కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై కేసు నమోదు

కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి‌పై కేసు నమోదు అయింది. ఐపీసీ 506 సెక్షన్ కింద నల్లగొండ వన్ టౌన్ పోలీసులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్, ఆయన కొడుకు డాక్టర్ చెరకు సుహాస్‌ను చంపుతానని బెదిరించిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ను తన అనుచరులు చంపేస్తారంటూ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. చెరుకు సుధాకర్ కుమారుడు సుహాన్‌కు కోమటిరెడ్డి కాల్ చేసిన ఆడియో వైరల్ అయింది. ఈ క్రమంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని చెరుకు సుధాకర్, సుహాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరి ఫిర్యాదు మేరకు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

తనను ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దూషించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని.. వెంటనే ఆయన పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెరుకు సుధాకర్ డిమాండ్ చేశారు. బీసీ కులానికి చెందిన నాయకుడిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం వెంకట్ రెడ్డి అహంకారాన్ని తెలియజేస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడానికి పార్టీ నాయకులందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి పని చేయించాల్సిదిపోయి.. వెంకట్ రెడ్డి అలా మాట్లాడడం సిగ్గు చేటన్నారు. కాంగ్రెస్‌ను పూర్తిగా డ్యామేజ్ చేయాలన్నదే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లక్ష్యంగా కనిపిస్తున్నట్లు చెరుకు సుధాకర్ తెలిపారు.

కాగా, చెరుకు సుధాకర్‌పై తాను చేసిన వ్యాఖ్యలు భావోద్వేగంతో చేశానని.. వేరే ఉద్దేశం లేదని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. 33 ఏళ్ళ తన రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా రాజకీయ ప్రత్యర్ధులపై గానీ, ఇంకెవరి పైనా కూడా దూషించలేదని చెప్పారు. తన శత్రువులను కూడా దగ్గర తీసే తత్వం తనదని.. తిట్టాలనుకుంటే రెగ్యులర్ ఫోన్ ఎందుకు చేస్తానంటూ ప్రశ్నలు సంధించారు.

You cannot copy content of this page