రూ. 28 లక్షలు పోయాయని ఫిర్యాదు
కూపీ లాగిన సిటీ సైబర్ క్రైం వింగ్
రూ. 712 కోట్ల స్కాం వెలుగులోకి…
ఉగ్రమూలాలు సైతం…
దిశ దశ, హైదరాబాద్:
ఆన్ లైన్ ఛీటింగ్ తో రూ. 28 లక్షలు పొగొట్టుకున్నానని బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా లోతుగా దర్యాప్తు చేసిన హైదరాబాద్ సిటీ పోలీసులు భారీ స్కాంను ఛేదించారు. సైబర్ క్రైం వింగ్ చొరవతో తవ్వినా కొద్ది నిందితుల గుట్టు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుండడంతో పోలీసులు మరింత ఇంట్రెస్ట్ చూపించి దర్యాప్తు చేశారు. దీంతో రూ. 712 కోట్ల స్కాం బయట పడగా… దీని వెనక చైనీయుల పాత్ర ఉండడంతో పాటు అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థతో ఉన్న లింకులు కూడా వెలుగులోకి వచ్చాయి. శనివారం హైదరాబాద్ సిటీ కమిషనర్ సివి ఆనంద్ మీడియాకు ఇంటర్నేషనల్ క్రిమినల్స్ గురించి వెల్లడించారు.
అసలే జరిగిందంటే..?
హైదరబాద్ లోని చిక్కడపల్లికి చెందిన ఓ వ్యక్తికి టెలిగ్రాం యాప్ ద్వారా “రేట్ అండ్ రివ్యూ” అనే పార్ట్ టైం జాబ్ ఆఫర్ వచ్చింది. అది నిజమని నమ్మిన బాధితుడు https://www.traveling-boost-99.comలో తన వివరాలను నమోదు చేసుకున్నాడు. మొదట రూ. వెయ్యి పంపాలని బాధితుడికి కంపెనీ ప్రతినిధులు సూచించగానే పంపించాడు. ఇందుకు 5 టాస్క్ ల సెట్ కు ఫైవ్ స్టార్ రేటింగ్ ఇవ్వగానే అతనికి రూ. 866 లాభం వచ్చింది. ఇలా బాధితుడు తన డబ్బును అప్ లోడ్ చేయడం… రేటింగ్ ఇవ్వడం చేస్తున్నప్పుడల్లా అతని కోసం క్రియేట్ చేసిన వ్యాలెట్ అకౌంట్లో ఎంత డబ్బు వచ్చిందన్న విషయాన్ని డిస్ ప్లే చేస్తున్నారు. 30 టాస్క్ ల 4 సెట్ లను రేట్ చేసేందుకు రూ. 25 వేలు బదిలీ చేయగా అతనికి రూ. 20 వేలు లాభం వచ్చింది. తనకు వచ్చిన లాభాలను విత్ డ్రా చేసుకుంటానని బాధితుడు సంస్థ ప్రతినిధులను అభ్యర్థించినప్పుడు అలాంటి అవకాశం మాత్రం కల్పించకుండా రేటింగ్ ఇస్తూ వెళ్లాలని సూచించారు. ఇలా ఓ సారి రూ. లక్ష, మరో సారి రూ. 2 లక్షలు బదిలీ చేయాలని సూచించి ఇందుకోసం అతనికి వచ్చిన లాభం ఎంత వచ్చిందో వ్యాలెట్ లో ప్రదర్శించారు. 30 టాస్క్ ల 4వ సెట్ నుండి ప్రీమీయం టాస్క్ లను ప్రవేశ పెట్టాడంతో ఇందుకు బాదితుడు రూ. 25 లక్షలు బదిలీ చేశారు. తను బదిలీ చేసిన డబ్బుతో పాటు లాభం తాలూకు డబ్బును డ్రా చేసుకోవాలంటే రూ. 17 లక్షల ఫీజు చెల్లించాలని బాధితుడిని మళ్లీ అడిగారు. దీంతో అనుమానించిన బాధితుడు చిక్కడపల్లి పోలీసులను ఆశ్రయించి తాను సైబర్ ఛీటర్స్ వలలో చిక్కుకుని రూ. 28 లక్షలు పొగొట్టుకున్నానని ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు.
