దిశ దశ, కరీంనగర్:
కరీంనగర్ స్మార్ట్ సిటీ పనుల్లో అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయని బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, మాజీ మేయర్ సర్దార్ రవిందర్ సింగ్ ఆరోపణలు గుప్పించారు. ఈ విషయంలో పలు మార్లు ఫిర్యాదు చేసినా అప్పటి అధికారులు పట్టించుకోలేదని మండిపడ్డారు. బుధవారం కరీంనగర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… స్మార్ట్ సిటీ నిధులతో చేపట్టవలసిన పనుల గురించి నగరానికి చెందిన 80 వేల మంది ప్రజలతో ప్రత్యేకంగా సమావేశం అయి ఏఏ మౌళిక సదూపాయాలు చేపట్టాలో నిర్ణయించడం జరిగిందన్నారు. అయితే ఆ తరువాత నిబంధనలకు విరుద్దంగా, ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా పనులు చేపట్టారని, స్మార్టీ సిటీగా గుర్తించని ప్రాంతాల్లో కూడా పనులు చేశారని ఆరోపించారు. కరోనా సమయంలో రోడ్ల నిర్మాణం కోసం చేగూర్తి నుండి ఇసుక తీసుకొచ్చారని నల్ల రకానికి చెందిన ఈ ఇసుక నిర్మాణాలకు ఉపయోగించకూడదని ఈ కారణంగానే రోడ్లు దెబ్బతిన్నాయన్నారు. దెబ్బ తిన్న రోడ్లను మళ్లీ మళ్లీ వేసి తప్పులు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారని రవిందర్ సింగ్ ఆరోపించారు. స్మార్ట్ సిటీ నిర్మాణాల కోసం ఉపయోగించిన ఇసుకకు రూ. 36 కోట్లు ప్రభుత్వానికి చెల్లించ లేదన్నారు. కేవలం రోడ్ల కోసం మాత్రమే నిధులను ఖర్చు చేశారని ఏరియా బేస్ డెవలప్ కింద గుర్తించిన ప్రాంతాల్లో మాత్రమే స్మార్ట్ సిటీ వర్క్స్ చేపట్టాల్సి ఉన్నప్పటికీ గ్రామ పంచాయితీల్లో కూడా రోడ్లు వేసి, నిబందనలకు విదరుద్దంగా వ్యవహరించారని ఆయన ఆరోపించారు. బోర్డ్ ఆఫ్ డైరక్టర్లలో ఐఏఎస్ అధికారులు ఉంటారని, స్మార్ట్ సిటీ పనుల్లో 130 కోట్ల మేర అవినీతి జరిగిందని, ఈ విషయంపై తాను గతంలో ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకున్న వారే లేకుండా పోయారన్నారు. అంతేకాకుండా అనుమతి లేకుండా లేఔట్లు వేసిన ప్రాంతాల్లో కూడా రోడ్లు వేసి అక్రమాలకు పాల్పడ్డారని, అధికారులు లాలూచి పడ్డారన్నారు. రూ. 130 కోట్ల మేర అవినీతి జరిగిందని 6 నెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వ అధికారుల నుండి జిల్లా అధికారుల వరకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని రవిందర్ సింగ్ ఆరోపించారు. అడ్వాన్స్ బిల్లులు డ్రా చేసుకున్న నిధులతో ఇప్పుడు కూడా రాత్రికి రాత్రే రోడ్లు వేస్తున్నారని, డ్రైనేజీలు లేకుండానే రోడ్లు వేసిన ఘటనలు కూడా ఉన్నాయని, శ్వేత హోటల్ పక్కన సందు రోడ్డులో అయితే మురుగు కాలువల నిర్మాణం లేకుండానే ఫుట్ పాత్ నిర్మాణం జరిపారని రవిందర్ సింగ్ విమర్శించారు. కరీంనగర్ స్మార్ట్ సిటీకి చెందిన ఫైళ్లను వెంటనే సీజ్ చేయాలని, ఎస్ఈతో పాటు ఇతర ఇంజనీరింగ్ అధికారులను సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాకుండా కరీంనగర్ అభివృద్ది కోసం అప్పటి సీఎం కేసీఆర్ 133 కోట్లు ప్రత్యేక నిధులు మంజూరు చేస్తే ఆ నిదులతో చేపట్టిన పనుల బాధ్యతలు కూడా స్మార్ట్ సిటీ కాంట్రాక్టర్ కే ఇచ్చారని ఆరోపించారు. కార్పోరేషన్ లో పనిచేసే కొందరు ఇంజనీరింగ్ అధికారులకు మాత్రమే స్మార్ట్ సిటీ వర్క్స్ కు సంబంధించిన బిల్లులు చేసే అధికారం ఇచ్చారని, వేరే వాళ్లకు బాద్యతలు అప్పగించలేదన్నారు. అయితే వారిపై ఎన్ని ఫిర్యాదులు వచ్చినా ఎందుకు చర్యలు తీసుకోడం లేదని రవిందర్ సింగ్ ప్రశ్నించారు. ప్రముఖులు వచ్చినప్పుడు అత్యవసరంగా రోడ్లు వేసే విధానం ఉంటుంది కానీ కరీంనగర్ లో మాత్రం రాత్రికి రాత్రే రోడ్లను ఎందుకు వేస్తున్నారో అంతుచిక్కడం లేదన్నారు. 50 వేల జనాభాకో మార్కెట్ ఉండాలని నిధులు కెటాయిస్తే బండలు పగలగొట్టేందుకని రూ. 50 వేల చొప్పున ఖర్చు చేశారన్నారు. అలాగే జంక్షన్ ఇంప్రూవ్ మెంట్ పేరిట ఐదేళ్లలో మూడు సార్లు నిధులు ఖర్చు చేశారని ఒక్కో జంక్షన్ లో రూ. కోటి వరకు నిధులు దుర్వినియోగం అయ్యాయని కరీంనగర్ ను దోచుకుంటున్నారని రవిందర్ సింగ్ మండిపడ్డారు.
ఓట్లు తగ్గడానికి కారణం అదే
కరీంనగర్ స్మార్ట్ సిటీ పనుల్లో అవినీతి కారణంగానే బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు తగ్గాయని రవిందర్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో స్మార్ట్ సిటీ కింద కరీంనగర్ ను గుర్తించినందుకు 8 వేల ఓట్ల ఆధిక్యం రాగా ఈ ఎన్నికల్లో 3 వేల ఓట్లు తగ్గిపోయాయన్నారు. ఇందుకు ప్రధాన కారణం స్మార్ట్ సిటీలో జరిగిన అవకతవకలేనని రవిందర్ సింగ్ స్పష్టం చేశారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ పనుల్లో జరిగిన అక్రమాలపై విచారణ చేపట్టాలని మళ్లీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేస్తున్నానని వెల్లడించారు. ఈ మీడియా సమావేశంలో కేమసారం తిరుపతి, పెండ్యాల మహేష్, గుంజపడుగ హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.