దిశ దశ, హైదరాబాద్:
నాడు నిజాం విముక్తి కోసం పోరుబాట పట్టిన ఆ యోధుడి భార్య తన స్తిరాస్థి కోసం పోరు చేయాల్సి వస్తోంది. తనకు చెందిన ఆస్తికి నకిలీ డాక్యూమెంట్లతో తన కడుపున పుట్టిన బిడ్డే ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆరోపిస్తోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ వేసి జరిగిన అన్యాయాన్ని సమాజానికి తెలియజేసే ప్రయత్నం చేసిన ఎనిమిది పదుల వయసు దాటిన ఆ బామ్మ ఇప్పుడు ప్రజా భవన్ తలుపు కూడా తట్టింది. అవసాన దశకు చేరుకున్న తనకు న్యాయం చేయాలని, తప్పుడు పత్రాలు సృష్టించి కోర్టును ఆశ్రయించిన ఘటనపై విచారణ చేయాలని వేడుకుంటోంది. బాధితురాలి చీటి శ్యామల(82) కథనం ప్రకారం… స్వాతంత్ర్య సమరయోధుడు చీటి మురళీ ధర్ రావు భార్య శ్యామలకు పుట్టినింటి నుండి భరణంగా వచ్చిన ఆస్థి ద్వారా విద్యానగర్ ఇంటిని నిర్మించుకున్నారు. మురళీధర్ రావు పేరిటనే అనుమతి తీసుకుని నిర్మాణం జరిపిన ఈ ఇంటికి సంబంధించిన నకిలీ డాక్యూమెంట్లను కరీంనగర్ మునిసిపాలిటీ నుండి పెద్ద కుమారుడు చీటి శ్రీరామారావు సేకరించి కోర్టును ఆశ్రయించాడు. అంతేకాకుండా తన ఇంటితో పాటు ఆడపడుచు అమృతమ్మ పేరిట కూడా ఇంటిని నిర్మించుకున్నామని, ఈ ఇంటి రికార్డులు కూడా తప్పుడు పత్రాలు సమర్పించి మార్చారని శ్యామల ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారానికి బాధ్యులైన మునిసిపల్ అధికార యంత్రాంగంతో పాటు కొడుకుపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని ప్రజా భవన్ లో దరఖాస్తు చేసుకున్నారు. తనకు జరిగిన అన్యాయం పరిష్కరించాలని మానవహక్కుల కమిషన్ ను కూడా ఆశ్రయించినప్పటికీ ఫలితం రాలేదని, గత ప్రభుత్వానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి కారణంగానే మునిసిపాలిటీలో తప్పుడు పత్రాలు తయారయ్యాయని కూడా ఆమె ఆరోపించారు.