దిశ దశ, జాతీయం:
పూర్వ కాలంలో చేపట్టిన నిర్మాణాల వెనక ఎంతో నిగూఢత దాగి ఉంటుంది. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా కన్సట్రక్షన్స్ జరిపే వారు. సమాచార వ్యవస్థ… సాంకేతికత అందుబాటులో లేకున్నప్పటికీ పరిపాలన చేసే రాజులు, రాణులు మాత్రం తమ మార్క్ శాశ్వతంగా ఉండే విధంగా చొరవ తీసుకునేవారు. ఇందుకు తగ్గట్టుగానే వివిధ వృత్తులపై ఆధారపడి జీవనం సాగించే వారు కూడా తమలోని నైపుణ్యతను ప్రదర్శించేవారు. శతాబ్దాల క్రితం నిర్మించిన ఆ భవనాలు నేటికి చెక్కు చెదరకపోవడం ఒక ఎత్తైతే ఆయా భవనాల నిర్మాణం కోసం ఎంచుకున్న స్థలాలు కూడా అంచనాలకు అందకుండా ఉంటాయి. ఇలాంటి కోవలోకే వస్తుంది మాండవ్ ఘాట్ (మాండూ)లో నిర్మించిన ఇకో పాయింట్. అర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు దీనికి ఇకో పాయింట్ అని నామకరణం చేశారని ఇక్కడ ఏర్పాటు చేసిన శిలాఫలకం స్పష్టం చేస్తోంది. 8వ శతాబ్దం క్రితం నుండి మాండవ్ ఘాట్ ఏరియాలో జైనులు పరిపాలించినట్టుగా పరిశోధకులు తేల్చారు. ఈ ప్రాంతాన్ని పరిపాలించిన వారిలో రాణి రూపవతి కూడా ఒకరు. 11వ శతాబ్దంలో రాణి రూపవతి ఈ ప్రాంతాన్ని పరిపాలించగా ఆమె హయాంలో నిర్మించిన పలు నిర్మాణాలు అందరిని ఆశ్యర్యపరుస్తున్నాయి. రాణి రూపవతి పెవిలియన్ కు వెల్లే మార్గ మధ్యలో నిర్మించిన ఓ భవనం పర్యాటకులను ఆకర్షిస్తోంది. చుట్టూ ఫెన్షింగ్ వేసి ఉన్న ఈ భవనం దాదాపు ఎకరం విస్తీర్ణంలో నిర్మించి ఉంటారని అంచనా కాగా… దీని కోసం సుమారు 10 ఎకరాల వరకూ స్థలం ఉంటుందని భావిస్తున్నారు. మధ్యలో నిర్మించిన ఈ భవనం చుట్టూ పెన్సింగ్ సమీపంలో ఓ పాయింట్ ఏర్పాటు చేయబడి ఉంది. అక్కడ నిలబడి గట్టిగా అరిచినట్టయితే మూడు సార్లు సౌండ్ రిపిట్ అవుతోంది. రీ సౌండ్ వినిపిస్తోందన్న విషయాన్ని అప్పటి వృత్తి కళాకారులు గుర్తించి అక్కడ ఈ భవనం నిర్మించేందుకు ప్రతిపాదన చేసి ఉంటారని భావిస్తున్నారు. ఈ భవనానికి ఓ వైపున రహదారి ఉండగా మూడు వైపులు కీకారణ్యాలు, గుట్టలు విస్తరించి ఉన్నాయి. ఈ ఇకో పాయింట్ వద్ద నిలబడి అరిచేందుకు ఇక్కడకు వచ్చే పర్యాటకులు ఆసక్తి చూపుతుంటారు. అయితే ఈ భవనం కేవలం రీ సౌండ్ వస్తోందని టూరిస్టులను ఆకట్టుకునేందుకు నిర్మించారా అన్న చర్చ కూడా వచ్చింది. అయితే 11 శతాబ్దంలో పర్యాటకులు టూర్లు చేయడం అత్యంత అరుదుగానే జరిగేది. అంతర్జాతీయ టూరిస్టులు, రాచరిక కుటుంబాలకు చెందిన వారు తప్ప ఇతరులు మాత్రం టూర్లకు వెల్లేందుకు అంతగా ఇష్టపడేవారు కాదు. ఆధ్యాత్మిక చింతనతో పర్యటనలు కాలి నడకన మైళ్లకు మైళ్లు నడిచే వారు కానీ ఇకో పాయింట్లను సందర్శించేందుకు మాత్రం ఆసక్తి చూపేవారు కాదన్నది నిజం. కానీ అప్పుడు ఈ భవనం ఎందుకు నిర్మించారో తెలిస్తే ఔరా అనక మానరు.
కారణం ఇదే…
ఇకో పాయింట్ వద్ద ఉన్న ఈ భవనంలో వైద్య సేవలందించేందుకు నియమించిన యంత్రాంగం ఉండేదని చరిత్ర చెబుతోంది. ఈ ప్రాంతంలో అనారోగ్యానికి గురైన వారు కానీ, డెలివరీ అయ్యే సమయంలో పురిటి నొప్పులతో బాధపడుతున్న వారికి కానీ చికిత్స అందించేందుకు యంత్రాంగాన్ని నియమించేవారు. ఎక్కువగా డెలివరీలకే ఆ కాలంలో ప్రాధాన్యత ఇచ్చేవారని తెలుస్తోంది. ఈ క్రమంలో మాండవ్ ఘాట్ లోని ఇకో పాయింట్ బిల్డింగులో మంత్రసానులతో పాటు వారి అసిస్టెంట్లు ఉండేవారని స్థానికులు చెప్తున్నారు. ఇక్కడ నివసించే వారికి వీరి సేవలు అవసరం అయినప్పడు ఇకో పాయింట్ వద్దకు వచ్చి అరవగానే మూడు సార్లు రీ సౌండ్ వచ్చేది. దీంతో ఆ భవనంలో ఉన్న వైద్య సేవలందిచే సిబ్బంది అప్రమత్తమయ్యేవారు. బాధితులకు కావల్సిన వైద్యం అందించేందుకు హుటాహుటిన బయలుదేరే వారని వివరించారు. రీ సౌండ్ వస్తున్నందున ఈ భవనంలో అత్యవసర సేవలందించే మెడికల్ ఎయిడ్ అందించే యంత్రాంగాన్ని ఉంచడమే సముచితమని అప్పటి రాజులు భావించి వారికి ఈ భవనాన్ని కెటాయించారు. సమాచారాన్ని చేరవేసేందుకు అప్పుడు ప్రత్యక్ష్యంగా వెళ్లడం తప్ప మరో గత్యంతరం లేని పరిస్థితి. ఆ పరిస్థితుల్లో వైద్య సేవలు అందించేందుకు ఇకో పాయింట్ ప్రాంతంలో భవనం నిర్మించినట్టయితే సత్వర సేలవలందించే అవకాశం ఉంటుందని అప్పటి వారు యోచించారంటే వారి దూరదృష్టి ఎంతటితో అర్థం చేసుకోవచ్చు.