దిశ దశ, హైదరాబాద్:
తెలంగాణలో ప్రజా పంపిణీ వ్యవస్థ ఛిన్నాభిన్నంగా మారింది. పేదల కడుపు నింపాల్సిన సబ్సీడీ బియ్యం గోదాముల నుండే వ్యాపారుల వద్దకు చేరుతున్నాయి. రేషన్ షాపులే కేంద్రీకృతంగా నడిపిస్తున్న ఈ దందాలో కోట్ల రూపాయల విలువ చేసే బియ్యం అక్రమార్కుల చేతికి చేరుతున్నాయి. దీంతో యధేచ్చగా సాగుతున్న రేషన్ బియ్యం అక్రమ దందాలో భాగస్వాములపై కొరడా ఝులిపిస్తుంటే అసలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
నెల రోజుల్లో…
ఎన్నికల కోడ్ అమలు అయినప్పటి నుండి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆయా శాఖల అధికారుల అక్రమ రవాణాపై కఠినంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అక్రమంగా తరలించే నగదుతో పాటు ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే అంశాలను కట్టడి చేయడం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది ఎలక్షన్ కమిషన్. మరో వైపున రాష్ట్ర ప్రభుత్వం కూడా రేషన్ బియ్యం వ్యవహారంపై ఉక్కుపాదం మోపాలని అప్పటికే ఆదేశించింది. ఈ నేఫథ్యంలో నెల రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల అధికారులు దాడులు నిర్వహించిన ఘటనల్లో కేవలం రేషన్ బియ్యానికి సంబంధించిన కేసులే 45 వరకు నమోదయ్యాయి. ఎన్నికల్లో డబ్బులతో పాటు గిఫ్టులను తరలించడం కన్న అతి ఎక్కువగా రేషన్ బియ్యం కేసులే నమోదయ్యాయంటే రాష్ట్రంలో పీడీఎస్ బియ్యం దందా ఏ స్థాయిలో సాగుతోందో అర్థం చేసుకోవచ్చు.
టిఫిన్ సెంటర్లతో పాటు…
రేషన్ బియ్యం స్థానికంగా ఏర్పాటు చేసే టిఫిన్ సెంటర్లలో విక్రయించే అల్ఫాహారాలకు కొంతమేర తరలిపోతుంటే ఎక్కువ మొత్లంలో మాత్రం పొరుగు రాష్ట్రాలకే వెల్తున్నాయని అధికారుల విచారణలో వెల్లడైంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం సీఎమ్మార్ ధాన్యం తీసుకుని బియ్యం అప్పగించని మిల్లర్ల నుండి రికవరి చేస్తున్న క్రమంలో దారిమల్లించిన ధాన్యాన్ని తీసుకరావడం ఎలా అని కొంతమంది మిల్లర్లు తలలు పట్టుకుంటున్నారు. ఇలాంటి వారికి కూడా రేషన్ బియ్యం వరంలా మారాయని కూడా తెలుస్తోంది. మిల్లర్లు రేషన్ బియ్యాన్ని రీ సైక్లింగ్ చేసి ఎఫ్ సీఐకి అప్పగిస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అలాగే మరికొంతమంది మిల్లర్లు రేషన్ బియ్యాన్ని సన్న బియ్యంగా మార్చి రిటైల్ షాపుల ద్వారా విక్రయిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఈ నెల 8వ తేది రాత్రి కరీంనగర్ జిల్లా దుర్శేడు వెంకటేశ్వర రైస్ మిల్లులో రేషన్ బియ్యాన్ని కరీంనగర్ పోలీసులు పట్టుకున్నారు. సివిల్ సప్లై గోదాం నుండి రేషన్ షాపుకు కూడా వెల్లకుండా బియ్యాన్ని పట్టుకున్న పోలీసులు విచారణ జరపగా వాటిని మార్కెట్లో ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్టుగా తేలింది. మరికొన్ని ప్రాంతాల్లో రేషన్ బియ్యం అనారోగ్యాన్ని పంచుతున్నాయని కూడా ప్రచారం చేస్తున్నారు. దీంతో లబ్దిదారులు కూడా వీటిని తీసుకునేందుకు భయపడిపోతున్నారు. ఇదే అదనుగా భావించిన సబ్సీడీ బియ్యం దందాగాళ్లు కిలోకు రూ. 12 నుండి రూ. 15 వరకు చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. ఇటీవల జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలంలో ఒకరిని అరెస్ట్ చేసినప్పుడు రేషన్ కార్డు దారులను భయందోళనకు గురి చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది.
