సొంత ఊరిని వీడలేక… కడుపున పుట్టిన బిడ్డల దరికి చేరలేక…

చితి పేర్చుకుని ఆత్మహత్య చేసుకున్న

దిశ దశ, హుస్నాబాద్:

పుట్టిన ఊరితో పెంచుకున్న అనుభందాలను దూరం చేసుకోలేక… అనుభందం పెనవేసుకున్న బిడ్డల ఇండ్ల చుట్టూ తిరగలేక మానసిక క్షోభకు గురైన ఓ తండ్రి పడ్డ వేదన ఎంతో అతని స్వీయ సజీవ దహానం సాక్ష్యంగా నిలుస్తోంది. తొమ్మిది పదుల వయసుకు చేరిన ఆ తండ్రి శరీరం వణుకుతున్నా పట్టు తప్పలేదు, కానీ తనయుల వద్ద వంతుల వారిగా జీవించాలన్న ప్రతిపాదనే బలవన్మరణం వైపు తీసుకెళ్లింది. గాలిస్తో ఎగిరిపోయే పండుటాకును మరిపిస్తున్న తన జీవితం తనకిక చాలనుకున్నాడో లేక పుట్టిపెరిగిన ఊరిపై మమకారాన్ని తెంచుకోలేకపోయాడో ఏమో కానీ తనువు చాలించడమే మేలనుకుని తన చితిని తానే పేర్చుకుని మృత్యువు ఒడిలో చేరిపోయాడు. కడుపున పుట్టిన బిడ్డలు తమ ఆలనా పాలనా చూసుకోలేకపోతున్నారన్న బాధ కన్నా అతడిని పొరుగురిలో ఉన్న మరో కొడుకు వద్దకు వెళ్లాలన్న నిర్ణయం మానసిక క్షోభకు గురైనట్టుగా అర్థమవుతోంది.

ఎవరిదీ వ్యథ… ఎక్కడ జరిగిందీ కథ…?

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ సమీపంలోని పొట్లపల్లి గ్రామానికి చెందిన మెడబోయిన వెంకటయ్య (90)కు నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఇద్దరు కొడుకులు పొట్లపల్లిలోనే జీవనం సాగిస్తుండగా ఓ కొడుకు హుస్నాబాద్ లో, మరో కొడుకు కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం నవాబుపేటలో జీవనం సాగిస్తున్నాడు. కొంతకాలం తన జీవిత భాగస్వామి కానరాని లోకాలకు చేరుకోవడంతో వెంకటయ్య పొట్లపల్లిలోనే ఉంటూ కాలం వెల్లదీస్తున్నాడు. తనకున్న 4 ఎకరాల భూమిని తన వారసులకు పంచి ఇచ్చిన వెంకటయ్య సర్కారు ఇచ్చే ఆసరా పెన్షన్ పొందుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇంతకాలం తన పెద్ద కొడుకు వద్దనే ఉన్న వెంకటయ్యను పోషించే విషయంలో ఐదు నెలల క్రితం పొరపొచ్చాలు వచ్చాయి. దీంతో అప్పుడు గ్రామంలోని పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ జరగగా నెలకు ఒకరి చొప్పున ఒక్కో కుమారుడు వెంకటయ్యను వంతుల వారిగా పెంచి పోషించాలని తీర్పునిచ్చారు. తాజాగా పొట్లపల్లిలోని కొడుకు వంతు పూర్తి కావడంతో చిగురుమామిడి మండలం నవాబుపేటకు చెందిన మరో కొడుకు వద్దకు వెల్లి నెల రోజులు జీవించాల్సి ఉంది. సొంత ఊరును, ఇంటిని వదిలి తానెక్కడికి వెళ్లనని తరుచూ గ్రామస్థులతో చెప్పుకుంటుండేవాడు వెంకటయ్య. పొరుగూరికి వెల్లి ఉండడాన్ని జీర్ణించుకోలేకపోయిన ఆయన తీవ్ర మానసిక క్షోభకు గురయ్యాడు. తరుచూ మనో వేదనకు గురవుతున్న వెంకటయ్య మాటలను గమనించిన స్థానికులు కూడా ఆయనలోనే మార్పు వస్తుందని భావించారు. అయితే ఈ నెల 2వ తేది రాత్రి గ్రామానికి చెందిన ఓ పెద్దమనిషికి ఇంటికి వెల్లి తనగోడు వెల్లబోసుకున్నాడు. మరు నాడు ఉదయం నవాబుపేటలోని తన మరో కొడుకు వద్దకు వెల్తున్నాని చెప్పి వెల్లిన వెంకటయ్య సాయంత్రం వరకూ జాడ లేకుండా పోయాడు. తండ్రి ఆచూకి దొరకకపోవడంతో కలవరపడ్డ తనయులు అతని కోసం పొట్లపల్లి, నవాబుపేట పరిసర ప్రాంతాల్లో గాలించినా లాభం లేకుండా పోయింది. గురువారం మద్యాహ్నం పొట్లపల్లి శివార్లలోని ఎల్లమ్మ గుట్ట వద్ద కాలిపోయిన శవం ఉందన్న సమాచారం అందుకున్న గ్రామస్థులు హుటాహుటిన అక్కడకు చేరుకుని పరిశీలించి ఆ మృతదేహం వెంకటయ్యదేనని గుర్తించారు.

చితిని సిద్దం చేసుకుని…

తీవ్ర మానసిక క్షోభకు గురైన వెంకటయ్య ఎల్లమ్మగుట్ట వద్దకు చేరుకుని తాటి కమ్మలను రాశిగా పోసి వాటికి నిప్పంటించి అందులో దూకి చనిపోయినట్టుగా పోలీసులు ప్రాథమికంగా నిర్దారించారు. సొంత ఊరిని వీడలేక, కొడుకుల వద్ద వంతుల వారిగా ఉండేందుకు మనసొప్పక మనోవేదనకు గురైన వెంకటయ్య తన చితిని తానే పేర్చుకుని చనిపోయాడని భావిస్తున్నారు. తన మనసులో పడుతున్న బాధకన్నా మంటల్లో కాలి సజీవ దహనం అవుతున్నప్పుడు కూడా అతనికి బాధ అనిపించేలేదోమో అంటూ స్థానికులు కన్నీటి పర్యంతం అయ్యారు. తొంభై ఏళ్ల వయసుకు చేరిన ఆ పెద్దాయన మనసును తొలిచి వేసిన అసలు కారణం ఏదైనా స్వీయ సజీవ దహనం చేసుకున్న తీరు మాత్రం ప్రతి ఒక్కరిని కంటతడిపెట్టిస్తోంది.

You cannot copy content of this page