పోరుబాట పట్టి విజయం సాధించిన అక్కడి రైతులు
వారెవరికీ పలుకుబడి లేదు.. వెన్నుదన్నుగా నిలిచే నాయకులూ లేరు… పంటలు పండిస్తూ జీవనం సాగించే వారే వారంత… అయినా తమ పంతాన్ని వీడకుండా ముందుకే సాగారు. తమ లక్ష్యాన్ని సాధించుకుని చైతన్యాన్ని ప్రదర్శించారు. సామాన్యులు మీతో ఏం కాదని కొంతమంది గేలి చేసినా పట్టించుకోకుండా వారు మాత్రం గెలిచేశారు…. మీ అంతు చూస్తామన్న రీతిలో పరోక్ష హెచ్చరికలు మరికొందరు చేశారు. అసలే అన్నల ఇలాకా అయినా వారు మాత్రం తమ పట్టు వీడలేదు. చివరకు వారికి రావల్సిన వాటిని ప్రభుత్వం ఇచ్చే విధంగా మెప్పించి ఒప్పించుకున్నారు. బలగం ఉన్నా వారిని బలహీన పర్చే విధంగా సమాజంలోని కొన్ని వర్గాలు నిరాశకు గురి చేసినా వెనకడుగు వేయకుండా కదనరంగంలోకి దూకి సక్సెస్ బాట పట్టారు. చేయి చేయి కలిపి… రాజకీయాలతో సంబంధం లేకుండా మైదానంలోకి దిగితే ఎలా ఉంటుందో ప్రాక్టికల్ గా నిరూపించారు అక్కడి రైతులు.
రెండున్నరేళ్లుగా పోరు…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోటి ఎకరాలకు సాగు నీరందించాలన్న సంకల్పంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రం అంతా జలకళ ఉట్టిపడుతోంది. అయితే దీపం కింద చీకటిలా అక్కడి రైతుల పరిస్థితి మాత్రం అత్యంత దయనీయంగా మారిందని చెప్పవచ్చు. ఈ ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ వద్ద నిర్మించిన బ్యారేజీ బ్యాక్ వాటర్ తో తమకు అన్యాయం జరుగుతోందని 2020 నుండి పొరుగునే ఉన్న మహారాష్ట్ర రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. కనిపించిన ప్రతి అధికారికి వినతి పత్రాలు సమర్పించడం తమకు న్యాయం చేయాలని వేడుకోవడం… ఇలా దాదాపు రెండేళ్లుగా తమకు న్యాయం చేయండి మహా ప్రభో అంటూ విన్నపాలు అందిస్తూనే ఉన్నారు. మేడిగడ్డ బ్యారేజీ కారణంగా మహారాష్ట్రలోని సిరొంచ తాలుకాలోని 12 గ్రామాల రైతులు పడుతున్న దీనావస్థ గురించి ఎవరూ పట్టించుకోకపోవడంతో గత సంవత్సరం సెప్టెంబర్ లో భారీ ఎత్తున ఆందోళనకు శ్రీకారం చుట్టారు. గ్రామాల్లోని రైతాంగం అంతా కలిసికట్టుగా తమకు న్యాయం చేయాల్సిందేనని పట్టుబట్టింది. మొదటి విడుతలో జరిపిన భూ సేకరణలో 138 హెక్టార్లను నోటిఫై చేసి కూడా పరిహారం ఇవ్వకపోగా అదనంగా మరో 700 ఎకరాల భూమి ముంపునకు గురవుతోంది. వీరి ఆందోళన నేపథ్యంలో ఎకరాకు రూ. 3 లక్షలు మాత్రమే పరిహారంగా ఇస్తామన్న ప్రతిపాదనను మహారాష్ట్ర అధికారులు రైతుల ముందు ఉంచారు. దీంతో రైతాంగం ఒక్కసారిగా భగ్గుమని లేచి ఇష్టారీతిన పరిహారం ఇస్తామంటే ఊరుకునేది లేదంటూ తేల్చి చెప్పింది. మొదట భూ సేకరణ జరిపినప్పుడు రూ. 10.50 లక్షలు ఇచ్చి ఇప్పుడేమో రూ. 3 లక్షలే ఇస్తామంటారా ఇది అన్యాయమని ఆందోళన బాట పట్టింది అక్కడి రైతాంగం. సిరొంచ తాలుకా కేంద్రంలో నిరవధిక నిరసనలకు శ్రీకారం చుట్టడంతో పలు మార్లు పోలీసులు చట్టాలను అమలు చేస్తామని చెప్పడంతో అక్కడి రైతులు వెనక్కి తగ్గారు. చివరకు నవంబర్ లో తమ నిరసనలు చేపట్టి తీరుతామని అధికారులకు వినతి పత్రాలు ఇచ్చారు. దీంతో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్టు నిరసనలకు ముందు రోజు పోలీసులు ప్రకటించారు. ఆందోళనకు బ్రేకులు వేయాల్సిన పరిస్థితి తయారు కావడంతో రైతులు వ్యూహాత్మకంగా వ్వవహరించి రోజు నిరసన శిబిరంలో నలుగురు చొప్పన బైఠాయించడం ఆరంభించారు. ఈ క్రమంలో డిసెంబర్ 2న మావోయిస్టు పార్టీ పీఎల్జీఏ వారోత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో పోలీసులు నిరసన శిబిరం ఎత్తేయాలని శాంతిభద్రతల సమస్యలు ఎదురవుతాయని చెప్పారు. దీంతో రైతులు తాత్కాలికంగా తమ ఆందోళనలను విరమిస్తున్నట్టు ప్రకటించారు. ఈ వారం రోజుల పాటు తమ ఇళ్ల వద్దే నల్ల జెండాలను ప్రదర్శించి బిక్షాటన చేయడం మొదలు పెట్టారు. వారోత్సవాలు ముగిసిన తరువాత తిరిగి యథావిధిగా రైతులు నిరసనను కొనసాగించారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ మూడో వారంలో మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నాగపూర్ లో నిర్వహిస్తున్నారు. విదర్భ ప్రాంతంలో జరుగుతున్న ఈ సెషన్స్ లో తమ గళాన్ని రాష్ట్ర స్థాయిలో వినిపించుకోవాలని భావించిన బాధిత రైతుల్లో కొంతమంది నాగపూర్ అసెంబ్లీ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న అహేరీ ఎమ్మెల్యే ధర్మరావు బాబా ఆత్రం శిబిరం వద్దకు చేరుకుని సీఎంతో అపాయింట్ మెంట్ ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు ధర్మరావు బాబా ఆత్రం డిసెంబర్ 21న అసెంబ్లీలో డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ను కలిపించారు. రైతుల సమస్యలు విన్న ఫడ్నవిస్ వారికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు జనవరి 6న సిరొంచ రైతులతో గడ్చిరోలి కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి ఎకరాకు రూ. 11. 50 లక్షలు పంట భూములకు, బీడు భూములకు రూ. 10 లక్షల చొప్పున డబ్బులు ఇచ్చేందుకు అంగీకరించారు. ఇందుకు మేడిగడ్డ బాధిత రైతులు కూడా సమ్మతించడంతో అక్కడి రైతాంగానికి పరిష్కారం లభించినట్టయింది.
