పతనం అంచు నుండి… కీర్తి పతాకం వైపునకు…

రికార్డ్ క్రియేట్ చేసిన గోలి శ్యామల

దిశ దశ, ఏపీ బ్యూరో:

వ్యాపారం తీరని నష్టాల ఊబిలోకి చేర్చగా… ఆలోచనలు ఆత్మహత్య వైపు సాగుతుండగా… మానసిక పరివర్తన కోసం స్విమ్మింగ్ వైపునకు సాగిన ఆమె రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. ఐదు పదుల వయసు దాటినా లక్ష్య సాధనలో మేటి అని చేతల్లో నిరూపించారు. ఆర్థికంగా కుదేలు అయిన ఆమె జీవితంలో ఎదురీదుతూ… ఈత నేర్చుకుని అబ్బురపరుస్తున్నారు.

సముద్రంలో ఈత…

హైదరాబాద్ లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న ఏపీలోని సామర్లకోటకు చెందిన గోలి శ్యామల వారం రోజుల పాటు సముద్రంలో స్విమ్మింగ్ చేస్తూ 150 కిలోమీటర్లు ప్రయాణించారు. 52 ఏళ్ల వయసులో ఉన్న గోలి శ్యామల తనదైన గత డిసెంబర్ 28న విశాఖపట్నంలోని ఆర్ కె బీచ్ లో స్విమ్మింగ్ మొదలు పెట్టి కాకినాడ తీరానికి 3వ తేదిన చేరుకున్నారు. రోజుకు 30 కిలో మీటర్ల మేర స్విమ్మింగ్ చేస్తూ లక్ష్యం సాధించారు. సముద్రంలో వచ్చే అలలను ధాటిని తట్టుకుంటూ ఈత కొట్టడం అనేది అసాధ్యమని గత ఈతగాళ్లే చెప్తుంటారు. సముద్రంలో వచ్చే అలల ధాటికి గజ ఈతగాళ్లు కూడా ఇబ్బందులు పడిన సందర్బాలు కూడా ఉన్నాయి. అటువంటి ప్రతికూలతను తట్టుకుంటూ గోలి శ్యామల తన లక్ష్యాన్ని చేరుకుని సరికొత్త సంచలనం సృష్టించారు. అయితే సముద్రంలో ఈధుతున్నప్పుడు తాబేళ్లు తన వద్దకు చేరుకున్నప్పుడు కలిగిన ఆనందం మరికొంత దూరం చేరుకున్న తరువాత నిలవేదని ఆవేదన వ్యక్తం చేశారు శ్యామల. కాలుష్యం కోరల్లో చిక్కుకున్న సముద్రం నీళ్లలో చాలా తాబేళ్లు చనిపోయి ఉండడం తనను కలిచి వేసిందన్నారు. మొదటి రోజు కొంత అనారోగ్యానికి గురైనప్పటికీ ఆ తరువాత మాత్రం యథావిధిగా ఈత కొట్టగలిగానని వెల్లడించారు. బోట్లు, స్కూబా డ్రైవర్లు, నిపుణుల పర్యవేక్షణలో 150 కిలోమీటర్ల మేర స్విమ్మింగ్ చేశానని తెలిపారు.

గతంలో…

చాలా కాలంగా స్విమ్మింగ్ చేస్తున్న గోలి శ్యామల గతంలో కూడా అరుదైన రికార్డులు సొంతం చేసుకున్నారు. 47 ఏళ్ల వయసు ఉన్నప్పుడు 2021లో శ్రీలంక నుండి ఇండియా వరకు రామసేతు వరకు స్విమ్ చేస్తూ గమ్యం చేరుకోగా, గత ఏడాది లక్ష్యదీప్ లో 18 గంటల్లో 48 కిలో మీటర్ల దూరం స్విమ్మింగ్ చేశారు. బంగళాఖాతంలో ఈత కొట్టాలని రెండేళ్ల క్రితం లక్ష్యాన్ని నిర్దేశించుకోన్న ఆమె తన కలను సాకారం చేసుకున్నారు.

పతనం అంచుకు చేరి…

హైదరాబాద్ నగరంలో స్థిరపడిన గోలి శ్యామల యానిమేషన్ స్టూడియో ఏర్పాటు చేసుకున్నారు. సీరియళ్లు, సినిమాలకు తన యానిమేషన్ స్టూడియే ద్వారా సేవలందించిన శ్యామల అనూహ్యంగా నష్టాల బారిన పడ్డారు. ఎంచుకున్న వృత్తి జీవితాన్ని అతలాకుతలం చేయడంతో మానసికంగా కుంగిపోయిన ఆమె ఒక దశలో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నారు. అయితే తనలో మొదలైన సూసైడ్ ఆలోచనల నుండి బయటకు వచ్చేందుకు ఈత నేర్చుకోవడం మొదలు పెట్టిన ఆమె ఇప్పుడు సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. డిప్రెషషన్ లోనై ఉన్నప్పుడు జాన్ సిద్దిఖీ అనే కోచ్ శ్యామలకు స్విమ్మింగ్ నేర్పించి ప్రొత్సహించడంతో తనకంటూ ప్రత్యేకతను తెచ్చుకునే స్థాయికి చేరుకున్నారు. వాతావరణం అనుకూలించకపోవడంతో రెండు సార్లు వాయిదా వేసుకున్న పర్యటనను వాయిదా వేసుకున్న ఆమె గత డిసెంబర్ 28న మూడో ప్రయత్నంలో సఫలం అయ్యారు.

You cannot copy content of this page