం ఏంటన్నది కూడా తేలాల్సి ఉంది. ఒకేసారి పదుల సంఖ్యలో లారీలు వెల్లినట్టయితే అధికారులు దాడులు చేసినా లారీలన్ని ఎక్కడిక్కడ నిలిచిపోతాయని దీంతో ట్రాఫిక్ సమస్య ఎదురవుతుందని చకచకా తనిఖీ చేసి పంపిస్తారన్న ఆలోచనతోనే ఇలా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అలాగే లారీల్లో ఓవర్ లోడ్ విషయం తేలాలంటే అధికారులు చెక్ చేసిన వెంటనే వే బ్రిడ్జిల వద్దకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఏక కాలంలో పెద్ద సంఖ్యలో లారీలు వే బ్రిడ్జివద్దకు తీసుకెళ్లడం కూడా అధికారులకు తలనొప్పిగా మారుతోంది. ఈ కారణంగానే లారీలన్ని కూడా ఒకేసారి బయలుదేరే విధానాన్ని మొదులుపెట్టినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా ఆకస్మిక తనిఖీలు చేసేందుకు వెల్లే అధికారుల మూవ్ మెంట్ కూడా వీరికి వెంటవెంటనే చేరిపోతుందన్న ప్రచారం కూడా లేకపోలేదు. ఈ సమాచారం అందుకునే లారీ వాలాలు వాట్సప్ గ్రూపుల ద్వారా ఎప్పటికప్పుడు ఆ సమాచారం చేరవేసుకుంటున్నారు. దీంతో అడపాదడపా దాడులు నిర్వహించినా పట్టుబడుతున్న ఇసుక లారీల సంఖ్య అతి తక్కువగా ఉంటోంది. గ్రామాల్లో కూడా ప్రజలు అడ్డుకున్న సమాచారాన్ని కూడా వెంటనే వాట్సప్ గ్రూపుల్లో పోస్ట్ చేస్తున్నారు. దీంతో వెనక నుండి వచ్చే లారీలు డైవర్ట్ అయి వేరే మార్గం గుండా వెల్లిపోతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. మానకొండూరులో స్థానికులు అడ్డుకున్న లారీల విషయంలో అధికారులు అన్ని కోణాల్లో ఆరా తీస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

అనారోగ్యంతో సహవాసం…

ఇసుక రీచులు ఏర్పాటు చేసిన ప్రాంతాల్లోని ప్రజలు అనారోగ్యాలతోనే సహవాసం చేయాల్సిన దుస్థితి తయారైంది. వందల సంఖ్యలో తిరిగే లారీల వల్ల దుమ్మ ధూళీ లేస్తుండడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న్నారు. అంతేకాకుండా రాత్రి వేళ్లల్లో లారీల హారన్ల మోతలతో ప్రజలు నిద్రపోయే పరిస్థితి లేకుండా పోతోందన్న ఆవేదన కూడా వ్యక్తమవుతోంది. లారీల రాకపోకలతో గ్రామాల్లోని గల్లీలన్ని శబ్దకాలుష్యంతో కూడా నిండిపోతున్నాయి. రాత్రి వేళల్లో లారీలను ఎక్కడిక్కడ కట్టడి చేయాల్సిన అవసరం కూడా ఉందన్న విషయాన్ని అధికారులు గమనించాల్సి ఉంది.

You cannot copy content of this page