కూపీ లాగిన పోలీసులు…
చిక్కడపల్లికి చెందిన బాధితుడి ఫిర్యాదు ఆధారంగా వెబ్ సైట్ తో పాటు అతను ఏఏ అకౌంట్లకు డబ్బులు బదిలీ చేశారోనన్న అంశాలపై విచారణ చేపట్టారు పోలీసులు. సైబర్ క్రైం వింగ్ ప్రత్యేక దృష్టి సారించడంతో ఈ ముఠా గుట్టు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చింది. బాధితుని బదిలీ చేసిన రూ. 28 లక్షలు రాధిక మార్కెటింగ్ పేరుతో నిర్వహిస్తున్న అకౌంట్ తో పాటు మరో ఆరు అకౌంట్లకు బదిలీ చేసుకుని అక్కడి నుండి దేశంలోని వివిధ బ్యాంకుల ఖాతాలకు అమౌంట్ ట్రాన్స్ ఫర్ చేయించుకుని చివరకు దుబాయిలో క్రిప్టో కరెన్సీ కొనుగోలు కోసం మోసాలతో సంపాదించిన డబ్బును ఉపయోగించినట్టు పోలీసుల విచారణలో తేలింది. రాధిక మార్కెటింగ్ పేరిట ఉన్న ఖాతాను 8948013209 మొబైల్ నంబర్‌తో అనుసంధానం చేశారు. హైదరాబాద్ కు చెందిన మహ్మద్ మున్నావర్ పేరిట ఈ మొబైల్ ఉండడాన్ని గుర్తించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని వివరాలను రాబట్టారు. ప్రతి అకౌంట్ కు రూ. 2 లక్షల ఆఫర్ తో 33 షెల్ కంపెనీలు, 61 అకౌంట్లను తెరిచి మనీష్ కు అప్పగించారని, మనీష్ వెబ్ డిజైనింగ్ కోసం గగన్ ను, ఖాతాదారులతో సమన్వయం చేసుకునేందుకు నయిమ్ ను నియమించుకున్నాడని పోలీసుల ఆరాలో బయటపడింది. ఓపెన్ చేసిన ఖాతాలను ప్రకాష్ ప్రజాపతి, కుమార్ ప్రజాప్రతికి విక్రయించాడని, ప్రకాష్ ప్రజాపతి చైనీయులు లీ లౌ గ్వాంగ్ జౌ, నాన్ యే, కెవిన్ జున్ తదితరులతో సంబంధాలు పెట్టుకుని ఉన్నాడని గుర్తించారు. భారతీయ ఖాతాలను అందించేదుకు చైనీయులతో సమన్వయం చేసుకుంటడని కూడా పోలీసుల విచారణలో తేలింది. రిమెట్ యాక్సెస్ యాప్ COOLTECH, AIRDROIDల ద్వారా దుబాయి, చైనాల నుండి ఈ ఖాతాలను ఆపరేట్ చేసుకునేందుకు OTP లను షేర్ చేసుకుంటున్నారని, చైనాకు చెందిన చైనీస్ లీ లౌ గ్వాంగ్‌జౌ, నాన్ యే, కెవిన్ జున్ లే ఈ టాస్క్ బేస్డ్ ఇన్వెస్టిమెంట్ మోసాల వ్యవస్థను నడిపిస్తున్నారని పోలీసులు తెలుసుకున్నారు. టెలిగ్రాం యాప్ ద్వారా మెసేజేస్ చేస్తూ బాధితులను ప్రలోభాలకు గురి చేస్తూ రూ. కోట్లలో డబ్బు గడిస్తున్నారని గమనించారు. చైనీయులు భారతీయుల నుండి డబ్బు దోచుకున్నప్పుడు ప్రకాష్ ప్రజాపతి ద్వారా ప్రైమరీ షెల్ కంపెనీల పేరిట తీసిన బ్యాంక్ అకౌంట్లలో జమ చేస్తారని, ఈ మోసాల ద్వారా వచ్చే డబ్బును దాచిపెట్టడానికి కొన్ని సెకండరీ బ్యాంకు ఖాతాలకు కూడా లేయర్ చేశారని సిటీ పోలీసులు తేల్చారు. ముంబాయికి చెందిన ఆరిఫ్, అనాస్, ఖాన్ భాయ్, పీయూష్, సైలేషెట్ లతో కో ఆర్డినేషన్ చేసుకుంటూ INRని USDT ద్వారా క్రిఫ్టోకి మార్చేందుకు దుబాయిలో స్థిరపడి అక్కడి నుండి బదిలీ చేశారని పోలీసుల విచారణలో తేలింది. ఈ లావాదేవీల్లన్నింటిలోనూ ప్రకాష్ ప్రజాపతికి 2నుండి 3 శాతం కమిషన్ ఇచ్చేందుకు ఇచ్చేందుకు కూడా ఒప్పందం చేసుకున్నారని, తనకు వచ్చిన కమిషన్ నుండి కుమార్ ప్రజాప్రతినిధి ద్వారా ఖాతాలను క్రియేట్ చేయడానికి సహకారం అందించిన వారికి అందించే విధానాన్ని కూడా అవలంభిస్తున్నారని గుర్తించారు. ఈ నగదును హవాలా ద్వారా బదిలీ చేస్తారని, ప్రధాన వాటాను చైనా నుండి రూక్సిన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ పేరుతో ఎలక్ట్రిక్ బైకులలను దిగుమతి చేసుకుంటున్నారని తేలింది. ప్రకాష్ ప్రజాపతి తన కమీషన్‌లను USDT లేదా TRONలో చెల్లించడానికి ట్రాన్ కాయిన్ వ్యాలెట్ చిరునామాను ఉపయోగిస్తున్నాడని, ఈ క్రిఫ్టో వ్యాలెట్ లావాదేవీలు మరో వ్యాలెట్ చిరునామాకు క్రిఫ్టో ట్రాన్స్ ఫర్ చేస్తున్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక సహాకాం అందించే హిజ్బుల్లా వ్యాలెట్ తో పాటు మరో రెండు క్రిఫ్టో వ్యాలెట్ లతో లావాదేవీల సంబంధాలు ఉన్నట్టుగా వెలుగులోకి వచ్చింది. ప్రకాష్ ప్రజాప్రతి 65 ఖాతాలను చైనీయులకు పంపించాడని, అందులో రూ. 128 కోట్ల మేర లావాదేవీలు జరగగా, ఈ నగదును USDTగా మార్చిన ఇతర ఖాతాల్లో రూ. 584 కోట్లు లావాదేవీలు జరిగినట్టుగా గుర్తించగా మొత్తం రూ. 712 కోట్ల వరకు ఛీటింగ్ చేసినట్టుగా పోలీసుల విచారణలో గుర్తించారు.
తొమ్మిది మంది అరెస్ట్…
ఈ కేసులో ముంబై, అహ్మదాబాద్, హైదరాబాద్ లకు చెందిన తొమ్మిది మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ప్రకాష్ ముల్చంద్‌భాయ్ ప్రజాపతి, కుమార్ ప్రజాపతి, నయీముద్దీన్ వహిదుద్దీన్‌షేక్, గగన్‌కుమార్ సోనీ, పర్వీజ్ @ గుడ్డు, షమీర్‌హమ్, సుమీర్‌హామ్, అరుల్‌దాసిన్ లను హైదరబాద్ సిటీ పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. నిందితుల నుండి 17 మొబైల్ ఫోన్‌లు, 2 ల్యాప్‌టాప్‌లు, 22 సిమ్ కార్డ్‌లు, 4 డెబిట్ కార్డ్‌లు, 33 కంపెనీలకు సంబంధించిన పత్రాలు, 3 బ్యాంక్ చెక్ బుక్‌లు, 12 కరెన్సీ నోట్లు మరియు 6 చైనీస్ యువాన్ కరెన్సీ మరియు ఒక పాస్‌పోర్ట్ లను స్వాధీనం చేసుకున్నారు. రూ. 10,53,89,943లు ఉన్న ఖాతాలను పోలీసులు బ్లాక్ చేయించగా, ఈ ఛీటింగ్ గ్యాంగ్ తీసిన అకౌంట్లపై NCRPలో దాదాపు 745 ఫిర్యాదులు ఉన్నాయని పోలీసులు తెలిపారు.
చిల్లర కోసం… కక్కుర్తి పడి…
చైనీయులు వేసిన భారీ స్కెచ్ గురించి విని తమకైతే 2 నుండి 3 శాతం డబ్బు కమిషన్ గా వస్తుందన్న దురాశతో దేశంలోని వివిద ప్రాంతాలకు చెందిన దళారులు వారితో చేతులు కలపడంతో ఒకటి కాదు రెండు ఏకంగా రూ. 712 కోట్లు వారికి ముట్టచెప్పారు. ఇందులో వచ్చేది మాత్రం 2 నుండి 3 శాతం మాత్రమే అయినప్పటికీ తమ పొట్ట నింపుకోవాలన్న దురద్దేశ్యంతో చేసిన సాహసం ఇప్పుడు కటకటాల పాలు చేసింది. అంతే కాకుండా ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక సహకారం అందించే హిజ్బుల్ కు సంబంధించిన మూలాలు కూడా హైదరాబాద్ సిటీ పోలీసులు విచారణలో వెలుగులోకి వచ్చాయంటే భవిష్యత్తులో ఈ నిందుతులపై ఎలాంటి చట్టాలు ఉపయోగించే అవకాశం ఉంటుందో ఊహించుకోవచ్చు. అంతేకాకుండా వీరికి హిజ్బుల్ సంస్థకు సంబంధాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో పీటీ వారెంట్ వేసి ఇక్కడి పోలీసులు విచారించే అవకాశం ఉండగా, నేడో రేపో ఎన్ఐఏ కూడా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉంటాయి.