కలియుగ వైకుంఠం అయిన ఏడు కొండల వెంకన్న సన్నిధి భక్త జన సందోహంతో కిటకిటలాడిపోతోంది. ఓ వైపున వాతావరణంలో వచ్చిన మార్పులు మరోవైపున పెరిగిన భక్తుల రద్దీ కారణంగా ఇబ్బందులు తప్పడం లేదు. భక్తజనం పెద్ద ఎత్తున కొండపైకి చేరుకోవడంతో ఈ పరిస్థితి తయారైందని టీటీడీ అధికార వర్గాలు చెప్తున్నాయి. 2 కిలోమీటర్లకు పైగా క్యూ లెన్లలో భక్తులు వెంకన్న దర్శనం కోసం వేచి చూస్తుండగా సర్వ దర్శనం కోసం 30 నుండి 40 గంటల సమయంలో పడుతోంది. పొరుగునే ఉన్న తమిళనాడులో పడుతున్న వర్షాల ప్రభావం తిరుమల తిరుపతిలోనూ ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఒక్క సారిగా వాతావరణం చల్లబడడంతో పాటు వర్షం కూడా కురుస్తుండడంతో క్యూలైన్లలో నిలుచున్న భక్తులు గజగజ వణుతున్నారు. చిన్నారులు, వృద్దులను తీసుకొచ్చిన వారి పరిస్థితి మరీ దారుణంగా తయారైందని, వారు అస్వస్థకు గురయ్యే ప్రమాదం ఉందని టీటీడీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పూర్తి భిన్నంగా మారిన పరిస్థితుల్లో అనారోగ్యంతో ఉన్నవారిని, చిన్నారులను, వృద్దులను వెంట తీసుకెల్లాల్సిన వారు తిరుమల శ్రీనివాసుని దర్శనం వాయిదా వేసుకుంటేనే బావుంటుందని టీటీడీ సూచిస్తోంది. క్యూ లెన్లతో పాటు కొండపై ఉన్న వారిలో చాలా మంది కూడా అనారోగ్యానికి గురవుతున్న సంఘటనలూ లేకపోలేదు.
టీటీడీ యంత్రాంగం పరిస్థితి…
తిరుమల తిరుపతి దేవస్థానం యంత్రాంగం పరిస్థితి కూడా ఆగమ్యం గోచరంగా మారింది. లక్షల్లో పోటెత్తిన భక్తులకు అవసరమైన రీతిలో సేవలందించే పరిస్థితి లేకుండా పోయింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి తిరుమలకు వచ్చి భక్తులకు అందిస్తున్న వారే ఎక్కువగా శ్రమిస్తున్న పరిస్థితి కనిపిస్తోందని భక్తులు అంటున్నారు.
కోవిడ్ ఎఫెక్టా…?
కోవిడ్ ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ కారణంగా మొక్కులు తీర్చుకోలేని భక్తులు పెద్ద సంఖ్యలో తిరుపతికి వస్తుండడంతో సెలవులే కాకుండా సాధారణ రోజుల్లోనూ భక్తుల రద్దీ తీవ్రంగా ఉన్నట్టు సమాచారం. రెండేళ్ల పాటు తమ మొక్కులు తీర్చుకోలేని పరిస్థితి నెలకొనడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులు వెంకన్న దర్శనానికి క్యూ కడుతున్నారు. దీంతో భక్తుల రద్దీ తీవ్రం అయి ఉంటుందని అంచనా వేస్తుండగా, సిఫార్సు లెటర్లకు ప్రాధాన్యత గణనీయంగా తగ్గించాలని టీటీడీ నిర్ణయించినట్టు సమాచారం. ఏది ఏమైనా తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని వెంకన్న దర్శనానికి వెల్లే భక్తులు కొంతకాలం వాయిదా వేసుకుంటేనే బావుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.