అంతా సామాన్యులే…
తమకు పరిహారం ఇవ్వాలన్న డిమాండ్ తో ఆందోళనల్లో సామాన్య రైతులే పాల్గొనడం విశేషం. తమకు జరుగుతున్న అన్యాయాన్ని వెలుగులోకి తీసుకొచ్చేందుకు వారు చేసిన ప్రయత్నాలు సఫలం అయి ఏకంగా మహారాష్ట్ర ప్రభుత్వం వారి డిమాండ్లను అంగీకరించడం విశేషం. ఇటీవల కాలంలో భారీ ఎత్తున ఆందోళనలు, రాస్తారోకోలు చేపట్టినా స్పందించని పరిస్థితులే ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వాలు తలొగ్గి డిమాండ్లను పరిష్కరించిన సందర్భాలు తక్కువే. కానీ గడ్చిరోలి జిల్లా సిరొంచ తాలుకా రైతులు మాత్రం సక్సెస్ అయిన తీరు ఆదర్శనీయమనే చెప్పాలి.
మాట తప్పని ఫడ్నవిస్
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫఢ్నవిస్ సిరొంచ రైతులకు మాట ఇచ్చిన 20 రోజుల్లో ఇందుకు అవసరమైన చర్యలు మొదలయ్యాయి. డిసెంబర్ 21న అక్కడి రైతులతో చర్చించిన ఆయన వారికి హామీ ఇవ్వగా జనవరి 6న గడ్చిరోలి జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో చర్చలు జరిపి పరిహారం విషయంలో క్లారిటీ ఇవ్వడం గమనార్హం.
25 ఏళ్ల పోరాటం రిపిట్…
సరిగ్గా 25 ఏళ్ల క్రితం అంటే 19997లో సిరొంచ తాలుకా ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ‘వికాస్ కరో… న విభజన్ కరో’ అన్న నినాదంతో సిరొంచ ప్రాంతంలోని వందకు పైగా గ్రామాలు ఒక్కసారిగా ఆందోళనలకు శ్రీకారం చుట్టాయి. అఖిల పక్షంగా ఏర్పడ్డ అక్కడి ప్రజానికం అంతా కూడా నిరసనలు చేపట్టడంతో రోజు రోజుకు అక్కడి ఉద్యమం ఊపందుకోవడంతో అప్పటి ప్రభుత్వం దిగొచ్చింది. సిరొంచ ప్రాంత ప్రజలతో ప్రత్యేకంగా చర్చించి నేషనల్ హైవే, గోదావరి, ఇంద్రావతి, ప్రాణహిత నదులపై వంతెనల నిర్మాణం, ఇతరాత్ర సౌకర్యాలను మెరుగు పర్చేందుకు అంగీకరించింది. ఈ క్రమంలోనే 1980వ దశాబ్దంలో మంజూరు అయిన నేషనల్ హైవే పనులు బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ (బీఆర్వో) బలగాలతో చేయించారు. ప్రాణహిత, ఇంద్రావతి నదులపై వంతెనల నిర్మాణాలు పూర్తి చేయడంతో ఇరుగు పొరుగు రాష్ట్రాల మధ్య రవాణా వ్యవస్థ మెరుగు పడింది. ఇదే క్రమంలో కాళేశ్వరం వద్ద గోదావరి నదిపై వంతెన నిర్మాణంతో కమ్యూనికేషన్ వ్యవస్థ మరింత మెరుగైంది. అటవీ ప్రాంతంగా ఉన్న సిరొంచ తాలుకా బ్రిటీష్ పాలన కాలంలో అప్పర్ గోదావరి జిల్లా కేంద్రంగా ఉండేది. కానీ స్వతంత్ర భారతంలో మాత్రం మారుమూల ప్రాంతంగా మిగిలిపోగా అక్కడి బిడ్డలు నిరవధిక నిరసనలకు శ్రీకారం చుట్టి తమ ప్రాంతంలోని ప్రధాన సమస్యలను పరిష్కరించుకుంటున్నారు. 25 ఏళ్ల తర్వాత ఆనాటి పోరాటాన్ని మరిపిస్తూ నేడు మేడిగడ్డ రైతులు పరిహారం కోసం ఆందోళనలను చేపట్టి సక్సెస్ అయ్యారు.