ప్రభుత్వం మహిళల గురించి ఎన్ని చట్టాలు తీసుకు వస్తున్నప్పటికీ రోజురోజుకు అత్యాచారాలు పెరుగుతున్నాయే కానీ తగ్గడం లేదు. మహిళలు ఒంటరిగా కనిపిస్తే చాలు మగాళ్లు మృగాళ్లుగా మారి వారి కామవాంఛ తీర్చుకుంటున్నారు. ఇలా బయటనే కాదు.. ఇంట్లోనూ ఆడవారికి రక్షణ లేకుండా పోయింది. సొంత వారే కామాంధులై కాటేస్తున్నారు. అదేవిధంగా సంవత్సరం క్రితం తన మేనకోడలకు మత్తుమందు ఇచ్చి మరీ అత్యాచారం చేసిన మేనమామకు తాజాగా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. కేరళ రాష్ట్రంలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
మైనర్ మేనకోడలను అత్యాచారం చేసిన కేసులో కేరళ కోర్టు నిందితుడికి ఏకంగా 66 ఏళ్లు జైలు శిక్ష విధించింది. ఈ ఘటనపై ఇడుక్కి ఫాస్ట్ ట్రాక్ కోర్డులో విచారణ జరగగా.. జస్టిస్ టీజీ ఈ విధంగా తీర్పు ఇచ్చారు. IPC, POCSO చట్టం కింద దోషులకు వేర్వేరుగా 66 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది కోర్ట్. శిక్షలు ఏకకాలంలో అమలులో ఉంటాయని.. కాబట్టి అతను 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ షిజో మోన్ జోసెఫ్ తెలిపారు. శిక్షతో పాటు నిందుతుడికి రూ.80 వేలు జరిమానా కూడా కోర్టు విధించింది. అలాగే బాధితురాలికి పునరావాసం కోసం రూ.50 వేలు చెల్లించాలని జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీని కోర్టు ఆదేశించింది. 2021లో జరిగిన ఈ ఘటనలో బాధితురాలికి స్వయాన మేనమామే ఆమెకు మత్తుమందు ఇవ్వడంతో అపస్మారక స్థితికి చేరుకున్నాక అత్యాచారానికి పాల్పడ్డాడని ప్రాసిక్యూటర్ తెలిపారు.