కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఘటన
దాగుడు మూతల్ దండకోర్ ఎలుకా వచ్చే పిల్లి వచ్చే ఎక్కడి దొంగలు అక్కడే గప్ చుప్… అంటూ ఆడుకుంటున్న ఆ చిన్నారులు కేరింతలు ఒక్కసారిగా ఆగిపోయాయి. అన్న అన్న అంటూ ఒక్కసారిగా అరవడం మొదలు పెట్టారు. అప్పుడే వ్యవసాయ పనులు ముగించుకుని వచ్చిన వారి తల్లిదండ్రులు ఆటలాడుకుంటున్నారనకున్న తమ పిల్ల అరుపులు విని ఒక్క సారిగా షాక్ కు గురయ్యారు. వెంటనే పత్తి నిలవ చేసిన చోటకు వెల్లి చూసి ఒక్క సారిగా షాక్ కు గురయ్యారు. ఆసిఫాబాద్ జిల్లాలో జరిగిన ఈ ఘటన గురించి ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టుకుంటున్నారు.
ఆటలాడుకుంటూ..
కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం కన్నెపల్లిలో జరిగిన ఈ ఘటన స్థానికులను విషాదంలోకి నెట్టింది. గ్రామానికి చెందిన చెన్నూరు కైలాష్, రమ దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రోజులాగానే పిల్లలను కౌటాలలోని ప్రైవేటు పాఠశాలకు పంపించి పంట చేలకు వెల్లారు. మంగళవారం సాయంత్రి ఇంటికి చేరుకున్న కైలాష్ ఇద్దరు కొడుకులు, కూతురు ఇంకా తమ అమ్మనాన్నలు ఇంటికి రాలేదని దాగుడు మూతలు దండాకోర్ అంటూ ఆడుకోవడం ఆరంభించారు. ఈ క్రమంలో తన తమ్ముడికి, చెల్లెలికి దొరకవద్దని భావించిన అభిషేక్ (10) ఇంట్లో నిలువ చేసిన పత్తి చాటున దాక్కోవాలని భావించాడు. ఈ క్రమంలో పత్తిని దూరం చేసి గ్యాప్ ఏర్పడగానే అందులోకి దూరిపోయాడు. మొదట తల లోపలకు పెట్టి దాక్కునే ప్రయత్నం చేస్తుండగానే విగతజీవిగా మారిపోయినట్టు ఉంది. పత్తిని దూరం అంటూ దాక్కునేందుకు దూరుతున్న క్రమంలో ఊపిరి ఆడకపోవడంతో అభిషేక్ అందులోనే చిక్కుకపోయాడు. దాగుడు మూతలు ఆడుతున్న అతని తమ్ముడు, చెల్లెలు వెతుక్కుంటూ అన్నా అన్నా అని పిలుస్తూ పత్తి నిలువ చేసిన చోటకు వచ్చి చూడగా కాళ్లు మాత్రం బయట కనిపిస్తుండడంతో చిన్నారులు ఇద్దరు ఒక్కసారిగా అరవడం మొదలు పెట్టారు. అప్పుడే ఇంటికి చేరుకున్న కైలాష్, రమలు పరిగెత్తుకుంటూ అక్కడకు చేరుకుని అభిలాష్ ను గమనించి బయటకు తీసి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించాడని వైద్యులు తెలిపారు.
ప్రాణం తీసిన ఆట
దాగుడు మూతల ఆటలో భాగంగా తాను తమ్ముడికి, చెల్లెలికి కనిపించకుండా ఉండాలని అభిషేక్ పత్తిలో దాక్కునే ప్రయత్నం చేసి విగతజీవిగా మిగిలాడు. ఆటలో భాగంగా తాత్కాలికంగా కనిపించుకుండా ఉండాలని భావించిన అభిషేక్ కానరాని లోకాలకు వెళ్లి శాశ్వతంగా కనిపించుకుండా పోయాడని అతని పేరెంట్స్ ఏడుస్తున్న తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. అరుగాలం శ్రమించి పండించిన పత్తి అమ్ముకుని సొమ్ములతో తమ పిల్లలను పెద్ద చదువులు చదివించాలని కలలు కంటున్న ఆ దంపతుల ఆశలను అడియాసలు చేస్తూ తమ పెద్ద కొడుకును అదే పత్తి ప్రాణాలు తీసుకుందని వాపోతున్నారు.