తల్లులకు ప్రాణం పోసిన అమ్మ

నవ మాసాలు మోసి ఓ బిడ్డకు జన్మనిచ్చిన తల్లుల గురించి వినడం సర్వసాధారణం. కానీ మరికొద్ది సేపట్లో పండంటి బిడ్డకు జన్మనివ్వాలని కలలు కన్నా ఆ తల్లులు విగత జీవులుగా మారిపోయే ప్రమాదం నుండి బయటపడడం ఓ సంచలనమే అని చెప్పాలి. పురిటి నొప్పులతో ఈ క్షణమో మరుక్షణమో బిడ్డకు జన్మనిచ్చేందుకు ఆసుపత్రికి చేరిన తల్లులు ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని బిక్కు బిక్కు మంటూ కాలం వెల్లదీసారు. సరిగ్గా 14 ఏళ్ల క్రితం జరిగిన ఓ ఘటన యావత్ భారతదేశాన్ని గడగడలాడిస్తే ప్రత్యక్ష సాక్షిగా ఉన్న ఓ మాతృమూర్తి మాత్రం తనలోని ధైర్యాన్ని ప్రదర్శించి ఎంతోమంది అమ్మలకు పునర్జన్మిచ్చింది. బాహ్య ప్రపంచంలోకి అడుగు పెట్టక ముందే కానరాని లోకాలకు వెళ్లాల్సిన ఆ బిడ్డల జన్మకు కారణమయింది. ఐదు పదుల వయసున్న ఆ అమ్మ చేసిన సాహసం గురించి సువర్ణాక్షరాలతో లిఖించాల్సిందే. ఇంతకీ ఎవరా తల్లి ఏమా కథ అంటే మీరు ఈ స్టోరీ చదవాల్సిందే.

ముంబాయి దాడులు…

14 ఏళ్ల క్రితం అంటే 26 నవంబర్ 2008 రాత్రి ముంబాయిలోని కామా హాస్పిటల్ లోకి చొరబడ్డాడు ఓ ఆగంతకుడు. తన సహచరుడితో కలిసి హాస్పిటల్ ఆవరణలోకి ప్రవేశించి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఆసుపత్రి సెక్యూరిటీ గార్డులిద్దరూ అక్కడికక్కడే మృతి చెందగా ఆ మృతదేహాలు రక్తపు మడుగులో పడి ఉన్నాయి. ఓ నర్సు కూడా కాల్పులలో గాయపడి పడిపోయింది. ఆ అగంతకుడు అతని సహచరుడు వరండా దాటి మెట్లు ఎక్కుతున్నారు. ‘అంజలి కుల్తే’ అనే 50 ఏళ్ల నర్సు తూటాల శబ్దాలు విని మొదటి అంతస్తు నుంచి ఈ భయానక దృశ్యాన్ని గమనించింది. ఆ రోజు ‘నైట్ షిఫ్ట్’లో ఉన్న అంజలీ కుల్తే ‘ప్రసూతి వార్డు ఇన్‌చార్జి’గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆ వార్డులో డెలివరీ కోసం 20 మంది గర్భిణీలు అయ్యారు. అంతటి భయనక వాతావరణంలో తమ ప్రాణాలు కాపాడుకునేందుకే ప్రాధాన్యం ఇస్తారు చాలామంది. అంతేకాకుండా ఆ క్షణంలో ఎదురయ్యే టెన్షన్ లో ఏం చేస్తున్నామో అర్థం కాక ఏం చేయాలో పాలపోక గజిబిజిగా గందరగోళానికి గురయ్యే పరిస్థితి ఉంటుంది. కానీ అంజలి కుల్తే మాత్రం మొక్కవోని ధైర్యంతో తనతో పాటు వార్డులో ఉన్న 20 మంది గర్భిణీలను ప్రాణాలతో కాపాడేందుకు సాహసం చేసిందనే చెప్పాలి. గ్రౌండ్ ఫ్లోర్ లో దద్దరిల్లిన తుపాకి శబ్దాలతో పాటు అక్కడి నుండి వినిపిస్తున్న ఆర్తనాదాలను పట్టించుకోకుండా తన వార్డులో ఉన్న వారిని క్షేమంగా కాపాడడం ఎలా అని ఆలోచించిన అంజలి కుల్తే ఎదురుగా వస్తున్న ఇద్దరు సాయుధ ఉగ్రవాదులను గమనించి చక చకా రక్షణ చర్యలకు శ్రీకారం చుట్టారు. ఇద్దరు అగంతకులు మెట్ల మీదుగా తన వార్డు వైపునకు వస్తున్న విషయాన్ని గమనించిన అంజలి తన ప్రాణాలను లెక్క చేయకుండా  ముందుకు దూసుకెళ్లి తన వార్డు గది తలుపులను మూసేసింది. వెంటనే వార్డులో ఉన్న 20 మంది గర్భిణీలను అదే అంతస్తు చివరలో ఉన్న చిన్న ‘పాంట్రీ’కి తరలించింది. అదే సమయంలో అగంతకుడు అతని సహచరుడు ఆసుపత్రి టెర్రస్‌పైకి చేరుకుని గుమిగూడిన పోలీసులపై ఓ వైపున కాల్పులు జరుపుతూ మరో వైపున గ్రెనేడ్లు విసురుతున్నారు. అదును కోసం చూస్తున్న అంజలి నెమ్మదిగా బయటికి వచ్చి గాయపడిన నర్సును క్యాజువాలిటీకి తీసుకెళ్లి చికిత్స అందించారు. ఇంతలో ఇరవై మందిలో ఒకరు ప్రసవ వేదనతో బాధ పడుతున్న విషయాన్ని గమనించిన అంజలి ఆమె చేయి పట్టుకుని నడిపించుకుటూ అతి కష్టం మీద   డెలివరీ రూమ్ కు చేరుకొని మరో డాక్టర్ సాయంతో ప్రసూతి చేయించారు. ఏ మాత్రం అజాగ్రత్త వహించినా పురిటి నొప్పులతో బాధపడుతున్న తల్లితోపాటు తన ప్రాణాలకు గ్యారెంటీ లేదని తెలిసినా అంజలీకుల్తే మాత్రం గర్భిణీని ధైర్యంగా డెలివరీ రూమ్ కు తీసుకెళ్లడమే కాకుండా ప్రసూతి చేయడం గమనార్హం. ఆమె డ్యూటీ చేస్తున్న వార్డు తలుపులు మూసి వేయనట్టయితే అగంతకులు ఆ వార్డులోకి చొరబడితే ఎలాంటి పరిస్థితులు ఉండేవో అర్థం చేసుకోవచ్చు.

