దిశ దశ, కరీంనగర్:
అవినీతికి పాల్పడిన కేసులో ఏకంగా ఓ ఎస్ఐకి జైలు శిక్ష పడింది. 5 ఏళ్ల పాటు కారగార శిక్షతో పాటు రూ. 10 వేల జరిమానా విధిస్తూ కరీంనగర్ ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పు సంచలనంగా మారింది. కేసు వివరాల్లోకి వెల్తే… కామారెడ్డి పట్టణంలోని వివేకానంద కాలనీకి చెందిన ధర్మాగౌడ్ దుబాయిలో డ్రైవర్ గా జీవనం సాగిస్తున్నాడు. డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న ధర్మాగౌడ్ పెద్ద కుమారుడు నరేష్ వీరి ఇంటి సమీపంలోని యువతిని ప్రేమించడంతో ఆమెను తీసుకుని వెళ్లిపోయాడు. దీంతో ఆమె తండ్రి పోలీస్ స్టేషన్ లో కిడ్నాప్ చేశారని ఫిర్యాదు చేయడంతో నరేష్ ను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. దుబాయిలో డ్రైవర్ గా జీవనం సాగిస్తున్న ధర్మాగౌడ్ కు ఈ విషయం అతని భార్య సమాచారం ఇవ్వడంతో స్వస్థలానికి వచ్చాడు. ధర్మాగౌడ్ ను పిలిపించిన కామారెడ్డి ఎస్సై మురళీధర్ ఛార్జిషీట్ లో కేసు వీక్ అయ్యేలా రాస్తానని తనకు రూ. 6 వేలు లంచంగా ఇవ్వాలని అడిగాడు. చివరకు రూ. 5 వేలు ఇవ్వాలని లేనట్టయితే నిన్ను కూడా కేసులో ఇరికించి దుబాయికి వెళ్లకుండా చేస్తానని హెచ్చిరంచాడు. ఎస్సై మురళీధర్ హెచ్చరికలతో జంకిన ధర్మాగౌడ్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. బాధితుని వాంగ్మూలం తీసుకున్న ఏసీబీ అధికారులు ధర్మాగౌడ్ లంచం ఇస్తుండగా ఎస్సై మురళీధర్ ను రెడ్ హైండెడ్ గా పట్టుకున్నారు. కెమికల్ టెస్ట్ తో పాటు పంచుల స్టేట్ మెంట్ రికార్డు చేసిన అనంతరం ఏసీబీ అధికారులు ఎస్సైని కోర్టులో హాజరు పరిచారు. అప్పటి నుండి విచారణలో ఉన్న ఈ కేసు పూర్వాపరాలు పరిశీలించిన కరీంనగర్ ఏసీబీ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఎస్సై మురళీధర్ కు 5 ఏళ్ల జైలు శిక్ష, రూ. 10 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. 2006 మే నెలో జరిగిన ఈ ఘటనపై విచారించిన కరీంనగర్ ఏసీబీ కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. బాధితులు ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా పథకం రచించిన ఏసీబీ అధికారులు ఎస్సై మురళీధర్ వద్దకు పంపించినప్పటికీ ఆయన స్టేషన్ లో డబ్బులు తీసుకోకుండా ధర్మాగౌడ్ ను ఆర్ అండ్ బి గెస్ట్ హౌజ్ కు రావాలని సూచించారు. అక్కడికి చేరుకున్న తరువాత ధర్మాగౌడ్ ఎస్సైకి డబ్బులు ఇవ్వగానే ఎసీబీ డీఎస్పీ నేతృత్వంలో దాడి చేసి పట్టుకున్నారు. అయితే అవినీతి కేసులో ఇరుక్కున్న పోలీసు అధికారికి ఏకంగా 5 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించడం సరికొత్త చర్చకు దారి తీసింది. మరోవైపున ఈ కేసులో తప్పుడు సాక్ష్యం చెప్పినందుకు ఇద్దరికి షోకాజ్ నోటీసులు ఇవ్వాలని కూడా కోర్టు ఆదేశించింది.
Disha Dasha
1884 posts
Prev Post