నగదు బదిలీ స్కీం…
ఇకపోతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ బియ్యం స్థానంలో నగదు బదిలీ స్కీం పెడితే ఎలా ఉంటుంది అన్న ఆలోచన గతంలో చేసింది. అయితే ఈ విధానాన్ని ప్రభుత్వం అమలు చేయడంలో విఫలం అయింది కానీ… రేషన్ బియ్యం దందాగాళ్లు మాత్రం పక్కాగా అమలు చేస్తున్నట్టుగా స్పష్టం అవుతోంది. రేషన్ షాపుల్లో తెల్ల రేషన్ కార్డుదారులు థంబ్ వేసి వారికి వచ్చే బియ్యానికి తగ్గట్టుగా డబ్బులు తీసుకుని వెల్లిపోతున్నారు. గత కొంతకాలంగా ఈ దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. ఇటీవల అధికార యంత్రాంగం ఈ విధానంపై కూడా దృష్టి పెట్టడంతో ప్రత్యామ్నాయంగా కలెక్షన్ సెంటర్లను ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. ఇక్కడి నుండి పొరుగు రాష్ట్రాల్లో షెల్టర్లు ఏర్పాటు చేసుకున్న బడా వ్యాపారులకు సంబంధించిన ఏజెంట్లకు సరఫరా చేస్తే వారు కిలో బియ్యానికి రూ. 17 నుండి రూ. 20 వరకు చెల్లిస్తున్నట్టుగా సమాచారం. ఇక్కడి నుండి గుట్టు చప్పుడు కాకుండా మహారాష్ట్రాకు చేరిపోతున్న ఈ బియ్యం ఖరిదైన బియ్యంగా రూపాంతరం చెంది మార్కెట్లో అందుబాటులోకి వస్తున్నాయి. విదర్భ ప్రాంతంలోని పలు జిల్లాల్లో కూడా తెలంగాణ బియ్యమే రీ సైక్లింగ్ అయి వ్యాపారాన్ని పెంచిపోషిస్తున్నాయి.
సిరొంచ కేంద్రంగా…
ఇటీవల తెలంగాణకు చెందిన విజిలెన్స్ అదికారులు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో భారీ ఎత్తున రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. సరిహద్దులు దాటిపోతున్నాయన్న సమాచారం అందుకున్న అధికారులు వాటిని వెంబడించగా మహారాష్ట్రలోని సిరొంచలో పట్టుకున్నామని అధికారులు వెల్లడించారు. ఈ బియ్యానికి సంబంధించిన కేసులో ఎల్లంకి వీరన్న అనే వ్యాపారితో పాటు డ్రైవర్లను అరెస్ట్ చేశారు పోలీసులు. ఆ తరువాత కూడా కాళేశ్వరం పోలీసులు కూడా అక్రమంగా తరలిపోతున్న బియ్యాన్ని పట్టుకోగా, మంథని ప్రాంతంలో కూడా రేషన్ బియ్యం స్మగ్గింగ్ ను కట్టడి చేశారు. ఆయా ప్రాంతాల నుండి మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరొంచకు చేరుకుంటున్న తెలుగు రాష్ట్రాల బియ్యం గోందియా వరకు రవాణా అవుతున్నాయన్నది ఓపెన్ సీక్రెట్.
తగ్గిన ధర…
ఇటీవల తెలంగాణాలో రేషణ్ బియ్యం పట్టివేత ఘటనలు జరుగుతుండడంతో పాటు పలు చోట్ల కేసులు కూడా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో సిరొంచకు చెందిన వ్యాపారి బియ్యం ధరను కూడా తగ్గించినట్టుగా తెలుస్తోంది. ఇంతకాలం రూ. 20 నుండి 22 రూపాయల వరకు విక్రయించిన ఈ బియ్యాన్ని వరస కేసుల నేపథ్యంలో తక్కువ ధరకు కొంటున్నట్టుగా తెలుస్తోంది. రూ. 18 నుండి 20 రూపాయల వరకు ధరను తగ్గించి రేషన్ బియ్యం సరఫరా చేస్తున్నవారికి డబ్బులు చెల్లిస్తున్నట్టు సమాచారం. తెలంగాణలో వరస కేసుల నేపథ్యంలో వాహనాలు సీజ్ అయ్యాయని, కోర్టులను ఆశ్రయించాల్సి వచ్చిందని, బియ్యం కూడా తిరిగి తమ చేతికి రావని, తనిఖీల్లో బియ్యం తరలిస్తున్న వాహనాలను పట్టుకోకుండా ఉండేందుకు అధికారులకు చెల్లిస్తున్నామని చెప్తూ కిలో బియ్యానికి రూ. 2 వరకు ధర తగ్గించి కొనుగోలు చేస్తున్నట్టుగా సమాచారం. తెలంగాణ అధికారులు బియ్యం దందాపై కన్నెర్ర చేస్తుండడంతో… ఆ నష్టాన్ని తాము ఫులిఫిల్ చేసుకోవల్సిందేనని కుండబద్దలు కొట్టి మరీ వ్యాపారి చెప్తున్నట్టుగా సమాచారం. దీంతో తెలంగాణ అధికారుల పేరిట తెలంగాణ బియ్యం విక్రయించే వారి నెత్తినే టోపీ పెట్టే కార్యక్రమం కూడా ప్రారంభించారని తెలుస్తోంది.