కరోనా మహమ్మారి సమయంలో ఉద్యోగులంతా ‘వర్క్ ఫ్రమ్ హోం’ వైపు ఆసక్తి చూపారు. అలాగే విద్యార్థులు ఇంట్లో ఉండే ఆన్‌లైన్‌లో పాఠాలు వింటున్నారు. దీంతో పర్సనల్ కంప్యూటర్లకు గిరాకీ భారీగా పెరిగింది. దీనికి అనుగుణంగానే కంప్యూటర్ తయారీ కంపెనీలు ఉత్పత్తిని పెంచాయి. భారీ ఎత్తున ఉద్యోగులను నియమించుకున్నాయి. కానీ, కరోనా సంక్షోభం ముగియడంతో పరిస్థితులు పూర్తిగా తలకిందులయ్యాయి. ప్రస్తుతం కంప్యూటర్ల తయారీ కంపెనీలు సైతం వ్యయ నియంత్రణ చర్యలకు దిగాయి. ఇందులో భాగంగా కంపెనీలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి.
తాజాగా డెల్(Dell) టెక్నాలజీస్ 6,650 మందిని ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. ఇది కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్యలో ఐదు శాతానికి సమానమని తెలిపారు. ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కంపెనీ ‘కో-చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్’ జెఫ్ క్లార్క్ వెల్లడించారు. డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో పీసీల విక్రయాలు గణనీయంగా పడిపోయినట్లు ప్రముఖ మార్కెట్ ఇంటెలిజెన్స్ సంస్థ ఐడీసీ తెలిపింది.
డెల్ విక్రయాలు వార్షిక ప్రాతిపదికన దాదాపు 37 శాతం పడిపోయినట్లు వెల్లడించింది. కంపెనీ ఆదాయంలో 55 శాతం పీసీల నుంచే వస్తోంది. డెల్ కంటే ముందు ఇతర పీసీ తయారీ కంపెనీలు సైతం తమ ఉద్యోగుల్ని తగ్గించుకున్నాయి. హెచ్‌పీ గత నవంబరులో 6,000 మందిని ఉద్యోగులను తొలగించింది. సిస్కో సిస్టమ్స్ 4,000 మందికి ఉద్వాసన పలికింది. 2022లో ఇప్పటివరకు టెక్ రంగంలో 97,171 మంది ఉద్యోగాలు కోల్పోయినట్లు ఇటీవల కన్సల్టెన్సీ సంస్థ ఛాలెంజర్ తెలిపింది. గతేడాదితో పోలిస్తే ఉద్యోగ కోతలు 649 శాతం పెరిగినట్లు పేర్కొంది.