దిశ దశ, మానకొండూరు:
స్కూల్ అనగానే టీచర్లు మాత్రమే గుర్తుకు వస్తుంటారు. వారిని మాత్రమే గౌరవించే సాంప్రాదాయం చూస్తుంటాం. కానీ అక్కడి ఉపాధ్యాయులు రిటైర్ అయిన స్వీపర్ కు ఘనంగా వీడ్కోలు పలికారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మొగిలిపాలెం ప్రాథమిక పాఠశాలలో విలాసాగరం వెంకటయ్య 35 ఏళ్లుగా పార్ట్ టైం స్వీపర్ గా పని చేస్తున్నారు. రూ. 60తో ఉద్యోగంలో చేరిన ఆయన ప్రస్తుతం 5 వేల జీతం తీసుకుంటున్నారు. తన ఉద్యోగాన్ని పర్మినెంట్ చేయాలని చేసిన వినతులను మాత్రం ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ ఆయన మాత్రం తన విధులకే అంకితమై పనిచేశారు. పాఠశాల ఆవరణను పరిశుభ్రంగా ఉంచడం కోసం మూడున్నర దశాబ్దాలుగా పనిచేశారు వెంకటయ్య. సుదీర్ఘకాలం బడి సేవలోనే కాలం వెల్లదీసిన వెంకటయ్య రిటైర్ అవుతున్న సందర్భంగా మొగిలిపాలెం ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు వెంకటయ్యను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ సుద్దాల శ్రీనివాస్ తో పాటు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నది.
ఆదరణ అంటే ఇది…
మూడున్నర దశాబ్దాలుగా పాఠశాలలో పార్ట్ టైం స్వీపర్ గా పనిచేసిన వెంకటయ్య సన్మాన కార్యక్రమంలో ప్రస్తుతం పనిచేస్తున్న టీచర్లే కాకుండా గతంలో ఇక్కడ పనిచేసిన బదిలీపై వెల్లిన ఉపాధ్యాయులు కూడా హాజరు కావడం గమనార్హం. అంకిత భావంతో పనిచేసిన వెంకటయ్య లాంటి పార్ట్ టైం స్వీపర్లను ఆదరించిన ఉపాధ్యాయులు సరికొత్త సాంప్రాదాయానికి శ్రీకారం చుట్టారు. పనిచేసి బదిలీపై వెల్లిన తరువాత గతంలో పనిచేసిన ప్రాంతంతో అనుబంధం పెట్టుకునే వారి సంఖ్య అత్యంత తక్కువగా ఉంటుంది. కానీ మొగిలిపాలెం స్వీపర్ వెంకటయ్య పదవి విరమణకు మాత్రం గతంలో ఇక్కడ పనిచేసి వెల్లిన టీచర్లు కూడా ప్రత్యేకంగా వచ్చి వీడ్కోలు చెప్పడం స్థానికులను ఆకట్టుకుంది. విద్యార్థులను ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే కాదు… తాము కూడా ఆదర్శప్రాయమైన నడవడికతో ముందుకు సాగుతామని ఇక్కడి ఉపాధ్యాయులు చేతల్లో చూపించారు.