ఈయన ఇప్పటికి ఎన్నిసార్లు ఓటేశారో తెలుసా..?

స్వాతంత్ర్యానంతరం జరిగిన తొలి ఎన్నికలనుండి ఇప్పటి వరకు ఆయన ఓట్లు వేస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు ఆయన 34 సార్లు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల పోలింగ్ లో పాల్గొని తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇంతకీ ఎవరాయన..? ఎక్కడుంటారు అని అనుకుంటున్నారా…? ఓటేయాల్సిన పని నాకేంటని కొందరు, ప్రస్తుత రాజకీయాలను చూస్తే ఓటు జోలికి వెల్లమని చెప్పే మరికొందరు ఐక్యంగా ఓటేసి పరిస్థితుల్లో మార్పు తీసుకవచ్చేందుకు ప్రయత్నించడానికి మాత్రం విముఖత చూపుతున్నారు. కానీ ఈ శతాధిక వృద్దుడు మాత్రం తన ఓటు హక్కును వినియోగించుకోవడంలో తనకు తానే సాటి అని చేతల్లో నిరూపించుకుంటున్నారు. ఈ నెల 12న హిమాచల్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో 106 ఏళ్ల ఈయన తన ఓటు హక్కు వినియోగించుకుని అరుదైన రికార్డు సాధించారు. వయో భారంతో ఉన్న వృద్దుల కోసం ఎన్నికల కమిషన్ పోస్టల్ బ్యాలెట్ విధానాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల అదికారులు పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటీని అక్కడి సీనియర్ సిటిజన్లకు కల్పించారు. కిన్నౌర్ జిల్లాకు చెందిన 106 ఏళ్ల శ్యామ్ శరణ్ నేగికి రెడ్ కార్పెట్ పరిచి మరీ అక్కడి ఎన్నికల అధికారులు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించారు. 1951లో జరిగిన తొలి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న శ్యామ్ శరన్ నేగి తన ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు కిన్నౌర్ డిప్యూటీ కమిషనర్ అబిద్ హుస్సేన్ తెలిపారు. నేగి పోలింగ్ స్టేషన్ కు వచ్చి ఓటు వేసేందుకు ఆసక్తి చూపెట్టినా అనారోగ్యం కారణంగా పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకున్నారని చెప్పారు. తన తండ్రి 1951లో ఓటు వేసి మొదటి ఓటరు అయ్యారని నేగి చిన్న కుమారుడు చందన్ ప్రకాష్ తెలిపారు.

You cannot copy content of this page