బీఆర్ఎస్ పార్టీని వీడిన అలువాల కోటి
రాజీనామా లేఖలో సంచలన విషయాలు…
దిశ దశ, తిమ్మాపూర్:
దళిత ఉద్యమ కారుడినే ఓ దళిత ఎమ్మెల్యే అణిచి వేసిన తీరు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఉద్యమ ప్రస్థానం నుండి ఒడి దొడుకులు ఎదుర్కొంటూ ముందుకు సాగిన తన పదవికే ఎసరు పెట్టారని ఓ దళిత ఉద్యమ కారుడు రాసిన రాజీనామా లేఖ కలకలం సృష్టిస్తోంది. గురువారం కరీంనగర్ జిల్లాలో పర్యటించిన టీపీసీసీ చీఫ్ ఏ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆ దళిత బిడ్డ ఆవేదన అంతా ఇంతా కాదు. నియోజకవర్గంలో కూడా ఉద్యమ కారులను అణిచివేస్తున్న విషయం అధిష్టానానికి చెప్పినా పట్టించుకోలేదని కూడా అలువాల కోటి ఆ లేఖలో పేర్కొన్నారు. జిల్లాలోని గన్నేరువరం మండలం పారువెల్లకు చెందిన తాను పార్టీ ఆవిర్భావం నుండి పని చేస్తున్నానని, నుస్తులాపూర్ ప్యాక్స్ ఛైర్మన్ గా ఎన్నికైన తన పదవిని తప్పించేందుకు ఎమ్మెల్యే రసమయి బాల కిషన్ అవిశ్వాసం పెట్టించి నా పదవికి రాజీనామా చేయించారని దళిత ఉద్యకారుడు అలువాల కోటి ఆ రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఆ తరువాత బోయినపల్లి వినోద్ కుమార్ కుమార్ వద్దకు తీసుకెల్లి నామినేటెడ్ పదవి ఇప్పిస్తానని మాట ఇచ్చి కూడా తుంగలో తొక్కారని కోటి ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో కూడా ఎన్నో అవమానాలకు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ గురి చేశారని… ఈ విషయాల గురించి జిల్లా అధ్యక్షులైన జివి రామకృష్ణారావు గారికి అధిష్టానం పెద్దలకు ఎన్నో సార్లు ఫిర్యాదు చేసినా లాభం లేకుండా పోయిందని కోటి ఆరోపించారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నిరంకుశ పోకడలను భరించలేకపోవడంతో పాటు నియోజకవర్గంలోని ఉద్యమకారులెందరిని అణిచివేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని అలువాల కోటి వివరించారు. ఈ కారణంగానే తాను బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని ప్రకంటించారు.
కారణం అదేనా..?
అయితే అలువాల కోటిపై అణిచివేత ధోరణి అవలంభించిన తీరు గురించి స్థానికంగా పలురకాల చర్చ సాగుతోంది. పార్టీలో మొదటి నుండి క్రియాశీలక కార్యకర్తగా పనిచేసిన కోటి ఉద్యమంలో కాలికి కూడా తీవ్రం గాయం అయింది. ఈ విషయం తెలిసి ఉద్యమ నేత కేసీఆర్ ఆయన ఆర్థిక పరిస్థితి తెలుసుకుని బాసటగా నిలిచారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేరుగా గుర్తు పట్టే స్థాయిలో ఉన్న కోటి పేరు కూడా అసెంబ్లీ ఎన్నికల సమయంలో పరిశీలనలో ఉంది. తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ ప్యాక్స్ ఛైర్మన్ గా ఉన్న పేరు పరిశీలనకు రావడం స్థానికంగా సంచలనంగా మారింది. ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు మానకొండూరు ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో అలువాల కోటి పేరు ఉన్నదన్న విషయం వెలుగులోకి వచ్చిన తరువాతే ఆయన కుర్చికి ఎసరు పెట్టారన్న ప్రచారం కూడా ఉంది. ఆయనకు ఉన్న పదవి కూడా లేకుండా చేసినట్టయితే అధినేత వద్ద మైనస్ పాయింట్స్ పడుతాయని భావించే అవిశ్వాస తీర్మాణం రాజకీయాన్ని తెరపైకి తీసుకొచ్చారన్న చర్చ కూడా సాగింది. మొదటి నుండి ఎమ్మెల్యే పదవి అభ్యర్థుల జాబితాలో తన పేరు ఉన్నప్పటికీ అనూహ్యంగా రసమయి బాలకిషన్ పేరును అధిష్టానం ప్రకటించినప్పటికీ పార్టీ నిర్ణయాన్ని కాదనలేక విధేయుడిగా పనిచేశానని కోటి చెప్పుకుని మదనపడే వారు. ఈ క్రమంలో తనవంతుగా ప్రయత్నాలు చేసినట్టయితే భవిష్యత్తులో కనీసం ఏదైనా నామినేటెడ్ పదవి వస్తుందని ఆశించిన కోటికి అవిశ్వాసం రూపంలో షాక్ ఇచ్చారు. దీంతో మనోవేదనకు గురయని ఆయన ప్రత్యామ్నాయ మార్గం ఎంచుకోవడం తప్ప మరో దారి లేదని భావించారని తెలుస్తోంది. తనకు ఇప్పటి వరకు జరిగిన అవమానాలను దృష్టిలో పెట్టుకున్న కోటి ఉద్యమ పార్టీని వీడాలని భావించి ఈ మేరకు జిల్లా అధ్యక్షుడు జివి రామకృష్ణారావుకు లేఖ రాసి పంపించినట్టుగా తెలుస్తోంది. ఏది ఏమైనా ముఖ్యమంత్రి కేసీఆర్ కనుసన్నల్లో ఉద్యమకారుడిగా ఉన్న నాయకుడే గులాభి జెండా నీడను వదిలి వెల్లిపోవడం మాత్రం ఆ పార్టీలోని లోపాలను ఎత్తి చూపుతోంది.