దక్షిణ దావణగెరెలో 92 ఏళ్ల శివశంకరప్ప విజయం


దిశ దశ, స్పెషల్ కరస్పాండెంట్:

కర్ణాటక ఎన్నికల్లో ఆ కురువృద్దుడు విజయబావుటా ఎగురవేసి కమలనాథులను కలవరపెట్టాడు. మరో ఎనిమిదేళ్లలో సెంచరీ కొట్టనున్న ఆయన మరోసారి గెలిచి సంచలనం సృష్టించారు. వరసగా నాలుగు సార్లు దక్షిణ దావణగెరె నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిచిన ఆయన వయసు కూడా దేశంలోని ప్రజా ప్రతినిధుల్లోనే అతి ఎక్కువ వయసున్న నేతల్లో ఒకరై ఉంటారు. 92 ఏళ్ల ప్రాయంలో కర్ణాటక చట్ట సభలోకి నాలుగోసారి అడుగుపెడుతున్నారు శామనూరు శివశంకరప్ప. 1930లో జన్మించిన శివశంకరప్ప మూడు దశాబ్దాలుగా కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ట్రెజరర్ గా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆల్ ఇండియా వీర శైవ మహాసభ జాతీయ అధ్యక్షులుగా కూడా పని చేస్తున్న ఆయన విద్యా సంస్థల అధిపతిగా పారిశ్రామిక వేత్తగా స్థిరపడ్డారు. ఆయన తనయుడు ఎస్ ఎస్ మల్లిఖార్జున్ దావణగెరె నార్త్ నుండి చట్ట సభకు ప్రాతినిథ్యం వహించి ఓ సారి రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా కూడా పని చేశారు. కర్ణాటక రాష్ట్రంలోనే కురువృద్దుడిగా బరిలో నిలిచిన శివశంకరప్ప 92 ఏళ్ల వయసులో గెలవడం అనేది అత్యంత అరుదైన రికార్డు. బహుశ భారతదేశ చరిత్రంలోనే 90 ఏళ్ల వయసులోనూ ప్రత్యక్ష్య రాజకీయాల్లో ఉన్న అతి కొద్దిమంది నాయకుల సరసన శివశంకరప్ప నిలుస్తారు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టుగా దావణగెరె దక్షిణ నియోజకవర్గ ప్రజలు కూడా బీజేపీ అభ్యర్థిని కాదని ఆయనకు మద్దతు ఇవ్వడం గమనార్హం.

You cannot copy content of this page