దిశ దశ, మానకొండూరు:
కరీంనగర్ సమీపాల్లో నివసిస్తున్న వారిని వన్య ప్రాణుల భయం వెంటాడుతూనే ఉంది. ఎదో ఒక చోట వన్య ప్రాణుల ఉనికి వెలుగులోకి వస్తుండడంతో ప్రజలకు ఆందోళనతో కాలం వెల్లదీస్తున్నారు. ఇటీవల కరీంనగర్ శివార్ల నుండి రేకుర్తి వరకు సంచరించిన భల్లూకాన్ని అటవీ అధికారులు పట్టుకుని సురక్షిత ప్రాంతానికి తరలించిన సంగతి తెలిసిందే. రెండు మూడు రోజులుగా పులి చారికలు ఉండే జాతికి చెందిన జంతువు ఒకటి కరీంనగర్ శివార్లలో సంచరించింది. దీంతో అది చిరుత పులి అంటూ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో అటవీ శాఖ అధికారులు వెంటనే రంగంలోకి దిగి చిరుత పులి కాదని, వచ్చి పోయే ప్రాంతాల్లో దానికి ఉనికి ఖచ్చితంగా తెలుస్తుందని చెప్పారు. అటవీ శాఖ అధికారుల ప్రకటనతో కుదుట పడుతున్న కరీంనగర్ సమీప ప్రాంతాల వాసులను ఎలుగుబంటి భయం మొదలైంది. మంగళవారం తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో మానకొండూరు మండలకేంద్రంలోని హనుమాన్ టెంపుల్ వద్ద ఓ ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించిన భల్లూకాన్ని శునకాలు తరిమేశాయి. దీంతో అక్కడి నుండి తచ్చాడుకుంటూ వెల్లిన ఎలుగుబంటి చివరకు జాతీయ రహదారిపైకి చేరింది. ఈ రహదారిపై వాహనాల రాకపోకలతో అయోమయానికి గురైన ఎలుగుబంటి ఓ చెట్టు ఎక్కి కూర్చుంది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద సంఖ్యలో ఎలుగుబంటిని చూసేందుకు తరలివచ్చారు. అటవీ శాఖ అధికారులకు కూడా సమాచారం ఇవ్వడంతో వారు కూడా రంగంలోకి దిగి దానిని సురక్షిత ప్రాంతానికి తరలించే చర్యలకు శ్రీకారం చుట్టనున్నారు.