ప్రేమ బంధమా… పేగు బంధమా..?

నెట్టింట వైరల్ అవుతున్న వీడియో

ఆవేదన వెల్లగక్కుతున్న పేరెంట్స్…

దిశ దశ, రాజన్న సిరిసిల్ల:

పేగు బంధం తెంచుకుని పుట్టిన తమ బిడ్డ ప్రేమించి పెళ్లి చేసుకున్నదన్న విషయం తెలిసి ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. చెట్టంత ఎదిగిన తమ బిడ్డ సాఫ్ట్ వేర్ రంగంలో నిపుణురాలిగా ఎదిగి తమ కలల సౌధాలను నేరవేర్చుతుందని ఆశించిన ఆ పేరెంట్స్ కు నిరాశే ఎదురయింది. కూతురు తీసుకున్న నిర్ణయంతో నవమాసాలు మోసి కన్న ఆ తల్లి మనసు తల్లడిల్లిపోతుంటే.. తన ఇంటికి ప్రతిరూపంగా భావించిన ఆ తండ్రి గుండె పగిలే పనిచేసిందంటూ విలవిలలాడిపోతున్నాడు. తమ బిడ్డ తీరుపై తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

సిరిసిల్ల పట్టణంలో…

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్న ఈ ఘటన ఎప్పుడు జరిగిందో కానీ ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు మాత్రం సోషల్ మీడియా ప్లాట్ ఫాం వేదికలపై వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇంతకీ ఏం జరిగిందంటే సిరిసిల్ల పట్టణానికి చెందిన ఓ అమ్మాయి బీటెక్ ఫస్ట్ ఈయర్ చదువుతోంది. తన బిడ్డ ఉన్నత శిఖరాలకు చేరాలని కలలు కన్న ఆ తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించారు. అయితే సదరు యువతి సమీపంలోని మరో కాలనీలో నివాసం ఉంటున్న యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ విషయం తెలిసిన ఆ యువతి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కుటుంబ సభ్యులంతా కూడా నిద్రాహారాలు మాని మానసికంగా కుంగి కుమిలిపోతున్నారు. డిగ్రీ పూర్తయిన తరువాత ఉన్నత చదువులు చదివించాలా లేక పెళ్లి చేయాలా అని ఆలోచిస్తున్న క్రమంలో ఆమె తన ప్రేమికుడిని పెళ్లి చేసుకునేందుకు చెప్పా పెట్టకుండా ఇంటి నుండి వెల్లిపోయిన తీరుపై కుటుంబ సభ్యులు రోధనలు మిన్నంటిపోయాయి.

తండ్రి ఆవేదన ఇది…

తమ కడుపున పుట్టిన బిడ్డ ప్రేమించిన వాడికోసం తమను కాదనుకున్న తీరును తట్టుకోలేకపోయాడా తండ్రి. తల్లిదండ్రుల మమకారం కన్న ప్రేమించిన వాడే మిన్న అన్నట్టుగా ఆమె వ్యవహరించిన తీరు చూసి గుండెలవిసేలా రోధిస్తున్నాడు. తమను కాదనుకుని వెల్లిన బిడ్డ ప్రేమ పెళ్లి చేసుకున్న తీరుతో చలించిపోయిన ఆమె పేరెంట్స్ తమ కూతురు చనిపోయిందంటూ ఫ్లెక్సీ తయారు చేసి ఇంటి ముందు ఏర్పాటు చేశాడు. తన కూతురు ఫోటో వేసి అశ్రు నివాళి అంటూ రాయించాడు. ‘‘అమ్మలారా అక్కలారా నా బిడ్డ పోయింది… నా బిడ్డను ఓ దొంగోడు మోసం చేసిర్రు… ట్రాప్ చేసిర్రు మా అమ్మాయిని… అమ్మలారా అక్కలారా… నా బిడ్డకు నా చుట్టే ఉండి నా కళ్లను మోసం చేసిర్రు, నా బిడ్డను మంచి కాలేజీలో బీటెక్ చదివిస్తున్నాను… ఇట్లాంటి బిడ్డలతో అన్యాయం చేసుకోకండి… బిడ్డ ఇలాంటి బ్రతుకులు మీరు బ్రతకకండి… తల్లిదండ్రులకు అన్యాయం చేయకండి… మీకు దండం పెడ్తా కాళ్లు మొక్కుతా’’ అంటూ ఆ తండ్రి వెల్లగక్కిన ఆవేదన విన్న ప్రతి ఒక్కరూ కూడా చలించిపోతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా నేటి తరం తల్లిదండ్రులను కాదని ప్రేమ పేరుతో రెక్కలొచ్చిన పక్షుల్లా ఎగిరిపోతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తాళి కట్టి ఠాణా కెల్తే పెళ్లయినట్టా…

తన కూతురును ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్న తీరుపై ఆమె తండ్రి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అసలు కూతుర్లను కనాలా వద్దా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. పిల్లలు ప్రయోజకులు కావాలని తాము చదివిస్తుంటే అర్థరాత్రి వరకూ వీధుల్లో తిరుగుతూ తమ అమ్మాయిని ట్రాప్ చేసి పెళ్లి చేసుకోవడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నిస్తున్నారు. అమ్మాయిలను ట్రాప్ చేసే దొంగల పట్ల జాగ్రత్తగా ఉండాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తల్లిదండ్రులను శోకసంద్రంలో ముంచుకుండా చూడాలని ఆయన అభ్యర్థిస్తున్నారు. ప్రేమించిన విషయాన్ని పెద్దల ద్వారా సంప్రదింపులు జరపకుండా ఎత్తుకెళ్లి ప్రేమ వివాహం చేసుకోవడం సరికాదని… తమలాంటి పేరెంట్స్ కు కడుపుకోత మిగల్చవద్దని ఆయన ఆభ్యర్థిస్తున్న తీరు కూడా స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

You cannot copy content of this page