దిశ దశ, దండకారణ్యం:
నక్సల్స్ ఏరివేత లక్ష్యంగా దండకారణ్యంలో సెర్చింగ్ నిర్వహిస్తున్న బలగాలను హతమార్చేందుకు మావోయిస్టులు మందుపాతర పేల్చారు. బీజాపూర్, దంతెవాడ, నారాయణపూర్ సరిహద్దు అడవుల్లో జాయింట్ ఆఫరేషన్ నిర్వహించి వాహనంలో తిరుగు ప్రయాణం అయిన బలగాలను చంపేందుకు మావోయిస్టులు మందుపాతర పేల్చారు. బీజాపూర్ జిల్లాలోని కుత్రు పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబేలి, బేద్రాల సమీపంలో జవాన్లు ప్రయాణిస్తున్న వాహనాన్ని మావోయిస్టులు పేల్చివేశారు. ఈ ఘటనలో 8 మంది DRG జవాన్లు, ఒక డ్రైవర్ అక్కడికక్కడే మరణించారు. మందుపాతర పేలిన విషయాన్ని బస్తర్ రేంజ్ పోలీసు అధికారలు ధృవీకరించారు. మరిన్ని వివరాలు తెలియ రావల్సి ఉంది.
మాసంపు ముద్దలు…
జావాన్లు ప్రయాణిస్తున్న వాహనాన్ని మావోయిస్టు పార్టీ నక్సల్స్ పేల్చివేసిన ఘటనా స్థలం అత్యంత భయానకంగా మారింది. అటవీ ప్రాంతంలో మాటు వేసిన మావోయిస్టులు జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం గురించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ బ్లాస్టింగ్ చేసినట్టుగా స్ఫస్టం అవుతోంది. ఇటీవల కాలంలో దండకారణ్యంలో మావోయిస్టులను ఏరివేయడంలో జవాన్లు అభూజామఢ్ అటవీ ప్రాంతంలోకి చొచ్చుకపోతున్న సంగతి తెలిసిందే. ప్రతికారంతో ఉన్న నక్సల్స్ అంబేలీ అటవీ ప్రాంతంలో బలగాల వాహనాన్ని పేల్చివేశారు. ఈ ఘటనలో చనిపోయిన జవాన్ల మృతదేహాలు మాంసం ముద్దలుగా మిగిలిపోయాయి. ఘటనా స్థలంలో ఓ భారీ సైజు గోతి ఏర్పడగా జవాన్ల అవయవాలు చెల్లాచెదరుగా పడిపోయాయి. సమీపంలోని చెట్లపై కూడా ఎగిరిపడిపోయాయి. వాహనం కూడా తునాతునకలు కావడంతో అందులో ప్రయాణిస్తున్న వారంతా కూడా చనిపోయి ఉంటారని అంచనా వేస్తున్నారు. వాహనంలో ప్రయాణిస్తున్న జవాన్లలో ఒక్కరూ కూడా సేఫ్ గా ఉండకూడదన్న లక్ష్యంతో నక్సల్స్ భారీ ఎత్తున మందు గుండు పెట్టినట్టుగా తెలుస్తోంది.