ఐఐటీ చదవాలన్న కోరిక…
సహకరించని ఆర్థిక పరిస్థితి…
మేకలు కాస్తున్న గిరిజన బిడ్డ
దిశ దశ, రాజన్న సిరిసిల్ల:
సరస్వతి పుత్రికకు లక్ష్మీ కటాక్షం లేక అవస్థలు పడుతోంది. ఐఐటీ చదవాలన్న కోరిక ఉన్నా ఆర్థిక పరిస్థితి బాగాలేక ఇక్కట్లు ఎదుర్కొంటోంది. ఆశయం ఉన్నతంగా ఉన్నా చదివించే స్థోమత తల్లిదండ్రులకు లేకపోవడంతో మేకలు కాస్తూ కుటుంబానికి చేదోడుగా నిలుస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం గోనే నాయక్ తండాకు చెందిన బంజారా బిడ్డ దయనీయ పరిస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. తండాకు చెందిన బదావత్ రాములు, సరోజ దంపతులకు ముగ్గురు ఆడబిడ్డలు కాగా ఇద్దరు డిగ్రీ పూర్తి చేసి వ్యవసాయం చేస్తూ తల్లిదండ్రులకు చేదోడుగా నిలుస్తున్నారు. మూడో కూతురు మధులత జేఈఈ అడ్వాన్స్ లో ప్రతిభ కనబర్చి ఎస్టీ కేటగిరిలో 824 ర్యాంకు సాధించింది. మధులతకు బీహార్ లోని పాట్నాలో ఐఐటీ సీటు వచ్చింది. అయితే కాలేజీకి రూ. 3 లక్షల ఫీజు చెల్లించాల్సి ఉండడంతో పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న ఆ కుటుంబం అంత మొత్తం ఫీజు చెల్లించే పరిస్థితి లేకుండా పోయింది. ఈ నెల 27వ తేది లోపు ఫీజు చెల్లించనట్టయితే అడ్మిషన్ క్యాన్సిల్ అవుతుందని మధులత తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఉన్న కొద్దిపాటి భూమిని సాగు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న తాము రూ. 3 లక్షలు చెల్లించే పరిస్థితి లేదని వారు ఆవేదన చెందుతున్నారు. పేదరికంలో పుట్టిన తమను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని అభ్యర్థిస్తున్నారు. తమ కూతురు కలలను సాకారం చేసే పరిస్థితి లేకుండా పోయిందని బాధ పడుతున్న మధులత తల్లిదండ్రులు తమకు బాసటగా నిలవాలని అభ్యర్థిస్తున్నారు. మధులత కూడా తమ అక్కయ్యల మాదిరిగానే తల్లిదండ్రుల కష్టంలో పాలు పంచుకునేందుకు మేకలు కాస్తోంది. ఉన్నత చదువులు చదవాలన్న ఆశయానికి పేదరికం అశనిపాతంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తోంది.