రాజమండ్రి సెంట్రల్ జైల్ కు బాబు

జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించాలని ఆదేశించిన ఏసీబీ కోర్టు

దిశ దశ, ఏపీ బ్యూరో:

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు 14 రోజుల పాటు జ్యడిషియల్ రిమాండ్ విధిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అనూహ్య పరిణామాల మధ్య ఉత్కంఠ భరితంగా సాగిన వాద ప్రతివాదనల్లో చివరకు ఏసీబీ కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించడం గమనార్హం. దాదాపు 36 గంటల పాటు ఏపీలో నెలకొన్న పరిస్థితులు తమకు అనుకూలంగా మారుతాయని టీడీపీ పార్టీ శ్రేణులు అంచనా వేసినప్పటికీ లాభం లేకుండా పోయంది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో నంద్యాలలో ఉన్న చంద్రబాబు నాయుడును శుక్రవారం రాత్రి అరెస్టు చేసేందుకు సీఐడీ బృందం వెల్లింది. అయితే ఆయన అరెస్ట్ విషయంలో జరిగిన తర్జనభర్జనల నేపథ్యంలో శనివారం ఉదయం 6 గంటలకు సీఐడీ అధికారులు 50 (1) (2) సీఆర్పీసీ నోటీసులు ఇచ్చి చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేశారు. నంద్యాల నుండి రోడ్డు మార్గం గుండా విజయవాడ సీఐడీ సిట్ ఆఫీసుకు తరలించి ఆదివారం ఉదయం ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు. సుప్రీం కోర్టు న్యాయవాది సిద్దార్థ్ లుథ్రా చంద్రబాబు నాయుడు తరుపున వాదించగా, సీఐఢీ తరుపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డిలు వాదనలు వినిపించారు. ఆదివారం ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగిన వాద ప్రతివాదనలు విన్న ఏసీబీ కోర్టు న్యాయమూర్తి హిమ బిందు మాజీ ముఖ్యమంత్రికి 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో చంద్రబాబు నాయుడును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తలరించేందుకు సీఐడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే రాత్రి కావడంతో చంద్రబాబు నాయుడును వెంటనే రాజమండ్రికి తరలించకుండా సిట్ కార్యాలయంలోనే ఉంచి ఉదయం తరలించే ఆలోచనలో అధికారులు సమాలోచనలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియపై కూడా కసరత్తులు చేస్తున్నట్టు సమాచారం. మరో వైపున రోడ్డు మార్గం గుండా గన్నవరం ఏయిర్ పోర్టుకు తరలించి అక్కడి నుండి హెలిక్యాప్టర్ ద్వారా రాజమండ్రికి తరలించాలన్న ప్రతిపాదనను కూడా సీఐడీ అధికారులు పరిశీలిస్తున్నారు. రోడ్డు మార్గం గుండా వెల్లినట్టయితే శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని, నంద్యాల నుండి విజయవాడ వరకు తలరించిన క్రమంలో ఏర్పడిన అవాంతరాలకు సంబంధించిన ఫుటేజీని కూడా కోర్టు ముందు ఉంచే అవకాశాలు ఉన్నట్టు సమాచారం.

144 సెక్షన్…

మరో వైపున చంద్రబాబు నాయుడుకు జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు హై అలెర్ట్ గా ఉండాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. అన్ని జిల్లాల్లో కూడా 144 సెక్షన్ అమలు చేయాలని కూడా నిర్ణయించినట్టుగా తెలుస్తోంది.

You cannot copy content of this page