తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే విషయంపై క్లారిటీ ఇచ్చింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నుంచే బండి సంజయ్ పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. బండి సంజయ్ వేములవాడ నుంచి పోటీ చేస్తారని గతంలో ప్రచారం జరిగింది. కానీ గెలుపు అంచనాలు బేరీజు వేసుకున్న బండి సంజయ్.. చివరికి కరీంనగర్ అసెంబ్లీ స్థానాన్నే ఎంచుకున్నట్లు చెబుతున్నారు.
కరీంనగర్ నియోజకవర్గంలో బండి సంజయ్ కు బాగా పట్టు ఉంది. కరీంనగర్ లోక్ సభ స్థానం నుంచి ప్రస్తుతం ఎంపీగా ఉండగా.. ఇది ఆయనకు కలిసొచ్చే అంశం. అంతేకాకుండా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండటం, పాదయాత్ర కూడా చేయడంతో.. వచ్చే ఎన్నికల్లో ఆయనకు గెలుపు అవకశాలు కరీంనగర్ అసెంబ్లీ స్ధానంలో ఉంటాయని అంటున్నారు. అంతేకాకుండా గతంలో రెండుసార్లు కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. దీంతో ఈ సారి సెంటిమెంట్ కూడా కలిసొచ్చే అవకాశముందని బండి సంజయ్ అంచనా వేసుకుంటున్నారు.
2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి బండి సంజయ్ పోటీ చేయగా.. రెండుసార్లు పరాజయం పాలయ్యారు. ఆ రెండు ఎన్నికల్లోనూ ప్రస్తుత మంత్రి గంగుల కమలాకర్ చేతిలో బండి ఓడిపోయారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో గంగుల కమలాకర్ కు 77,209 ఓట్లు రాగా.. బండి సంజయ్ కు 52,544 ఓట్లు వచ్చాయి. ఇక కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన లక్ష్మీనరసింహరావుకు 51,560 ఓట్లు వచ్చాయి. ఇక 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కరీంనగర్ అసెంబ్లీ స్ధానం నుంచే బండి సంజయ్ పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు.
గత ఎన్నికల్లో గంగుల కమలాకర్ కు 80,983 ఓట్లు రాగా.. బండి సంజయ్ కు 66,009 ఓట్లు వచ్చాయి. ఇక కాంగ్రెస్ నుంచి పోటీ చేసి పొన్నం ప్రభాకర్ కు 39,500 ఓట్లు వచ్చాయి. గంగుల కలాలాకర్ కు ప్రతి ఎన్నికలోనూ బండి సంజయ్ గట్టి పోటీ ఇస్తున్నారు. దీంతో ఈ సారి కూడా కరీంనగర్ అసెంబ్లీ స్థానంలో గంగుల కమలాకర్ ను ఓడించారంటే బండి సంజయ్ నే సరైన అభ్యర్థి అని కాషాయ వర్గాలు భావిస్తున్నాయి.