ప్రముఖ టెక్ కంపెనీల్లో ఉద్యోగాల తొలగింపు పర్వానికి తెర పడటం లేదు. తాజాగా మరో కంపెనీ వేలాది మందిని తీసేసేందుకు సిద్ధమైంది. పేపాల్ కంపెనీ రెండు వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. పేపాల్ హోల్డింగ్స్ ఇంక్ త్రైమాసికంలో స్థూల ఆర్థిక మందగమనంతో 2,000 మంది ఉద్యోగులను తగ్గించనున్నట్లు స్పష్టం చేసింది. ఏడు శాతం మంది ఉద్యోగులపై ప్రభావం చూపేలా ఉద్యోగుల కోత రానున్న వారాల్లో జరుగుతాయని పేపాల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాన్ షుల్మాన్ స్పష్టం చేశారు.
కొవిడ్ మహమ్మారి తగ్గుముఖం పట్టిన తర్వాత చెల్లింపుల పరిమాణంలో వృద్ధి మందగించింది. దీంతో పేపాల్ స్టాక్ దెబ్బతింది. ఈ నేపథ్యంలో పేపాల్ కంపెనీలో ఉద్యోగాల కోతతో పాటు కార్యాలయాల మూసివేతతో ఖర్చులు తగ్గించుకోవాలని నిర్ణయించింది. ఖర్చుల కంటే ఆదాయాన్ని పెంచుకోవడానికి తమ కంపెనీ ప్రణాళికలు రూపొందించిందని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాన్ షుల్మాన్ చెప్పారు. పేపాల్ ప్లాట్‌ఫారమ్‌లో చెల్లింపుల పరిమాణం గత ఏడాది 1.4 ట్రిలియన్ డాలర్లకు చేరుకుందని కంపెనీ వెల్లడించింది.
మరోవైపు టెక్ దిగ్గజం అమెజాన్ పలువురు ఉద్యోగులను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ఫిలిప్స్ మరోసారి ఉద్యోగులను తొలగిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా తమ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో మరో ఆరు వేల మందిని తొలగిస్తున్నట్లు వెల్లడించింది. కంపెనీ ఉత్పత్తుల్లో ఒకటైన స్లీప్ రెస్పిరేటర్స్‌లో లోపాల కారణంగా భారీ నష్టాలు తలెత్తడంతో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఉద్యోగుల కోతల ప్రకటన వెలువడటం మూడు నెలల్లో ఇది రెండోసారి కావడం గమనార్హం.