40 రోజుల్లో 65 మంది మావోయిస్టుల ఎన్ కౌంటర్…

దండకారణ్యంలో రక్తపుటేరులు…

పిట్టల్లా రాలిపోతున్న సాయుధులు…

దిశ దశ, దండకారణ్యం:

దండకారణ్యంలో మావోయిస్టులపై బలగాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. ఎదురు కాల్పుల ఘటనల్లో పిట్టల్లా రాలిపోతున్నారు విప్లవకారులు. సాయుధ పోరును సమూలంగా అణిచివేయాలన్న సంకల్పంతో ముందుకు సాగుతుండడంతో పచ్చని కీకారణ్యాల్లో రక్తపుటేరులు ప్రవహిస్తున్నట్టుగా మారింది. ఎక్కడ పుట్టిన బిడ్డలో… యాడ పెరిగిన వారో కానీ బస్తర్ అటవీ ప్రాంతంలో ప్రాణాలు కోల్పోతున్న తీరు ఆందోళన కల్గిస్తోంది. సమాంతర ప్రభుత్వం నడుపుతున్న మావోయిస్టులు ఇప్పుడు స్వీయ రక్షణ చర్యలపై దృష్టి సారించాల్సిన పరిస్థితి ఏర్పడింది. శత్రు దుర్భేధ్యంగా ఉన్నాయని భావించిన అడవుల్లోనే నక్సల్స్ ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. 40 రోజుల్లో దండకారణ్యంలో జరిగిన వివిధ ఎన్ కౌంటర్లలో 65 మంది మావోయిస్టులు మరణించారు. తాజాగా బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ ఏరియా ఫారెస్ట్, ఫర్సెగఢ్-మద్దెడ్ వద్ద జరిగిన ఈ ఎన్ కౌంటర్ లో 11 మంది మహిళలతో పాటు 31 మంది మృత్యువు ఒడిలో ఒదిగిపోయారు. ఈ ఘటనలో వెస్ట్ బస్తర్ డివిజన్ DVCM హంగా కర్మ, PPCM 11 ప్లాటూన్ కమాండర్ మంగూ హేమ్లా, నేషనల్ పార్క్ ఏరియా కమిటీ, గంగుళూరు ఏరియా కమిటీ ACMలు సుభాష్ ఓయం, సన్నూ, నేషనల్ పార్క్ ఏరియా కమిటీ సభ్యుడు రమేష్ లను గుర్తించామని మిగతా వారిని గుర్తించాల్సి ఉందని బస్తర్ ఐజీ సుందర్ రాజ్ పి మీడియాకు వెల్లడించారు. ఘటనా స్థలం నుండి AK47 1, 3 మ్యాగజైన్‌లు, 56 నంబర్ కాట్రిడ్జ్‌లు, SLR రైఫిల్ 1, 2 మ్యాగజైన్‌లు, 6 కాట్రిడ్జ్‌లు, ఇన్సాస్ రైఫిల్ 1, 303 రైఫిల్ 1, మ్యాగజైన్, 2 కాట్రిడ్జ్‌లు, 315 బోర్ రైఫిల్, 30 కాట్రిడ్జ్‌లు, 12 బోర్ గన్స్ 8, BGL రాకెట్ లాంచర్ 1, బిగ్ స్టాండ్, 4 BGL సెల్స్, 6 BGL లాంచర్, 14 SAIL, 4 మజిల్ లోడింగ్ రైఫిల్స్, మందుపాతరలు, లేజర్ ప్రింటర్ తో పాటు విప్లవ సాహిత్యం, మావోయిస్టుల యూనిఫాం, నిత్యవసరాలను స్వాధీనం చేసుకున్నారు. DRG, STF, CoBRA, CRPF, BSF, ITBP, CAF బలగాలు ఈ ఆఫరేషన్ లో భాగస్వాములు అయ్యాయని పోలీసు అధికారులు వెల్లడించారు.

బండి, అడెల్లు అక్కడే..!

పర్సేగడ్, మద్దేడ్ సమీపంలోని నేషనల్ పార్క్ ఫారెస్ట్ లో మావోయిస్టు పార్టీ కీలక సమావేశం ఏర్పాటు చేసుకుందన్న సమాచారం మేరకు కూంబింగ్ చేపట్టామని బీజాపూర్ ఎస్పీ డాక్టర్ జితేంద్ర కుమార్ యాదవ్ వివరించారు. TSC SZCM బండి ప్రకాష్, మరో నేత అడెల్లు అలియాస్ భాస్కర్, ఏరియా కమిటీకి చెందిన SCMA బుచ్చన్న, ACM కృష్ణ, ACM అజిత్‌తో పాటు 40 నుండి 45 మంది సాయుధ మావోయిస్టులు సమావేశం అవుతున్నారన్న సమాచారం అందిందని తెలిపారు. ఈ మేరకు బలగాలు సెర్చింగ్ ఆపరేషన్ చేపట్టడంతో ఎధురు కాల్పులు చోటు చేసుకున్నాయిన వివరించారు. 3 నుండి 4 గంటల వ్యవధిలో పలు మార్లు ఎదురు కాల్పులు జరిగాయిన్నారు. ఎన్ కౌంటర్ ప్రారంభం కావడంతో అక్కడి నుండి ముఖ్య నేతలు వెల్లిపోయి ఉంటారని బస్తర్ పోలీసు అధికారులు అనుమానిస్తున్నారు.

You cannot copy content of this page