సరిహద్దుల్లో భారీ మీటింగ్…
భేటీ అయిన మెయిన్ లీడర్స్…
పోలీసుల కూంబింగ్ ఆపరేషన్
ఎదురు కాల్పులతో అట్టుడికిన అడవులు
దిశ దశ, దండకారణ్యం:
మరో రెండు మూడు నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తెలంగాణ, చత్తీస్ గడ్ సరిహద్దు అడవులు ఎదురు కాల్పులతో దద్దరిల్లిపోయాయి. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సరిహద్దు అటవీ ప్రాంతంలో తెలంగాణ పోలీసుల కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. అత్యంత కీలకమైన ఈ సమాచారాన్ని బట్టి బార్డర్ ఫారెస్ట్ ఏరియాలో మావోయిస్టు పార్టీ అగ్రనేతలు సమావేశం అయినట్టు తెలుస్తోంది.
ముఖ్య నేతల భేటీ
కేంద్ర కమిటీ సభ్యుడు పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న, బండి ప్రకాష్ అలియాస్ బండి దాదా అలియాస్ క్రాంతి, బడే దామోదర్ అలియాస్ చొక్కారావు, మైలారపు ఆడెల్లు అలియాస్ భాస్కర్, కొయ్యాడ సాంబయ్య అలియాస్ గోపన్న, కంకణాల రాజిరెడ్డి అలియాస్ వెంకటేష్, మహేష్ అలియాస్ సోములు, కవ్వాసి గంగ అలియాస్ మహేష్ అలియాస్ జనార్దన్, నల్లమరి అశోక్ అలియాస్ విజయేందర్, పూనెం అడుమయ్య అలియాస్ గణేష్, బండారు అలియాస్ పాపన్న, కొవ్వాసి రాము, మడ్కం మంగా అలియాస్ మాసా, కుంజ వీరయ్య అలియాస్ లచ్చన్న, లక్ష్మణ్ తదితరులతో పాటు సుమారు 40 మంది వరకు మావోయిస్టులు సమావేశం అయ్యారు. ములుగు జిల్లా పేరూరు పోలీసు స్టేషన్ పరిధిలోని తెలంగాణ, చత్తీస్ గడ్ సరిహద్దు నూగూరు అటవీ ప్రాంతంలో భేటీ అయ్యారు.
భారీ టార్గెట్…
రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకున్న మావోయిస్టులు తెలంగాణలో భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు వీరు నూగూరు రిజర్వూ ఫారెస్ట్ లో సమావేశం అయినట్టుగా కీలక సమాచారాన్ని ములుగు జిల్లా పోలీసులు అందుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖులను, పోలీసులపై దాడులు చేసేందుకు సమాయత్తం అయినట్టుగా పోలీసులు సమాచారం అందుకున్నారు. ఈ మేరకు గ్రే హౌండ్స్, ములుగు స్పెషల్ పార్టీలు సరిహద్దు అటవీ ప్రాంతంలో కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ నెల 26 సాయంత్రం 5.40 గంటల ప్రాంతంలో పోలీసు బలగాలు మావోయిస్టులు సమావేశం అయిన ప్రాంతానికి చేరుకున్నాయి. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు, మావోయిస్టు నక్సల్స్ కు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో మావోయిస్టు అగ్రనేతలందరు కూడా సేప్టీ ప్రాంతానికి తరలి వెళ్లిన తర్వాత కాల్పులు నిలిచిపోయాయి. అప్పటికే చీకట్లు కమ్ముకోవడంతో పోలీసులు సెర్చింగ్ ఆపరేషన్ తాత్కాలికంగా నిలిపి వేశారు. బుధవారం ఉదయం ఆ ప్రాంతంలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టడంతో మావోయిస్టు పార్టీకి చెందిన సామాగ్రి లభ్యం అయింది. ఇప్పటికీ కూంబింగ్ ఆపరేషన్ యథావిధిగా బలగాలు కొనసాగిస్తున్నట్టు సమాచారం. పోలీసు అధికారులు ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచారు.
హై అలెర్ట్…
సరిహద్దు అడవుల్లో మావోయిస్టు సమావేశం భగ్నం చేసిన నేపథ్యంలో హై అలెర్ట్ గా వ్యవహరిస్తున్నారు. అనుమానితులను ఎక్కడికక్కడ నిలువరించే చర్యలకు శ్రీకారం చుట్టారు.