ఆ యోధుడి కుటుంబం దూరమైనట్టేనా..?

ఏడు దశాబ్దాల చరితకు బ్రేకులేనా..?

దిశ దశ, కరీంనగర్:

స్వాతంత్ర్య పోరాటం నుండి తనదైన ముద్ర వేసుకున్న ఆ నేత వారసత్వ రాజకీయాలకు ఇక తెరపడినట్టేనని స్పష్టం అవుతోంది. తెలంగాణ రాజకీయాల్లో అనూహ్యంగా ఆయన వారుసుడు కూడా రాజకీయాలకు దూరం కావల్సి వచ్చింది. అయితే ఆ నేత కుటుంబం ఎన్నికల్లో నిలబడే అవకాశం లేకుండా పోయినా ఆ ఇంటి పేరుతో ఉన్న మిగతా వారు మాత్రం రాజకీయాల్లో తమ భవిష్యతును పరీక్షించుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.

అధ్యాయం ముగిసినట్టేనా..?

తెలంగాణ రాజకీయాల్లో కమ్యూనిస్టు యోధుడిగా ఉన్న చెన్నమనేని రాజేశ్వర్ రావు 1957 నుండి ప్రత్యక్ష్య రాజకీయాల్లో ఉన్నారు. ఆయన రాజకీయాల నుండి తప్పుకున్న తరువాత 2009 నుండి తనయుడు చెన్నమనేని రమేష్ బాబు ఎన్నికల సంగ్రామంలో కొనసాగారు. అయితే తాజాగా అధికార బీఆర్ఎస్ పార్లీ రమేష్ బాబుకు టికెట్ ఇవ్వకపోవడంతో రాజేశ్వర్ రావు కుటుంబం తెరమరుగైనట్టేనని భావిస్తున్నారు. రమేష్ బాబు పౌరసత్వ వివాదం కారణంగా ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయలేకపోయాని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంతో ఇక రాజేశ్వర్ రావు ఫ్యామిలీ ప్రత్యక్ష్య రాజకీయాలకు దూరమైనట్టేనన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నారు. 70 ఏళ్లుగా తండ్రి తనయులు చట్ట సభల ఎన్నికల్లో పాల్గొనగా ఈ సారి మాత్రం ఆ అవకాశం లేకుండా పోయింది.

రంగంలో చెన్నమనేని బ్రదర్స్…

అయితే రాజేశ్వర్ రావు కుటుంబం రాజకీయాలకు దూరం అయిన పరిస్థితులు కనిపిస్తున్నప్పటికీ చెన్నమనేని బ్రదర్స్ వారసులు మాత్రం ఇంకా పోటీలో ఉన్నట్టుగానే కనిపిస్తోంది. మాజీ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు తనయుడు డాక్టర్ వికాస్ రావు బీజేపీ టికెట్ ఆశిస్తున్నారు. వేములవాడలో పోటీ చేయాలన్న సంకల్పంతో గత కొంతకాలంగా ఇక్కడి ప్రజలతో మమేకమై తిరుగుతూ… సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బీజేపీ టికెట్ ఆయనకు ఇచ్చినట్టయితే విద్యాసాగర్ రావు వారసుడు కదనరంగంలోకి దూకే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ తరుపున మూడు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఎంపీగా గెలిచిన సాగర్ జీ రాష్ట్ర అధ్యక్షునిగా, కేంద్ర మంత్రిగా, గవర్నర్ గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రత్యక్ష్య రాజకీయాల నుండి దాదాపుగా వైదొలిగినందున బీజేపీ టికెట్ తన తనయుడు వికాస్ రావుకు ఇవ్వాలని అడుగుతున్నట్టు సమాచారం. మరో వైపున చెన్నమనేని వెంకటేశ్వర్ రావు తనయుడు, కొనరావుపేట మాజీ జడ్పీటీసీ సభ్యుడు శ్రీకుమార్ కూడా వేములవాడ నుండి టికెట్ ఆశిస్తున్నారు. అయితే ఆయన బీఎస్పీ నుండి బరిలో నిలిచేందుకు పావులు కదుపుతున్నట్టుగా తెలుస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వివిధ వర్గాలతో ఎక్కువగా టచ్ లో ఉండే శ్రీకుమార్ బీఎస్పీ నుండి టికెట్ దక్కినట్టయితే గెలుస్తానన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ సారి ఎన్నికల్లో చెన్నమనేని తొలితరం వారు కాకుండా వారి వారసులు బరిలో నిలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.

You cannot copy content of this page