వారం రోజుల్లో ఆరుగురి హత్య… ఇంటి కోసం వేటాడి చంపి…

స్నేహితుడి కుటుంబాన్నే కడతేర్చిన ఘనడు…

దిశ దశ, నిజామాబాద్:

కరుడు గట్టిన నేరస్థులు కూడా ఈ స్థాయిలో హత్యలు చేసి ఉండరు కావచ్చు. నేరమయ ప్రపంచాన్ని శాసించే క్రిమినల్స్ అంచనాలకు కూడా అంతు చిక్కని రీతిలో వరస హత్యలు చేశాడు. కేవలం వారం రోజుల్లో ఆరుగురిని హతమార్చేశాడు. ఈ మర్డర్స్ అన్ని కూడా పగ ద్వేషంతో కూడుకున్నవి కూడా కావు… ప్రతీకారం తీర్చుకున్నందుకు కూడా కావు.  కేవలం ఒక ఇంటి కోసం తన స్నేహితుడి  కుటుంబాన్ని అంతమొందించాడు. రాష్ట్రంలోనే సంచలనం కల్గిస్తున్న ఈ ఘటనకు సంబంధించిన ప్రాథమిక వివరాలు ఇలా ఉన్నాయి.

నిజామాబాద్ జిల్లాలో ఘటన…

నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోని సదాశివనగర్ పోలీసులు ఈ కేసులో దర్యాప్తు మొదలు పెట్టి కూపీలాగడం ఆరంభించారు. జిల్లాలోని మక్లూర్ కు చెందిన ప్రసాద్ కుంటుంబ కొంతకాలంగా మాచారెడ్డిలో స్థిరపడింది. అయితే స్వంత గ్రామంలోని సొంత ఇంటిని ప్రసాద్ విక్రయించకుండా మాచారెడ్డిలో కుటుంబంతో సహా జీవనం సాగిస్తున్నాడు. అయితే ప్రసాద్ స్నేహితుడు ప్రశాంత్ సదరు ఇంటిపై రుణం ఇప్పిస్తానని చెప్పి తనపేరిట మార్పిడీ చేయించుకున్నాడు. అయితే లోన్ రావడం లేదని చెప్పి ప్రశాంత్ నమ్మబలకడంతో తన ఇంటిని తన పేరిట తిరిగి మార్చాలని ప్రసాద్ వెంటపడసాగాడు. అప్పటికే ఆ ఇంటిని ఎలాగైనా కాజేయాలనుకున్న ప్రశాంత్ తిరిగి ఆ ఇంటిని ప్రసాద్ కు అప్పగించేందుకు మనసొప్పడం లేదు. అయితే తన ఆస్థిని తన పేరిట చేయాలంటూ ప్రసాద్ రోజు రోజుకు ఒత్తిడి పెంచుతుండడంతో అసలా కుటుంబమే లేకుండా చేస్తే బావుంటదనుకున్న ప్రశాంత్ పక్కా స్కెచ్ వేశాడు. కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యం కూడా అనుకూలంగా ఉంటుందని భావించిన ప్రశాంత్ రోజుకొక్కరిని చొప్పున హతం చేస్తూ వచ్చాడు. మొదటి రోజున తన స్నేహితుడు ప్రసాద్ ను ఇంటి నుండి తీసుకవెళ్లి నిజామాబాద్, కామారెడ్డి జాతీయ రహదారి సమీపంలోని అటవీ ప్రాంతంలో హత్య చేశాడు. మరునాడు ఏమీ ఎరగనట్టుగా ప్రసాద్ ఇంటికి చేరుకున్న నిందితుడు మీ భర్తను పోలీసులు అరెస్ట్ చేశారని మాయమాటలు చెప్పి ఆమెను బయటకు తీసుకెళ్లాడు. తన భర్త స్నేహితుడు చెప్తున్నది నిజమేనని నమ్మిన ప్రసాద్ భార్య ప్రశాంత్ తో కలిసి వెల్లగా ఆమెను చంపి బాసర గోదావరి నదిలో పడేశాడు. ఆ తరువాత ప్రసాద్ దంపతులు ఇద్దరు కూడా పోలీసుల అదుపులో ఉన్నారని చెప్పి అతని పెద్ద సోదరిని తీసుకెల్లి హత్య చేయగా, ఆ తరువాత మృతుడి ఇద్దరు పిల్లలను హతమార్చి సోన్ బ్రిడ్జి సమీపంలోని కాలువలో పడేశాడు. మరో సోదరిని కామారెడ్డి జిల్లా సదాశివనగర్ లో చంపి కాల్చేసి అక్కడి నుండి వెల్లిపోయాడు. అనుమానస్పద స్థితిలో కాలిపోయిన యువతి శవం గురించి తెలుసుకున్న పోలీసులు కూపీ లాగడంతో అసలు గుట్టు రట్టయినట్టుగా తెలుస్తోంది. సాంకేతికతను అందిపుచ్చుకోవడంతో పాటు వివిధ కోణాల్లో ఆరా తీసిన పోలీసులు ప్రశాంత్ ను అదుపులోకి తీసుకుని విచారించడంతో పూర్తి వివరాలు రాబట్టగలిగారు. ప్రసాద్ దంపతులతో పాటు అతని సోదరి హత్యలో ప్రశాంత్ ఒక్కడే పాల్గొనగా ఆ తరువాత హత్యలకు అతని స్నేహితులు ముగ్గురి సాయం తీసుకున్నట్టుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. 20 ఏళ్ల వయసు ఉన్న నిందితుడు ప్రశాంత్ తన స్నేహితుని ఇంటిని స్వాధీనం చేసుకోవాలన్న దురాశతోనే ఆరుగురిని హత్య చేశాడని గుర్తించిన పోలీసులు లోతుగా దర్యాప్తు ప్రారంభించారు.

You cannot copy content of this page