గుండెల్లో పదిలంగా… భావి తరాలకు తెలిసే విధంగా…

దిశ దశ, వరంగల్:

పుట్టినింటికి… మెట్టినింటికి ఆదర్శప్రాయమైన సేవలందించిన ఆమె స్మృతులను మరవలేకపోతున్నారా కుటుంబ సభ్యులు… నాని… నాని అంటూ అక్కున చేరిపోయే మనవళ్లు తమ మధ్య ఆమె లేదన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు… జీవిత భాగస్వామిగా మూడు దశాబ్దాలకు పైగా తనతో కలిసి నడిచి… తనను నడిపించిన ఆమె కానరాని తీరాలకు చేరడంతో తమ మధ్యే ఆమె ఉండాలని తపన పడ్డరాయన. అనుకున్నదే తడవుగా తన భార్య విగ్రహాన్ని తయారు చేయించారు. వరంగల్ ఉమ్మడి జిల్లా ఖానాపూర్ మండలం బుధవారంపేటకు చెందిన వెంకట నారాయణ తన భార్య సుజాత విగ్రహం ఏర్పాటు చేయించారు. వ్యవసాయ క్షేత్రంలో ఆమె స్మారకంగా ఓ నిర్మాణం చేయించారు. గుండెల్లో పదిలంగా ఉన్న ఆమె అందించిన సేవలను తమ కుటుంబంలోని భావితరాలకు తెలియజేయాలన్న ఆలోచనతో పత్ర్యేకంగా విగ్రహాన్ని తయారు చేయించారు. గత సంవత్సరం సుజాత గుండె సంబంధిత వ్యాధితో మరణించినప్పటికీ ఆమె జ్ఞాపకాలను దూరం చేసుకోలేకపోతున్నారు వెకంట నారాయణ కుటుంబ సభ్యులు. ఇల్లాలిగా సుజాత అందించిన చేదోడు వల్లే తమ పిల్లలు ప్రయోజకులుగా మారారని… 33 ఏళ్ల వైవాహిక బంధంతో ఆమె అందించిన స్పూర్తి మరవలేనిదని వెంకట నారాయణ గుర్తు తెచ్చుకున్నారు. ఆమె స్మృతుల నీడలో జీవనం సాగించాలని భావించడంతో పాటు మనవళ్లు, మనవారళ్లకు కూడా నానమ్మను కళ్లముందు ఉంచాలన్న తపనతో ఏపీలోని తెనాలిలో సుజాత విగ్రహాన్ని తయారు చేయించారు. అర్థాంగిగా తన జీవితంలోకి వచ్చిన సుజాతను మరవలేకపోయిన వెంకట నారాయణ విగ్రహ రూపంలో అయినా సరే తమ మధ్యే ఉండాలని భావించారు. దూరమైన తమ నానిని మా తాతయ్య మళ్లీ తీసుకొచ్చాడంటూ మనవడు శ్రీయాంక్ సంతోషం వ్యక్తం చేస్తున్నాడు.

You cannot copy content of this page