అగంతకులు ఎవరు?

2008 నవంబర్ 26న జరిగిన ఈ సంఘటన లో అంతర్జాతీయ ఉగ్రవాది కసబ్ అతని సహచరుడు ఆసుపత్రులకు చొరబడి చేసిన విధ్వంసం మారణకాండ గురించి నేటికీ చాలామందికి గుర్తు ఉండే ఉంటుంది. అయితే ఈ ఘటన వెనక జరిగిన మరో కోణం అంజలి కుల్తే సాహసం ఎవర్ గ్రీన్ అనే చెప్పాలి. టెర్రరిస్టు లు చేసిన విధ్వంసం గురించి ప్రతి ఒక్కరు చర్చించుకుంటారు కానీ అంతటి భయానక పరిస్థితుల్లో కూడా తనలోని మాతృత్వపు మమకారాన్ని పంచి ఎందరో తల్లులకు ఆ మాతృత్వపు మాధుర్యాన్ని మిగిల్చిన అంజలి ధైర్యానికి హాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే.

వెంటాడిన వైనం

కసబ్ దాడి ఘటన ముగిసిన తర్వాత కూడా అంజలి కుల్తే ఆనాటి భయానక పరిస్థితుల నుండి బయటపడలేకపోయారు. చాలా రోజులపాటు ఆ ఉత్కంఠ ఘడియలు గుర్తుకు వచ్చినప్పుడల్లా ఓ రకమైన ఆందోళనకు గురయ్యేవారు. కొన్ని కొన్ని సార్లు నిద్ర నుండి కూడా లేచి కూర్చునేవారు. కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా ఆ ఉగ్రముఖల దాడి తాలూకు గుర్తులు ఆమెను వెంటాడేవి. నెల రోజుల తర్వాత  కసబ్ గుర్తించేందుకు తర్వాత సాక్షిగా కోర్టుకు హాజరు కావాలని పోలీసులు పిలిచారు. అయితే అంజలి కుల్తే కోర్టులో సాక్ష్యం చెప్పేందుకు వచ్చినప్పుడు.”నా ‘యూనిఫాం’ ధరించడానికి అనుమతించాలని అభ్యర్థించారు. యూనిఫామ్‌పై ఉండడం వల్లే తాను ఆనాటి భయంకరమైన పరిస్థితుల్లోనూ బాధ్యతను గుర్తెరిగానని, అంత ధైర్యంగా వ్యవహరించగలగడానికి కారణమైన ఆ యూనిఫాంలో రావడానికి కోర్టు అనుమతివ్వాలని కోరారు. తనకు స్ఫూర్తిని, ధైర్యాన్ని ఇచ్చిన యూనిఫామ్ వేసుకుని సాక్ష్యం చెప్పేందుకు వస్తానని చెప్పడంతో అందుకు కోర్ట్ కూడా సమ్మతించింది. ఆ రాత్రి అంజలి కుల్తే ప్రదర్శించిన సాహసం ఇరవై మంది మహిళల ప్రాణాలనే కాకుండా, ఈ ప్రపంచాన్ని చూడకముందే మృత్యువు ఒడిలో చేరాల్సిన వారిని కాపాడింది. పద్నాగేళ్ల వయసుకు చేరిన వారికి తమకు జన్మనిచ్చిన తల్లులకు మరు జన్మ ప్రసాదించిన తల్లి ఒకరున్నారని, ఆ తల్లే లేకుంటే తామీ సమాజాన్ని చూసే వారమూ కాదన్న నిజం వారికి తెలుసో తెలియదో కానీ అంజలీ కుల్తే సాహసానికి మాత్రం ఈ దేశం గర్వించాల్సిందే.

You cannot copy content of this page