బైపాస్ రోడ్డుపై భద్రత లేకుండా పోయిందా..?

తరుచూ ప్రమాదాలకు కారణామేంటీ..?

దిశ దశ, కరీంనగర్:

నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే పనిలో నిమగ్నం కావడంలో తీసుకున్న చర్యలు ప్రణాళికబద్దంగా లేకపోవడమో… వాహనాల రద్దీని అంచనా వేయకపోవడమో తెలియదు కానీ కరీంనగర్ ఆ కూడలి యాక్సిడెంట్ జోన్ గా మారిపోయినట్టుగా కనిపిస్తోంది. అడపాదడపా ప్రమాదలు జరిగిన ఈ రహదారిపై భారీ వాహనాలు బోల్తా పడడం సాధారణంగా మారిపోయింది. దీంతో ఆ రహదారిపై వెళ్లడానికి ముందు భయం గుప్పిట చేరిపోవల్సిన పరిస్థితి తయారైందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది.

యాక్సిడెంట్ స్పాట్ గా సర్కిల్…

కరీంనగర్ వాసుల కోసం నిర్మించిన తీగల వంతెన సర్కిల్ లోనే ఈ ప్రమాదాలు జరుగుతుండడం విశేషం. నాలుగు రహదారుల కూడలిగా మారిన ఈ ప్రాంతంలో ఐలాండ్ నిర్మించినప్పటి నుండి రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. సువిశాలంగా నిర్మించిన ఈ ఐలాండ్ వద్దకు వచ్చిన తరువాత వాహనాలను కంట్రోల్ చేయలేకపోతున్నారు డ్రైవర్లు. దీంతో రోడ్డు వాహనాలు అదుపుతప్పి పడిపోతున్నాయి. తాజాగా శుక్రవారం కూడ ఇక్కడ భారీ వాహనం ఒకటి బోర్లాపడిపోయింది. ఐలాండ్ పైనే బోల్తాపడడంతో ప్రమాదం సంభవించింది. హైదరాబాద్, వరంగల్ ప్రాంతాల నుండి రామగుండం, మంచిర్యాల ప్రాంతలకు రాకపోకలు సాగించేందుకు అనువుగా నిర్మించిన ఈ బైపాస్ రోడ్డుపై భారీ వాహనాలు వేగంగా వెల్తుంటాయి. తీగల వంతెన కూడలిలో నిర్మించిన ఐలాండ్ వల్ల రోడ్డు ఇరుకుగా మారిపోవడంతో యాక్సిడెంట్లు సర్వసాధారణంగా మారిపోయాయి. మహారాష్ట్ర, చత్తీస్ గడ్ రాష్ట్రాలకు కూడా లింక్ ఉన్న ఈ రోడ్డుపై వాహనాలు వేగంగా వెల్తుండడం సహజం. అయితే తీగల వంతెన నిర్మాణంలో భాగంగా ఐలాండ్ నిర్మించడంతో రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయని వాహనదారులు వాపోతున్నారు.

తప్పెవరిది..?

నగరం అందంగా కనిపించేందుకు నిర్మాణాలు చేపట్టడం మంచిదే కానీ ప్రమాదాలకు ప్రధాన కారకాలుగా ఆ నిర్మాణాలు ఉండకూడదన్న విషయాన్ని విస్మరించిన అధికారులు వంతెన డిజైన్లను కూడా మార్చేందుకు అనుమతులు ఇచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి. తీగల వంతెన నేరుగా హౌజింగ్ బోర్డు కాలనీ ప్రాంతం వరకు కంటిన్యూ చేసినట్టయితే ఇలాంటి ప్రమాదాలకు ఆస్కారం ఉండకపోయేది. రాజీవ్ రహదారిపై రాకపోకలు సాగించే వాహనాలు యథావిధిగా నడివడంతో పాటు వరంగల్, కరీంనగర్ ప్రాంతానికి వెళ్లాల్సిన వారు కూడా హౌజింగ్ బోర్డు రహదారి మీదుగా తీగల వంతెనను వినియోగించుకునే అవకాశం ఉండేది. కానీ ఈ వంతెనను నేరుగా రామగుండం బైపాస్ రోడ్డుకు లింక్ చేయడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అధికారులు మాత్రం వెనకా ముందు ఆలోచించకుండా ఐలాండ్ నిర్మాణానికి అనుమతి ఇవ్వడం విస్మయానికి గురి చేస్తోంది. రోడ్లు భవనాల శాఖ పరిధిలో ఉన్న ఈ రహదారిపై ఐలాండ్ నిర్మాణం కోసం అనుమతులు ఇవ్వడంపై వెనకా ముందు ఆలోచించుకోలేదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రోజు రోజుకు పెరుగిపోతున్న వాహనాల వినియోగాలను దృష్టిలో పెట్టుకుని ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ఇలాంటి నిర్మాణాలకు అనుమతులు ఇవ్వకూడదన్న విషయాన్ని పట్టించుకోకపోవడం విడ్డూరం. ఐలాండ్ నిర్మాణంతో ఇక్కడ రోడ్డు మరింత ఇరుకుగా ఏర్పడడంతో పాటు భారీ వాహనాలను టర్న్ చేయడం కూడా డ్రైవర్లకు సవాల్ గా మారిపోయింది. ఇదే తీగల వంతెనకు మరో వైపున ఉన్న సదాశివపల్లి సమీపంలోని వరంగల్ రహదారి లింక్ రోడ్డు వద్ద కూడా ఐలాండ్ నిర్మించాలని కార్పోరేషన్ భావించినప్పటికీ ఇందుకు సంబంధించిన అనుమతులు మాత్రం ఇవ్వనట్టుగా తెలుస్తోంది. కానీ మరో వైపున ఉన్న రాజీవ్ రహదారిపై మాత్రం ఐలాండ్ నిర్మాణం కోసం అనుమతులు ఇవ్వడం వెనక ఆంతర్యం ఏంటన్న ప్రశ్న తలెత్తుతోంది. ఏది ఏమైనా తీగల వంతెన కూడలి యాక్సిడెంట్ జోన్ గా తయారైన క్రమంలో అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

You cannot copy content of this page